Papaya Leaves Juice | వర్షాకాలంలో డెంగీ కేసులు పెరుగుతుండటంతో ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి ఏం చేయాలనే అంశంపై చాలామందిలో ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా బొప్పాయి ఆకుల రసం ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచుతుందనే నమ్మకం చాలాకాలంగా ఉంది. దీనిపై కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి. అయితే బొప్పాయి ఆకులు డెంగీకు చికిత్సగా పనిచేస్తాయా, వాటిని ఎలా ఉపయోగించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. డెంగీ సోకినప్పుడు రక్తంలోని ప్లేట్లెట్ కౌంట్ వేగంగా తగ్గడం ఒక ముఖ్యమైన సమస్యగా మారుతుంది. దీన్ని థ్రాంబోసైటోపీనియా అంటారు. ప్లేట్లెట్ కౌంట్‌ను వైద్యుల సూచన మేరకు నిరంతరం పర్యవేక్షించడం అవసరం. ఈ కారణంగానే కొంతమంది డెంగీ రోగులకు ఆసుపత్రిలో చికిత్స అవసరమవుతుంది. బొప్పాయి ఆకులను, ముఖ్యంగా కారికా పపాయా ఆకుల ఎక్స్ట్రాక్ట్ను, డెంగీ సమయంలో ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచేందుకు సంప్రదాయంగా ఉపయోగిస్తున్నారు. బొప్పాయి ఆకుల్లోని కొన్ని పదార్థాలు రక్తంలోని ప్లేట్లెట్ల ఉత్పత్తికి సంబంధించిన ప్రక్రియలకు సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలోక్స్ 12, పీటీఏఎఫ్ఆర్ వంటి జన్యువులు ప్లేట్లెట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.
బొప్పాయి ఆకుల్లో కార్పైన్, ఫ్లేవనాయిడ్లు, క్వెర్సెటిన్, కెంప్ఫెరోల్, క్లోరోజెనిక్ యాసిడ్, పపైన్, కైమోపపైన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న పదార్థాలుగా ఉన్నాయి. అలాగే బొప్పాయి ఆకుల ఎక్స్ట్రాక్ట్లో రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడే కొన్ని లక్షణాలు ఉంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. డెంగీ రోగుల్లో బొప్పాయి ఆకుల ఎక్స్ట్రాక్ట్ ప్రభావంపై బీఎంసీ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ప్లస్ వన్ వంటి జర్నల్స్‌లో పరిశోధనలు ప్రచురితమయ్యాయి. కొన్ని అధ్యయనాల్లో బొప్పాయి ఆకుల ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నవారిలో రక్తంలోని ప్లేట్లెట్ కౌంట్ 50,000/uL కంటే ఎక్కువగా పెరిగే అవకాశం కనిపించింది. అయితే ఈ పరిశోధనలు పరిమిత సంఖ్యలో డెంగీ రోగులపై జరిగాయి. అందువల్ల బొప్పాయి ఆకులు డెంగీ రోగులందరిలోనూ ప్లేట్లెట్ కౌంట్‌ను కచ్చితంగా పెంచుతాయని నిర్ధారించడానికి మరింత విస్తృతమైన పరిశోధనలు అవసరం. బొప్పాయి ఆకుల రసం శరీరంలో సులభంగా శోషణకు గురవుతుందని, ప్లేట్లెట్ కౌంట్ పెరగడానికి సహాయపడుతుంని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎంత పరిమాణంలో, ఎప్పుడు తీసుకోవాలనే విషయంలో జాగ్రత్త అవసరం. అంతేకాకుండా బొప్పాయి ఆకుల రసం చాలా చేదుగా ఉండటం వల్ల కొంతమందికి దాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది.
అయితే బొప్పాయి ఆకుల రసం డెంగీను పూర్తిగా నయం చేస్తుందని భావించడం తప్పు. ఇది గరిష్ఠంగా సహాయక చర్యగా మాత్రమే పరిగణించాలి. ముఖ్యంగా ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచే అవకాశం మాత్రమే దాని పరిశోధనల్లో కనిపించింది. డెంగీ చికిత్సకు బొప్పాయి ఆకుల రసం వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. కడుపులో అసౌకర్యం, వికారం, అలర్జిక్ రియాక్షన్లు వంటి సమస్యలు వస్తాయి. గర్భిణీలు దీనిని తీసుకునే విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి. అలాగే డెంగీ చికిత్సలో ఉపయోగించే కొన్ని మందులతో ఇది పరస్పర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో, వైద్యుల సలహా లేకుండా తీసుకోవడం మంచిది కాదు. డెంగీ ఉన్నట్లు అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. కొంతమందికి ఆసుపత్రిలో చికిత్స అవసరం అవుతుంది. మరికొందరు ఇంట్లోనే చికిత్స పొందినా, వైద్యుల సూచన మేరకు రక్త పరీక్షలు, ప్లేట్లెట్ కౌంట్‌ను పర్యవేక్షిస్తూ ఉండాలి. ముఖ్యంగా డెంగీ సమయంలో కనిపించే హెచ్చరిక లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
డెంగీ నుంచి కోలుకునే సమయంలో శరీరంలో నీరు తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కొబ్బరి నీరు, ఓఆర్ఎస్, తాజా పండ్లు, పండ్ల రసాలు, సూప్‌లు, తగినంత ద్రవాలు తీసుకోవడం ద్వారా హైడ్రేషన్‌ను కొనసాగించవచ్చు. అలాగే శరీరానికి అవసరమైన ప్రొటీన్ అందేలా పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. డెంగీ సమయంలో స్వయంగా మందులు తీసుకోవడం లేదా ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడడం ప్రమాదకరం. బొప్పాయి ఆకుల రసం తీసుకోవాలని అనుకుంటే ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా ఇప్పటికే మందులు వాడుతున్నవారు, గర్భిణీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన లేకుండా దీనిని ఉపయోగించకూడదు. డెంగీ చికిత్సలో వైద్య పర్యవేక్షణ, తగినంత ద్రవాలు, అవసరమైన పరీక్షలు, సరైన పోషకాహారమే ప్రధానమైనవని నిపుణులు తెలియజేస్తున్నారు.