అసలు ఈ పెబుత్తానికి పేదోళ్లంటే జాల్లేదురా! ఏ గరీబోడికైనా ఏదైనా అందిందా!?
అసలు ఈ పెబుత్తానికి పేదోళ్లంటే జాల్లేదురా! ‘అన్నీ ఊరికే ఇత్తున్నాం! అదుగో వత్తుంది-ఇదిగో వత్తుంది’ అంటూ మైకుల ముందు ఊదర కొట్టడం తప్ప.. ఏ గరీబోడికైనా ఏదైనా అందిందా!? కాకుల్ని గొట్టి గద్దలకు పెట్టినట్టు మన పేరు చెప్పుకోడం వాళ్లు వాళ్లు దండుకోడం.. ఇదే తంతు”. ఇది ‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన పీనుగ కథలోని వ్యథ.
కథ, పీనుగ
ఆ పూట అప్పుడే పొద్దుపొడుస్తున్నది. రాత్రి కరెంట్ కావడంతో తెల్లవారుజాము నాలుగు గంటల వరకు చేలకి నీళ్లు కట్టి, వేప పుల్లలతో పళ్లు తోముకుంటూ.. ఊరి నడిమధ్యలో ఉన్న అరుగుకాడికి చేరారు చుట్టుపక్కల చేల రైతులు. రాత్రి కరెంటయితే తెల్లవార్లు పొలాలకు నీళ్లు కట్టడం, కొంచెం పొద్దు పొడిసేదాకా ఒకళ్ల పంటల గురించి ఒకళ్లు విచారించుకోవడం ఎప్పుడూ జరిగే పనే. ఆరోజు కూడా అట్లానే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉన్నట్టుండి సన్నని ఏడుపు శబ్దాలు కొంచెం దూరంనుండి లీలగా వాళ్ల చెవులను చేరాయి.
“ఎవుర్రా అది. ఈ వరకాడ ఏడుత్తున్నరు. రాండ్రా సూసొద్దాం” అన్న పుల్లయ్య పిలుపుతో అందరూ ఒకరెమ్మటి ఒకరు కదిలారు.
రాములోరి గుడి పక్కసందులో సర్పంచ్ చలమయ్య ఇంటిలో నుండి వస్తున్న ఏడుపులు అవి. ఇంటిలోకి వెళ్లిచూడగానే ఉలిక్కిపడ్డారంతా. మంచం చుట్టూ కూర్చోని ఏడుస్తున్నారు ఇంట్లో వాళ్లంతా. భార్య వెంకాయమ్మ అయితే.. ఎవరూ ఓదార్చలేనంతగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. గుమ్మానికి ఆనుకొని తండ్రి వంకే చూస్తా ఉన్నాడు ఒక్కగానొక్క కొడుకు వెంకట్రావు. ఇరవయేళ్ల నుండి తిరుగులేకుండా సర్పంచ్‌గా ఊరిని ఏలుతున్న
చలమయ్య.. మంచం మీద నిర్జీవంగా
పడుకొని ఉన్నాడు.
సూర్యుడు మెల్లగా భూమిని ఆవరిస్తుండగా సర్పంచ్ చలమయ్య చావువార్త ఊరంతా పాకిపోయింది. వార్త చేరిన ప్రతీ ఇంటినుండి ఎవరో ఒకరు వచ్చి చూస్తున్నారు. పాల క్యాన్లు చేత బట్టుకొని వచ్చినోళ్లు, గడ్డిమోపు బండిమీదనే ఉంచి వచ్చినోళ్లు… వారిలో కొందరు టెంటు పైకి లేపి, కుర్చీలు సర్దడంలో సాయం చేస్తున్నారు. ఆ పొద్దు సగం ఊరంతా ఆన్నె ఉంది. చూస్తుండగానే పొద్దు నడినెత్తి మీదికి వచ్చింది. మందికూడా పలసనై పోతున్నారు.
“ఇంకా వచ్చేవాళ్లు ఎవురైనా ఉన్నార్రా వెంకట్రావా?” అడిగాడు ఊరిపెద్దల్లో ఒకాయన.
వెంకట్రావు నుండి ఉలూకూ పలుకు లేదు. ఆ పెద్ద మళ్లీ అందుకొని..
“అందరూ వచ్చినట్టయితే జరగాల్సిన కార్యక్రమం కానిద్దాం. మళ్లీ పొద్దుగూంకేదాకా ఉంటే పీనుగ వాసన రాదా?”… వెంకట్రావు మాట్లాడలేదు.
ఆడున్న అందరూ వెంకట్రావు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. వెంకట్రావు మాత్రం టెంటుకేసిన కర్రను ఆనుకొని.. తండ్రి వంకే తీక్షణంగా చూస్తున్నాడు. తెల్లవారు జామున గుమ్మానికి ఆనుకొని ఎట్లాగైతే పీనుగొంక చూసినాడో.. ఇంకా అదే చూపు.
వెంకట్రావు నుండి ఎంతకూ బదులు రాకపోడంతో, అతనికి బావ వరసయ్యే హనుమంతుకి సైగ చేశాడు పెద్ద.
