Joint Pains | మారిన జీవన విధానం కారణంగా 30 ఏళ్ల వయసులోనే చాలా మంది కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఇప్పుడు సర్వసాధారణం అయ్యిందని చెప్పవచ్చు. ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల వెన్నునొప్పి, మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ల నొప్పులు, ల్యాప్టాప్ లు ఉపయోగించడం వల్ల భుజాల నొప్పి వంటి సమస్యలతో బాధపడే యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే చాలా మంది ఈ నొప్పులను తేలికగా తీసుకుంటూ ఉంటారు. కానీ 30 ఏళ్ల వయసులో వచ్చే ఈ నొప్పులను తేలికగా తీసుకోకూడదని, వీటిని విస్మరించకూడదని వైద్యులు చెబుతున్నారు. కొన్ని రకాల నొప్పులను జీవనశైలిలో మార్పుల ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే కొన్ని రకాల నొప్పులకు మాత్రం తప్పకుండా చికిత్స తీసుకోవాలని లేదంటే అవి మరింత తీవ్రమయ్యి కీళ్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నొప్పులకు ప్రధాన కారణం జీవనశైలినే అని కూడా వారు చెబుతున్నారు.
ఆఫీన్ లో డెస్క్ ల వద్ద కూర్చోవడం, సెల్ఫోన్ స్క్రోల్ చేస్తూ కూర్చోవడం వల్ల ఈ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. శారీరక శ్రమ తగ్గడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల, ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి. వెన్నెముక, తుంటి, మోకాళ్లు, భుజాలు వంటి కీళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. కూర్చునేటప్పుడు సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల మెడ, వీపుపై కూడా ఒత్తిడి పడుతుంది. దీంతో కాలక్రమేణా కండరాలు బలహీనంగా తయారవ్వడంతోపాటు నొప్పికి కూడా దారి తీస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యల నుండి సులంగా బయటపడవచ్చు.
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన భంగిమలో కూర్చోవడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, సాగదీసే వ్యాయామాలు చేయడం వల్ల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. అలాగే ఫిజియోథెరపీ, గైడెడ్ వర్కౌట్లు చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. కీళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక జీవనశైలిలో మార్పులు చేసినప్పటికీ కీళ్ల నొప్పులు తగ్గకపోతే అది కీలు లోపల నిర్మాణ సమస్యలను సూచిస్తుంది. కీళ్ల నొప్పులతో పాటు కీళ్ల చుట్టూ వాపు, విశ్రాంతి సమయంలో కూడా నొప్పి ఉండడం, కీళ్లు కదిలించేటప్పుడు శబ్దాలు రావడం వంటి లక్షణాలను విస్మరించకూడదు. ఈ లక్షణాలు మృదులాస్థి దెబ్బతినడం, స్నాయువు ఒత్తిడి వంటి సమస్యలను సూచిస్తాయి. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. 30 ఏళ్ల వయసులో కీళ్ల నొప్పులు రావడం సాధారణమైన విషయం కాదని ఇవి మన జీవనశైలికి ఒక హెచ్చరిక సంకేతం వంటివి అని ఈ నొప్పులను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.