మన దేశంలో నవంబర్ 26వ తేదీన ‘సంవిధాన్ దివాస్’ లేదా ‘రాజ్యాంగ దినోత్సవం’ పేరుతో వేడుక చేసుకోవటం గత పదేండ్లుగా వస్తున్న ఒక మంచి సంప్రదాయం. అంతకుమునుపు మనకు ఈ ఆనవాయితీ లేదు. ఈ వేడుక నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2015లో నాంది పలికింది. స్వతంత్ర భారత దేశానికి ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న అంతిమంగా ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ రోజు తర్వాత రాజ్యాంగసభ తన పనిని విజయవంతంగా ముగించుకొని, స్వతంత్ర భరతభూమి మీద ఎన్నికలు జరిగేవరకు తాత్కాలిక పార్లమెంట్‌గా అవతరించింది. ఆ విధంగా ఎంతో విశేషమైన చారిత్రక ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది నవంబర్ 26వ తేదీ. ఎందుకో గానీ, 2015కి ముందు ప్రభుత్వాలు నవంబర్ 26 ప్రాముఖ్యాన్ని గుర్తించలేదు. గతం సంగతి ఎలా ఉన్నా నేడు ఆ దినం ప్రాముఖ్యాన్ని గుర్తించి గౌరవించటం వేడుక చేసుకోవటం హర్షించదగిన పరిణామం.
రాజ్యాంగాన్ని నిర్మించటానికి బ్రిటిష్ పాలనలో ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చెయ్యటం గొప్ప ముందడుగు. స్వతంత్ర సమరయోధులు, న్యాయ నిపుణులు, మేధావులు సభ్యులుగా ఉన్న రాజ్యాంగసభ 1946 డిసెంబర్ 9న మొదటిసారి సమావేశమై 1,083 రోజుల పాటు పనిచేసి సుదీర్ఘ చర్చలు జరిపి 1949, నవంబర్ 26న మన ముసాయిదా రాజ్యాంగానికి ఆమోద ముద్ర వేసింది. ముసాయిదా అని ఎందుకంటున్నారంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న కనుక. అప్పటివరకు అది ముసాయిదానే. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26ని ఏటా గణతంత్ర దినోత్సవంగా అత్యంత వైభవంగా వేడుక చేసుకోవటం అందరికీ తెలిసిందే. 2015 నుంచి ఏటా నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా వేడుక చేసుకొనే సంప్రదాయం ఇంకా బాల్యావస్థలోనే ఉన్నది. ప్రజల ఆలోచనావిధానంలో ఈ దినం అంతర్లీనం కావాల్సిన అవసరం ఉన్నది.
మన రాజ్యాంగం ఒక గ్రంథమే కాదు, అది కేవలం ఒక ప్రాథమిక చట్టం కూడా కాదు. ప్రజల ఆశలకు, ఆశయాలకు, కలలకు, కోరికలకు మన రాజ్యాంగం ఒక నిర్దిష్టమైన ప్రతిబింబం. 5 వేల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ భూమి మీద పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరగాలని మనకు మనం చేసుకున్న మొట్టమొదటి ప్రతిజ్ఞ. ఎన్నో వేల ఏండ్లుగా కులం, మతం, లింగం, భాష, ప్రాంతం అన్న సంకుచిత విభేదాలు, వివక్షతలతో తన శక్తిని కోల్పోయి విదేశీ దాస్య శృంఖలాలలో బతికిన ఈ భారత భూమి మొట్టమొదటిసారి ఒక అధునాతన రాజ్యాంగ వ్యవస్థ నిర్మా ణం పూర్తిచేసుకున్న శుభదినం నవంబర్ 26. మనిషికి మనిషికి మధ్య అసమానతలను సృష్టిం చి ఇది సనాతన ధర్మం అని నమ్మించిన సామాజిక వ్యవస్థ మనది. ఈ అసమానతల అగాధా లు ప్రజల్లో ఐకమత్యాన్ని నిర్వీర్యం చేసి ఒక జాతి గా నిలబడటానికి, అభివృద్ధిని సాధించటానికి అడ్డుగోడలుగా నిలిచినవి. ఈ దుస్థితికి సనాతన ధర్మం అనే పేరు తగిలించి ప్రజల్లో దీని పట్ల వ్యతిరేకత రాకుండా జాగ్రత్తపడినవి కొన్ని స్వార్థపరశక్తులు.