వెంకట్రావు కాడికిపొయ్యి హనుమంతు ఏదో చెబుతుంటే..
“ఏంది బావా తీసేదీ!? ఆ పాలెపోల్ల ఎవారం తేలకుండా మా అయ్య పీనుగను కదిలిచ్చేదే లేదు” గట్టిగా అరిచాడు.
చలమయ్య భార్య సహా ఆడున్న అందరూ ఉలిక్కిపడ్డారు. పొద్దుట్నించి టెంటేసి, కుర్చీలు సర్ది, వచ్చినోల్లందరికీ టీలు ఇస్తూ కూర్చున్న పాలెపోళ్లూ జడుసుకున్నారు.
“అరే! ఆ ఎవారాలు ఇప్పుడా మాట్టాడేది!? ముందు జరగాల్సిన కార్యం జరిపినాక పెద్దమనుషులతో పంచాయితీ పెడదాం లేబ్బయా! ముందు ఇది కానియ్యి” అన్నాడు డీలర్ శేషగిరి.
“ఏంది మామా కానిచ్చేది!? ఈడు బతికున్నప్పుడే రూపాయి ఇయ్యనోళ్లు, సచ్చినాక ఇత్తరా! ఇది అటోయిటో తెగేదాక మా అయ్యను ఎవురూ ముట్టడానికి ఈల్లేదు”..
ఎవరూ మాట్లాడటానికి సందియ్యకుండా కర్కశంగా చెప్పాడు వెంకట్రావు.
చుట్టూరు అంతా నిశ్శబ్దం. ఏడుపు శబ్దాలు కూడా బయటికి రానంత నిశ్శబ్దం. ఎవరయిన మాట్లాడితే మళ్లీ తిరిగి ఏం మాటలు కాయాల్సి వస్తదోనన్న బెరుకు అందర్నీ మిన్నకుండి పోయేటట్లు చేసింది.
“ఈడసలే గొడెం దెగినోడు! ఎవురిమాటా ఇనోడు గాదు!” అని సణుగుతూ… “ఏందిరా ముసలాయి… మీరందరూ ఈన్నే ఉన్నారుగా. మరి ఏదోకటి తేల్చి కానియండి” అన్న డీలర్ మాటలకు.. అప్పటిదాకా అక్కడే ఉండి అన్నిపనులూ చూసుకుంటున్న పాలెపోళ్ల ముఖాలు నెత్తురుబొట్టు లేనట్టు పాలిపోయాయి. ఏం మాట్లాడలేని స్థితిలో ఒకరెమ్మిటి ఒకరు కండువలు దులుపుకొంటూ పల్లెకి కదిలారు.
పల్లెలో పంచాయితీ. నాలుగు బజార్లు దండోరా మోగింది. ఇంటికో మనిషి బడికొట్టం కాడికి రావాలన్నరు. ఉన్నఫలంగా రమ్మన్నరు. అందరూ గుమిగూడారు. అందరికీ అంతా తెలుసు.
“ఏం జేద్దాంరా! ఆయనేమో సచ్చిపోయిండు. కొడుకేమో బాకీ డబ్బులు ఇత్తేగానీ కాటికి తీసకుపోయేది లేదని పట్టుబట్టిండు. మనయేమో రెంటెకి తప్పిన బతుకులాయే. ఇప్పుడికిప్పుడు బాకీ కట్టలేమూ! అట్టని వాడికి నచ్చజెప్పి ఒప్పించలేము” బాధనంతా గొంతులో నింపుకొని అన్నాడు పల్లె పెద్దల్లో ఒకరైన లచ్చుమయ్య.
ఎవరూ నోరు మెదపలేదు. ఎవురకివాళ్లు మిన్నకుండి పోయారు. అందరి కళ్లలో ఒకటే భావం.. ఈ ఉపద్రవాన్ని ఎట్టా దాటాలా!? అని.
* * *
దాదాపు ఇరవై ఏళ్ల కిందటి యవారం ఇది. అప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పేదోల్లందరికీ ఇల్లు కట్టిస్తామని ‘పక్కా ఇల్లు’ పథకం పెట్టారుగా.. అదుగో అప్పుడు జరిగింది. ఒకరిద్దరియి తప్ప పల్లెలో ఉన్నోళ్లందరివీ పూరిల్లే.
“ఇన్నాళ్లకు ప్రభుత్వానికి పేదోడి గోడుపట్టిందిరా… బిల్డింగులు కట్టిస్తారంటా. కానీ, బేసుమట్టం సొంతడబ్బులతో కట్టుకోవాలి. తరవాత ఆఫీసర్లు వచ్చి పోటో తీసుకొని బిల్లు పెడతారు. ఆపైన అట్టవలు లెవలుకి ఒక బిల్లు, స్లాబుకి ఇంకో బిల్లు. ఇట్లా మూడు తడవల్లో బిల్డింగు మొత్తానికి డబ్బులిస్తరు” పల్లెలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా ఇవే మాటలు.
