– నియామక పత్రం అందజేసిన ఆర్డీఓ, ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ దయానందరాణి
కోదాడ, ఫిబ్రవరి 26 : సీఎంఆర్ఎఫ్ అవినీతి అంశంలో పోలీస్ కస్టడీలో మృతి చెందిన కర్ల రాజేశ్ తల్లి లలితమ్మకు గురువారం ఉద్యోగ నియామక పత్రాన్ని ఆర్డీఓ సూర్యనారాయణ, ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ దయానందరాణి అందజేశారు. పోలీసుల చిత్రహింసలకు గురై కర్ల రాజేశ్ మరణించాడని, అందుకు కారణమైన చిలుకూరు ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని కోదాడ పట్టణంలో ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు పలు దళిత సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రుడు గతవారం రోజుల క్రితం రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించి తక్షణమే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖలో లలితమ్మకు ఉద్యోగ అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు నరేశ్ మాదిగ, బచ్చలకూరి వెంకటేశ్వర్లు, ఏపూరి రాజు, కొండపల్లి ఆంజనేయులు, రాము, కోటేశ్, నాగరాజు, ప్రసాద్, శ్రీను, వెంకట్రావు, నవీన్ పాల్గొన్నారు.