ఒకే ఒక్క పెన్నుపోటుతో కులం,మతం, లింగం సృష్టించిన అడ్డుగోడలను బద్దలుకొట్టి భారతీయులందరూ అన్నివిధాలా సమానమైన స్వతంత్ర జాతి అన్న అధునాతన ధర్మాన్ని ఆవిష్కరించిన పవిత్ర గ్రంథం మన రా జ్యాంగం. అది కేవలం ఒక పుస్తకం కాదు. ప్రజల విశ్వాసానికి, పాలనా విలువలకు మన రాజ్యాంగం ప్రతిరూపం. అది మన ఆశల సౌధం. సనాతన ధర్మాన్ని పక్కకునెట్టి, ఈ అధునాతన ధర్మాన్ని రాజ్యాంగసభలో ఏకగ్రీవ అంగీకారం తో ఆమోదించుకొని మనకు మనం కానుకగా ఇచ్చుకున్న చారిత్రక శుభదినం నవంబరు 26.
రాజుల వ్యవస్థకు స్వస్తి పలికి రాజ్యాధికారం మారటానికి ప్రజాభీష్టం మేరకు జరిగిన ఎన్నికలే ప్రాతిపదిక అన్న ఒప్పందం చేసుకున్నాం మన రాజ్యాంగం ద్వారా. పార్లమెంట్, అసెంబ్లీలు చేసే చట్టాలు గానీ, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు గానీ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలన్న సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకున్న రోజు నవంబర్ 26. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగాలని, ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వాలు ఉండాలని, ప్రజలు ఎన్నుకున్న చట్టసభలకు పాలకులు సమాధానం చెప్పాలని, చట్టసభల విశ్వాసం ఉన్నంతవరకే పాలకులు అధికారంలో ఉంటారని మనం నవంబర్ 26న ఆమోదించుకున్న రాజ్యాంగంలో సుస్పష్టంగా పొందుపరుచుకున్నాం. కానీ, నేడు జరుగుతున్నదేమిటి? న్యాయవాదులకు బతుకుదెరువుగా రాజ్యాంగం మారింది గానీ, ప్రజల బతుకులను తీర్చిదిద్దే ఆయుధం అన్న సత్యం మరుగున పడింది. రాజకీయ పార్టీల చేతిలో కీలుబొమ్మలా రాజ్యాంగం మారిపోయింది.
రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. న్యాయస్థానాలు చోద్యం చూస్తున్నాయి గానీ స్పందించవలసిన రీతిలో స్పందించటం లేదన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొన్న విషయాన్ని కాదనగలమా? ఇటీవల బిల్లుల విషయంలో కాలయాపన మీద సుప్రీంకోర్టు వెలువరించిన అభిప్రాయం విస్మయం కలిగించేదిగా ఉన్నది. రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ శాసనసభ ఆమోదంతో తమ వద్దకు వచ్చిన బిల్లులకు అనుమతి ఇచ్చే విషయంలో ఎన్నేండ్లయినా నిర్ణయం తీసుకోకుండా కూర్చోవచ్చని చెప్పేయటం విడ్డూరంగా లేదూ? ఈ తీర్పు రాజకీయ ప్రేరేపణతో చేసే కాలయాపనకు ఆమోదముద్ర వేసినట్టే కదా! సమాజంలో జరుగుతున్న అకృత్యాలను ఎలుగెత్తి చూపాల్సిన ప్రధాన మీడియా సంస్థలు వారి వారి వ్యాపార ప్రయోజనాల కోసం పత్రికా స్వేచ్ఛను పణంగా పెట్టి పాలకుల ముందు మోకరిల్లుతున్న పరిస్థితిని మనం నిత్యం చూస్తున్నాం. పాలకులతో కలిసి రాజ్యాంగస్ఫూర్తిని గాలికి వదిలేశాం.