అంతా బాగనే ఉంది. ముందే డబ్బులు పెట్టుకోవాలంటేనే బాధ. చెరుక్కొట్టడానికి, బేల్దారీ పన్లకి తీసుకునే అడ్వాన్సులు – అప్పులకు వడ్డీలు, పిల్లల చదువులు, ఇంటికాడుండే ముసలోళ్ల తిండికి జరపడానికే సరిపోవడం లేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఎక్కడనుండి వస్తాయి? కానీ ఆశ. వానొస్తే సూరులల్లో నుండి కారే నీళ్లకు బకీట్లు, డేశాలు పెట్టుకునే రోజుల నుండి.. గట్టి గాలొస్తే పైకప్పుకేసిన జమ్ము ఎగిరిపోయే రోజుల నుండి.. బయటపడే రోజొచ్చిందే అనే ఆశ. కానీ, ఎట్లా చేసేది. ఉన్న బాకీలకే అసలు కట్టలేక వడ్డీలతో నెట్టుకొస్తున్న వాళ్లకి, మళ్లీ అప్పు పుట్టేదెట్లా! అంతా అగమ్యగోచరం.
“అసలు ఈ పెబుత్తానికి పేదోళ్లంటే జాల్లేదురా! ‘అన్నీ ఊరికే ఇత్తున్నాం! అదుగో వత్తుంది-ఇదిగో వత్తుంది’ అంటూ మైకుల ముందు ఊదర కొట్టడం తప్ప.. ఏ గరీబోడికైనా ఏదైనా అందిందా!? ఏ ఒక్కడైనా ఈ పెబుత్త పథకాల వల్ల పేదతనం నుండి బయటపడ్డాడా!? కాకుల్ని గొట్టి గద్దలకు పెట్టినట్టు మన పేరు చెప్పుకోడం వాళ్లు వాళ్లు దండుకోడం.. ఇదే తంతు”
“నువ్వు డబ్బులు తీసుకొని ఇల్లు కట్టకపోతే.. అది పెబుత్తానికి నట్టం కాదా!?”
“అట్టనుకుంటే వాళ్లనే వచ్చి కట్టిపొమ్మను”
“ఆ.. వత్తరు! నువ్వొక్కడివే మొనగాడివి దేశంలో! నీకోసం వత్తరు. నీ అసుమంటి, నా అసుమంటి వాళ్లు కోట్లల్లో ఉంటరు”
అలా పల్లెలో ఏదైనా అయితే.. ఇలా అరుగు దగ్గర వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి.
“అరెయ్… వాళ్లేమి తిక్కలోళ్లయ్యి పథకాలు పెట్టర్రా. నీకే డైరెక్ట్‌గా అన్నీ వత్తే.. ఈడున్న వాళ్ల కులపోల్ల మాటలు నువ్వు లెక్కజేత్తవా!? సేతులు గట్టుకొని వాళ్లెమ్మిటీ పంచాయతీ ఆఫీస్‌ల సుట్టూతా తిరుగుతవా. ఇదంతా రాజకీయం. వాళ్లు పైనుండి మనల్ని పరిపాలిత్తుంటే, ఈళ్లు ఈడుండి మనల్ని ఏలుతుంటరు. వాళ్లకు వాళ్లకు ఆ సఖ్యత ఉంటది” అన్నాడు దాసు.
విజయదాసుని పల్లెలో అందరూ ‘బునుగు దాసు’ అంటారు. ముప్పై అయిదేళ్లు ఉంటయి. పల్లెలో ఎవరైనా తన్నిచ్చుకున్న, తన్నొచ్చినా పోలీస్టేషన్ల దగ్గర గట్టిగా నిలబడి పంచాయితీ తీర్చేది దాసే.
“ఈడు నిఖార్షయినోడ్రా! ఇట్టాంటోడు గెలవాలి” అని అనేవాళ్లే గానీ.. ఏనాడూ సర్పంచ్ ఎలక్షన్లో దాసుకి ఓటేసినోడే లేడు. దాసు ఎన్ని మాటలు చెప్పినా.. ఒక్కడూ వినేవాడేకాదు. అదనంగా వాడి మాటలకు ఏమొచ్చేలే అని పూచీక పుల్ల మాదిరి కొట్టి పారెస్తారు. అట్లా మాట్టాడ్డం మొదలు పెట్టాడో లేదో, అరుగు మీద కూర్చున్నోళ్లందరూ..
“అబ్బా! ఈడు మొదలు పెట్టిండ్రా” అని సల్లగా సర్దుకున్నరు.
ఆ మరుసటి రోజు లింగయ్యని వెంటపెట్టుకొని అరుక్కాడికి వచ్చాడు చలమయ్య.
“ఏందిరా.. అందరికీ ఇండ్లు వచ్చినయంటగా! లింగడు వచ్చి చెప్పేదాక నేనెరగకపోతినే! మీరయినా నాకొక మాట చెప్పాల్సిందిగా! సరేలే అయిందేదో అయింది. నేను లింగడికి బెమ్మ నాయుడి కొట్టులో సిమెంటు, ఇటెకలు ఇంగా అవసరమైందేదో తెచ్చుకొమ్మని ఖాతా జెప్పినా. మీలో ఎవురెవురికి అవసరం ఉందో ఒక లిస్ట్ రాసిస్తే మీక్కూడా జెవుతా!” అంటూ చెప్పుకొంటూ పోయాడు చలమయ్య.
అక్కడ ఉన్నోళ్లందరికీ ఏమి జరుతుందో అర్థం కాలేదు. అరక్షణం ఆగి ఆలోచించాక.. వాళ్ల కళ్లలో చమ్మ ధారగా ముఖం మీదకు జారింది.
‘ఇది కల కాదు. నడి బజార్లో, నలుగురు తిరిగే బాటలో చెప్పిన మాట. ఆ మాట తప్పడు చలమయ్య. కట్టుకోవాలి. బిల్డింగ్ కట్టుకోవాలి. బతుకుదెరువు కోసం దేశాలు పోయి వచ్చేనాటికి ఇంటికాడ ముసలోళ్లు, పిల్లలు భద్రంగా ఉంటారనే నమ్మకం లేకుండా ఉండే రోజులు పోవాలి. ఇక మీదట అలాంటి రోజులు రాకూడదు. ఒక్క గదైనా చాలు, ఒక నీడ కావాలి. ఒక ఇల్లు కావాలి. ఆ ఇల్లు బిల్డింగై ఉండాలి’ అందరి కళ్లల్లో ఒకటే భావం.
చాన్నాళ్ల నుండి చలమయ్యకి సర్పంచ్ అవ్వాలనే కోరిక. ఊరోళ్లెవరూ ఆయనతో నడవరు. ఆయన చెప్పింది వినరు. చలమయ్య పొలాలన్నీ పాలెపోల్ల చేలకి పక్కనే ఉండటం, పల్లె జనాల చిన్నాచితకా గట్టు పంచాయితీలను తీరుస్తుండటంతో తక్కిన ఊరోళ్లకంటే పాలెపోల్లకి చలమయ్యతో కొంచెం చనువెక్కువే.
ఆ చనువును ఓట్లుగా మళ్లించుకోవాలని అనుకుంటున్నప్పుడు ఈ ఇళ్ల పథకం చలమయ్యకి బాగా కలిసొచ్చింది.
చలమయ్య చెప్పినట్లుగానే బిల్డింగులు కట్టుకోడానికి కావాల్సిన సామాన్లు అంతా ఏర్పాటు చేశాడు. బేసుమట్టం దాకా కట్టుకున్నారు. ఆఫీసర్లు వచ్చారు. ప్రతీ బేసుమట్టం దగ్గర ఫొటోలు తీసుకున్నారు. మూడు రోజుల తర్వాత బిల్లులు వచ్చాయి. ఊరంతా బడికొట్టం దగ్గరికి చేరారు. ఒక్కొక్కరి పేరు పిలుస్తున్నరు ఆఫీసర్లు. పేర్లు పిలిచిన అందరూ వస్తున్నారు. బిల్లును తీసుకుంటున్నారు. పక్కనే కూర్చున్న చలమయ్య చేతిలో పెట్టి వెళ్లిపోతున్నారు. అందరిదీ అదే బాట. ఎంత వచ్చిందో లెక్క తెలిసినా, లెక్కపెట్టేంత సమయం కూడా లేకుండానే డబ్బులు చేతులు మారుతున్నాయి. అట్లా బేసుమట్టం అయిపోయింది. గోడలు కూడా దరవాజ లెవలుకు లేచాయి. కొన్నాల్టికి శ్లాౠ పూర్తయింది. ఇంటింటికీ తిరిగి ప్రతీ ఇల్లును ప్రారంభం చేశాడు చలమయ్య. ఇంటింటిలో ఒక ప్రామిసరీ నోటు, దాంతోపాటు పద్దుల పుస్తకమూ తీశాడు.
‘నీ ఇంటికి ఇంతయింది’ అన్నాడు. ‘గవర్నమెంట్ ఇంతే ఇచ్చింది’ అని చెప్పాడు. ‘మీరు నాకు ఇంకా ఇంత ఇవ్వాలి’ అని లెక్కలేశాడు. ‘మీరిప్పుడే ఇయ్యలేరని నాకు తెలుసు!’ అని జాలి చూపించాడు. ‘అందుకే ఖాళీ ప్రామిసరీ నోటు మీద వేలిముద్ర వేయండి’ అని అసలు సంగతికి వచ్చాడు. వాళ్లు మారు మాట్లాడలేదు. సిమెంట్ బస్తా మార్కెట్ ధర కంటే రెండింతలు ఎక్కువెందుకుందని అడగలేదు. ఇటుక రేటులో మార్పులను ప్రశ్నించలేదు. వేలిముద్రలు వేశారు. సాక్షులుగా ఆరుగురు గ్రామ పెద్దలతో మార్చి మార్చి వేలిముద్రలు అద్దించాడు. ఏడాది తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ గెలిచాడు. మల్లోపాలి గెలిచాడు. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. చచ్చిపోయేదాకా ఏనాడూ ఓడిపోలేదు. కాదు.. పాలెపోల్లు ఓడించలేదు.