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు అయిన ఎన్నికల ప్రక్రియ ధన ప్రవాహంతో కలుషితమైపోయింది. గెలుపు గుర్రాలను బరిలోకి దింపే నెపంతో ఎన్నికలను రాజకీయ పార్టీలు కలుషితం చేస్తుంటే, పవిత్రమైన ఓటును అమ్ముకోవటం ద్వారా పౌరులుగా మరింత కలుషితం చేస్తున్నాం. దీన్ని కాదనగలమా? ప్రతిదానికీ, రాజకీయ నేతలను నిందించటం మనకు పరిపాటి అయింది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి చేరిన కాలుష్యానికి ప్రజలు కూడా కారణమే అన్న నగ్న సత్యాన్ని విస్మరిస్తూ, పరనిందతో సరిపెట్టుకుంటున్న వైఖరికి ప్రజలు స్వస్తి చెప్పి, రాజ్యాంగం పట్ల మన బాధ్యతను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. వాస్తవంగా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కనీసం, ఇప్పుడైనా మేలుకోవాలి. రా జ్యాంగం అనేది హక్కులను కల్పించే పుస్తకం మా త్రమే కాదు, మన ప్రాథమిక బాధ్యతలను గుర్తుచేసే గ్రంథం కూడా. అందుకే రాజ్యాంగం పట్ల సమాజంలో అన్ని వర్గాలవారికి అవగాహన కలగాలి. ఈ అవగాహనతోనే పౌరులుగా మన బాధ్యతలను తెలుసుకోగలం. ఈ అవగాహనతోనే పాలకుల పనితీరును సరిగ్గా అంచనా వేయగలం. అం దుకే ఇది ఒక రోజుతో ముగిసే వేడుకగా మిగిలిపోకుండా నిరంతరం మన మదిలో మెదిలేలా చర్య లు చేపట్టాలి. కేవలం పాఠశాలలే కాకుండా కాలేజీలు విశ్వవిద్యాలయాలు నిర్వహించే అన్ని కోర్సు ల్లో రాజ్యాంగాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలి.
పాఠశాలల్లో పసి పిల్లల చేత ప్రమాణం చేయించి చేతులు దులుపుకొనే ప్రహసనంగా మార్చకూడదు ఈ సందర్భాన్ని. రాజ్యాంగంలోని ప్రధాన అంశాలైన పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక బాధ్యతలను పాఠ్యంశాలుగా చేర్చాలి. వీటి మీద ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజిమెంట్ లాంటి ఉన్నత చదువుల్లో కూడా రాజ్యాంగపరమైన అంశాలను బోధించాలి.
వారిలో రాజ్యాంగం పట్ల సరైన అవగాహన కల్పించాలి. మన రాజ్యాంగం జాతి మొత్తాన్ని ఒక తాటిమీదికి తీసుకొచ్చే ఐక్యతారాగం కావాలి. దానికి ఆ శక్తి ఉన్నది. కానీ, మనమే గుర్తించలేకపోతున్నాం. మనల్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే ఆయుధం మన రాజ్యాంగం అన్న నిజాన్ని నెమరు వేసుకునే సందర్భం కావాలి రాజ్యాంగ దినోత్సవం. అప్పుడే ఈ వేడుకకు ఒక అర్థం, పరమార్థం ఉంటాయి. ఇది ఒక తంతుగా మిగిలిపోకూడదని కోరుకుందాం.
-గుమ్మడిదల రంగారావు