* * *
పల్లెలో ఒక్కో పెద్ద మాట్లాడుతున్నారు. “చావుతో కూడుకున్న యవారం రా అయ్యా! మనమే ఏదో ఒకటి జెయ్యాలి. ఆమిడి మేలపోడు పీనుగను తియ్యకపోతే ఊరికి రేపు ఏదన్నా అయినా.. అందరూ మనదిక్కే ఏళ్లు జూపిత్తరు” దుఃఖం నిండిన గొంతుతో చెప్పారు.
“ఏం జేత్తాం పెదయా? ఇంకా ఏం జెయ్యాలి. ఎప్పుడో ఇరవై ఏళ్ల నాడు ఇండ్లు కట్టించిండని నాటి నుండి నేటి దాకా అప్పులు తీరుత్తనే ఉన్నరు. కట్టిచ్చిన రెండు గదులకు గవర్నమెంట్ డబ్బులు సరిపోక, కట్టిన డబ్బులు, కడుతున్న డబ్బులు ఏయీ సరిపోక ఎట్టుంటయ్!? ఏనాడైన మీలో ఎవురయిన ఆయన్ని లెక్క అడిగిర్రా? మన తిరిపి కక్కయ్యని జూడు. పెళ్లీడుకొచ్చిన ముగ్గురు ఆడపిల్లలు, ఏ ఒక్కరికైనా పెళ్లి జేసిండా!? ఏ ఒక్కరోజైన ఇంటికాడ ఉన్నడా!? పోతే చెరుక్కు, ఇంటికొచ్చినాక పొలం పన్లకి.
కక్కమ్మ, కక్కయ్య ఇద్దరూ రెక్కలు ముక్కలు జేసుకొని పనిజేత్తున్నా.. ఈరోజుకి ఒక నెలకి సరిపొయ్యే తిండి గింజలు కూడా నిలవ లేవు. ఎప్పుటికప్పుడు అడ్వాన్సులు తీసుకోడం ఆయన దగ్గర వడ్డీకి జమేయడం. ఇట్టా మనూల్లో ఎంతమంది లేరు!”
దాసు మాటలకు ఊరంతా మిన్నకుండి పోయింది. పెద్దలు కల్పించుకొని..
“అదంతా జరిగిపోయింది కదయ్యా! ఇప్పుడు చలమయ్య గూడా లేకపాయే మాట్టాడ్డానికి. ఇప్పుడు మనమేంజేసి ఈ ఆపద నుండి గట్టెక్కాల్నో ఆలోచిద్దాం” అన్నారు ఒకరెమ్మిటి ఒకరు.
“ఆలోచించేదేమీ లేదు. అందరం పోదాం. ఎంత కట్టింది. కట్టాల్సింది లెక్కలు తీయమందాం. దాన్ని బట్టి కట్టాల్సింది ఏమన్నా ఉంటే.. టయమడుగుదాం. అంతా తీరిపోతే ఆ నోట్లన్నీ ఆయన చితిమీదనే కాల్చేసి వద్దాం” అన్నాడు దాసు మరోసారి ఆవేశంగా.
ఈసారి అందరూ దాసుతో గొంతు కలిపారు.
“అదే కరస్ట్” అన్నారు ఆడోళ్లంతా.
“దాసన్న జెప్పినట్టే చేద్దాం” అన్నారు కుర్రోళ్లంతా.
పెద్దలకూ అంతకు మించినదారి అగపల్లేదు.
“అట్నే పోదాం… మీలో ఎవురూ ఏమీ మాట్లాడబాకండి. అంతా మేము చూసుకుంటాం” అన్నారు పెద్దలు. “సరే!” అంటూ కదిలారు తక్కినోళ్లు.
గుంపులు గుంపులుగా పీనుగింటి కాడికి వస్తున్న పాలెపోళ్లని చూసి ఊరి పెద్దలు ఒకచోట కూడారు.
“ఏందిరా దానం… ఏం తేల్చిర్రు?” అడిగాడు డీలర్ శేషగిరి.
“తేల్చేదేముంది మామా! ఆయన మీకెంత కావాల్సిన మనిషో.. మాకు అంతే కావాల్సినోడు. ఆయన లేకుంటే మా పల్లె ఎట్టుండేదో గ్యాపకం లేకపోలేదు. జరగాల్సిందేదో జరగనిచ్చినాక.. అందరమూ కుదార్తంగా కూకొని ఆయన మాకు పెట్టింది, మేము ఆయనకి ఇచ్చింది అంతా లెక్కజూద్దాం. ఇమ్మర్శ జేసుకోని, మేము ఇయ్యబడేది ఉంటే వెంకట్రావుకి ఇమ్మర్శ జేత్తాము” అందర్నీ సమదాయిస్తున్నట్లు తగ్గించిన గొంతుతో చెప్పాడు దానమయ్య.
“ఏందే మీరిచ్చేది, నేను తీసుకున్నేది! పొద్దున లేత్తే మీ పల్లెలో పడిసచ్చే మయ్యకే రూపాయి ఇయ్యలేదు. ఈ పూట పీనుగను తగలబెట్టి.. ఇంగ రేపుట్నుంచి మయ్యకు మల్లే మీ మాదిగిళ్ల సుట్టూతా అడక్క తిరగాల్నా!?” ఆవేశం కట్టలు తెంచుకున్నట్టుగా అరిచాడు వెంకట్రావు.
పల్లె కుర్రోళ్లకి కోపం నసాలాకు అంటింది. అది గమనించిన చలమయ్య తోడల్లుడు, వార్డు మెంబర్ వెంకటేశ్వర్లు..
“ఇప్పుడికిప్పుడు వాళ్లు మాత్రం యాన్నుంచి తీసుకొనొత్తార్రా! ముందు కార్యం జరిగేలా సూడాల్నా లేక ఇట్టా పేచీలు పెట్టుకోని కూకోవాల్నా? పొద్దుపోతున్నదిరా.. సూరీడు పొయ్యేలోపల కాటికి తీసుకుపోవాల. లేకపోతే నీ ఇంటికే కాదు.. ఊరికి గూడా అరిట్టం. నా మాటినయ్యా! కార్యం కానియ్యి” అంటూ బుజ్జగింపుగా అడిగాడు.
“మా ఇంటికి జరిగిన అరిట్టం సాలు. దీనికంటే పెద్ద అరిట్టమేమీ రాదు. ఉన్న డబ్బులంతా ఆ మాదిగపల్లె మీద పోసి పోయిండు. మేమేం గావాలా!? ఊరికి అరిట్టం అయితే వాళ్లనే పీనుగను తీసకపొమ్మను. వాళ్లనే కార్యం జరిపియ్యమను” అరుస్తూనే ఉన్నాడు వెంకట్రావు.
‘ఇవన్నీ ఇప్పుడెందుకురా!?’ అని తల్లిగానీ,
‘తండ్రి చావుకాడ పంతం ఎందుకు!?’ అని భార్య గానీ ఒక్క మాటా అనలేదు.
ఆస్తి, అంతస్తు, పరువు ప్రతిష్ఠలు.. పురుషులు నిర్వర్తించే కర్తవ్యాలు. తమకు సంబంధం లేదన్నట్టు కూర్చున్నారు.
“వాళ్లు తీసుకున్న రొక్కాన్ని కట్టేదాక పీనుగను కదిలిచ్చేదే లేదు. కాదని ఎవురైనా వత్తే.. నా శవాన్ని గూడా మయ్యతోపాటే కాటికి తీసకపోతరు” రెట్టించాడు వెంకట్రావు.

Peenuga 1
అదో ప్రకటన. బెదిరింపుతో కూడిన ప్రకటన.
“కన్నతండ్రి చావు కూడా అంతుపట్టని వాడ్ని ఎక్కడా చూల్లేదు” అని అందరూ ఈసడించుకుంటున్నా ఎవరూ ఏది చెప్పలేకపోతున్నారు.
సమయం గడిచిపోతోంది. ఊరంతా గమ్మునుంది. చీమ చిటుక్కుమన్న చప్పుడు కూడా చెవులకి స్పష్టంగా వినబడుతోంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పల్లె జనాలు, ఏం జరుతుందో అర్థంకాని ఊరి జనాలు అందరూ.. ఉన్నచోటనే శిలావిగ్రహాల మాదిరి అయిపోయారు. అప్పటికే సూర్యుడు మెల్లగా కొండల చాటున కూలిపోతున్నాడు. లేతచీకటి నలుపు ఊరంతటినీ కప్పేసింది. హనుమంతు ఏసీ పెట్టె తెచ్చి ఓ నలుగురి సాయంతో పీనుగను పెట్టెలో పెట్టాడు.
ఊర్లో మిగతా కులాల పెద్దలు-మాదిగ పల్లె పెద్దల కాడికి వచ్చి..
“ఇది ఇయ్యాటితో వగదెగేది కాదురా! పొయ్యి ఏ ఇషయమూ తేల్చుకోని పొద్దున్నే రాపోండి” అన్నారు.
“ఏం తేల్చుకుంటాం బాబాయ్! మా బతుకులు మీకు తెలేవా?! ఎంతియ్యాలో తెలేదు. ఎంత వడ్డీ వచ్చిందో తెలేదు. చలమయ్యతో ఎవురైనా ‘బాకీ ఎంతుంది? చెరకు డబ్బులు తీసుకోని మొత్తం కడతాం’ అంటే.. ‘నోట్లు ఇంట్లో ఉన్నాయిలేరా! కడుదురులే! ఇప్పుడు అంత తొందరేముంది?’ అంటుండేవాడు ఆయన. మాయేమో ఎటూగాని బతుకులాయే. అప్పిచ్చినోడే ఆలస్యం జేత్తుంటే ఆ డబ్బులు ఇంకో అవసరానికి అయిపోతుండే. ఏనాడు అప్పు తీరనిచ్చినాడు గనక” అన్నాడు చిన్న సత్యం గొంతులోనుండి తన్నుకొస్తున్న ఏడుపును బిగబట్టి.
“ఇప్పుడు ఇయన్నీ తవ్వుకుంటే ఏమైనా లాభం ఉన్నదారా? పొయ్యి ఏదోకటి జేసి వాడి బాకీ వాడి మొఖాన గొట్టండి” ఊరోళ్ల సమాధానం.
* * *
‘పల్లెలో ఒకింటికి ఆపదొస్తే పల్లె మొత్తం అండగా నిలబడేది. అదే ఆ పల్లెకే ఆపదొస్తే ఎవరు నిలబడతారు? మా అవసరం వాళ్లకి వ్యాపారం. మా కన్నీళ్లు వాళ్లకి రాజకీయం. ఆపదలో అక్కరకొచ్చిండని ఇరవై ఏళ్లు భుజాలు కందేలా ఆ పెద్ద మనిషిని మోస్తే.. చివరాఖరకు వడ్డీ మీద వడ్డీలేసి మా నడ్డి ఇరగ్గొట్టి ఇప్పుడు సచ్చి గూడా సాధిస్తున్నాడు’ అనుకుంటూ పీనుగ కాన్నుంచి ఎల్లొచ్చి పంచాయితీ అరుక్కాడ కూర్చున్నారు.
రేపు జరగబోయే దాని గురించి భయం వెంటాడుతూనే ఉంది. ఎవురొచ్చి పల్లె మీద ఏం నింద వేస్తారోనన్న బాధ అక్కడున్న అందరి కళ్లల్లోనూ కనబడుతోంది.
ఆరుగురు పెద్దలల్లో నడిపి పెద్ద, పిచ్చయ్య బొంత కూర్చోని, చేతిలో ఒక సన్న పుల్ల తీసుకొని నేలమీద గీస్తూ..
“ఈ ఆపతి నుండి గట్టెక్కడానికి ఒకటే మార్గం ఉందండ్రా” అనగానే అందరూ కొత్త ఊపిరి పోసుకున్నట్లు ఆదూర్తాగా అతనివైపు చూశారు.
“బొక్కల కయ్యకి తీసిన ఆ రెండున్నర ఎకరాలు ఆడికి రాసియ్యడమే. ఇంతకుమించి ఇప్పుడికిప్పుడు మనమేం జేత్తాము”..
‘ఇక చెప్పాల్సింది చెప్పినా.. మీ ఇష్టం!’ అన్నట్లుగా మళ్లీ పుల్లతో నేలమీద గీయడం మొదలుపెట్టాడు పిచ్చయ్య.
అక్కడ ఉన్నోళ్లెవరికీ ఏమీ అర్థం కాలేదు. అర్థమయిన దాసు మాత్రం వెంటనే ప్రతిఘటించాడు. శ్మశానం కోసం తీసిన భూమి వాడికి రాసిస్తే తమ పరిస్థితి ఏందని నిలదీశాడు.
“భూమి పోతే పోయింది. పలానూరోళ్లు ఇట్ట జేసిర్రంటా అని నలుగురి నోటా నానితే.. మన పిల్లలు, తరతరాలకు తలవంపు కాదా! మళ్లీ మనకు యాడైనా రూపాయి పుడతాదా!” అన్నారు పెద్దలందరూ కూడబలుక్కోని.
ఆ మాటలకు అవునని గానీ, కాదని గానీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు.
“అవును తాతా! మా తరానికి సెడ్డపేరు రాగూడదని బాగనే ఆలోచన జేత్తుర్రు. కానీ, అది శ్మశానానికి తీసిన భూమి. ఎప్పుడైనా జనాలు పెరుగుతరు, పల్లె పెరిగిద్ది అని ఊరి మాన్యం కింద తీసిన భూమి. దాన్ని ఇప్పుడు వాడికి రాసిత్తే ఊర్లో ఎవురయిన సత్తె పాతిపెట్టటానికి ఆరడుగుల నేలయినా ఉంటదా!? ఆ నేల కూడా లేకపోతే మీరు ఇన్ని విలువలతో బతికి మాకేం ఇచ్చినట్టు? మా ముందుతరాలకు మేమేం దాసినట్టు? ఇది వరుకు పల్లెకి నాలుగు పక్కల గ్రామకంఠం కింద భూముండేది. ఇప్పుడేమయింది? అధికారంలోకొచ్చిన పతోడూ.. దొరికినకాడికి దోచుకోని పట్టాలు జేపిచ్చుకుంటుంటే.. వాళ్లిచ్చే పదీ పరకకీ ఆశపడి వాళ్లు చెప్పినట్టు ఆడిర్రు. ఇప్పుడేమో తీరిపోయిన బాకీకి ఉన్న ఆ కొద్ది భూమిని గూడా రాశిద్దామని అంటున్నరు. గ్రామరాశికి నాలుగ్గుంటల నేలని మిగిలియ్యకుండా జేసి.. ఇప్పుడు ఊరికి సెడ్డపేరు వత్తదని ఉన్న భూమిని గూడా ధారాదత్తం జేద్దాం అంటుర్రు. ఇదేం న్యాయం? ఇదేం ఊరిమీద ప్రేమ? మనం మనుషులుగా బతకాలని చూసిన ప్రతీసారీ మనల్ని పీనుగలుగా మారుత్తున్నారా? దీనికి అంతం వద్దా!?” జరిగిన అన్యాయానికి కట్టలు తెంచుకున్న కోపంతో, నేలని వదులుకుంటే మనకు మనుగడ లేదు అన్న బాధతో పెద్దలమీద అరిచాడు దాసు.
పెద్దలు అవమానభారంతో కళ్లు నేలకేశారు.
అప్పటికే కోడి తొలికూత కూసింది. ఎక్కడినుంచో వచ్చిన గాలి.. చల్లగా శరీరాల్ని తగులుతోంది. మసక చీకటి పొరలు తెంచుకుంటోంది.
“అబ్బయా! మీరు కుర్రోళ్లు. ఆవేశం ఉంటది. జరిగిన అన్యాయానికి బాధా ఉంటది. ఇప్పుడు మనం కోప్పడి తెంచుకొనే సమస్యా ఇది. సొంత తండ్రి పీనుగను ఇంటిముందు పెట్టుకోని డబ్బులు అడుగుతున్న వాడితో మనమేం మాట్లాడుతాం!? వాడేం ఇంటడు. ఇనేవాడైతే ఇట్ట జేసేవాడా!? గతంలో మేము జేసిన తప్పులకు ఊరందరి ముందు బడికొట్టం సాచ్చిగా శమాపణ అడుగుతున్నం. కానీ, మనం ఇప్పుడు ఇట్టా సెయ్యకపోతే మొత్తం ఊరికే సెడ్డపేరు వత్తదిరయ్యలారా! మా మీద ఏమాత్రం గౌరం ఉన్నా.. ఇప్పుడు దీనికి ఒప్పుకోండి. ముందు మన పల్లెమీద పడ్డ అపవాదును తుడిపెద్దాం” గొంతులో తీవ్రమైన ఆర్ధతతో ఒక్కొక్క మాట చెప్పారు పెద్దలు. దాసుతో సహా అక్కడున్న అందరూ మౌనంగా ఉండిపోయారు.
దాసుకి మాట్లాడాలని ఉంది.
‘అక్కడ కోల్పోతున్నది భూమి కాదు. మన వాళ్ల ఆనవాళ్లు. భవిష్యత్ తరాల అస్తిత్వం. భూమి మనకి ఆస్థికాదు, అదొక ఆత్మగౌరవ ప్రతీక’ అని అరవాలని ఉంది. కానీ, గొంతు పెకిలించలేక పోయాడు.
కాసేపటి తర్వాత దుఃఖం అలుముకున్న కళ్లతో, జీరబోయిన గొంతుతో మళ్లీ మాట్లాడటం మొదలు పెట్టాడు దాసు.
“మన పూర్వీకులు భూమిని కోల్పోవడం వల్ల అధికారం దూరమైంది. అదిమన ఆర్థిక స్వాతంత్య్రాన్ని హరించింది. ఆకలి.. మన సొంత భూముల్లోనే మనల్ని కూలీలుగా మార్చి, మన సామాజిక గౌరవాన్ని దెబ్బతీసింది. పుల్లుట్ట చేలని, పుట్టమట్టి పొలాలని, వాగు రేగళ్లని, చెరువు సెలకలని ఊరికి నలుమూలలా ఉన్న భూములు ఏనాడో మనవి కాకుండా పోయాయి”
దాసుకి గతం, వర్తమానం, భవిష్యత్ అన్నీ అంధకారంగా తోచాయి. కన్నీళ్లు బొటబొటా కిందకు జారాయి. పెద్దలతోపాటు అక్కడున్న అందరి కళ్లూ చమర్చాయి.
“మనం కోల్పోతున్నది మళ్లీ తీసుకరాలేనిది. విలువైనది. కానీ, చేసేదేముంది? ఇయ్యాల మనమీద జాలి చూపిచ్చిన వాళ్లు, రేపట్రోజున.. ‘మాదిగ పల్లోళ్లు చలమయ్యకి రూపాయిగూడా బాకీ తీరవలేదు’ అని నాలుగూర్ల ఆసాములకు చెవతారు. అప్పుడు మనకి పుట్టుబడి పుట్టిద్దా? చేలల్లో దున్నుడు, తోలకాల నుండి, నేలమందులు, నీలమందుల దాకా వాళ్ల మాటలేనిది ఏ మందుల కొట్టోడైనా అప్పిత్తరా? ఏ తోలకమోడైనా సాలు దున్నుతడా? రెంటెకి జెడ్డ బతుకులు మనయి. వాడు సచ్చిపోయి పీనుగయిండు. మనం పీనుగల్లాగనే బతుకుతున్నం”..
కండువతో కళ్లు తుడుచుకుంటూ చెప్పాడు పిచ్చయ్య.
శ్మశానానికి తీసిన రెండున్నర ఎకరాల తాలూకా పాసుపుస్తకం తెచ్చాడు పెద్దమాదిగ పవులయ్య. దాన్ని తీసుకుని ఆరుగురు పెద్దలు చలమయ్య ఇంటివైపు కదిలారు. దాసుతోపాటు ఊరోళ్లంతా మసకబారిన కళ్లతో చూస్తూ ఉండిపోయారు.
– నాగార్జున్ వలేరు, 97040 50970
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

