Smart phone Addiction | గంటల తరబడి స్మార్ట్ఫోన్ వాడే అలవాటు ఎంతటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందో చెప్పడానికి సీనియర్ నటి షకీలా (Shakeela) ఉదాహరణగా నిలిచారు. రోజంతా ఫోన్ వాడటం, పడుకుని రీల్స్ చూడటం వంటి వ్యసనాల కారణంగా ఆమె తీవ్రమైన నరాల సమస్యను ఎదుర్కొని, ఇటీవల అత్యవసరంగా మెడ శస్త్రచికిత్స (Neck Surgery) చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా బయటపెట్టింది.
తన అనారోగ్య సమస్య వెనుక ఉన్న అసలు కారణాలను వివరిస్తూ షకీలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తాను మంచంపై తప్పుడు భంగిమలో గంటల తరబడి పడుకుని మొబైల్లో గేమ్స్ ఆడటం, రీల్స్ చూడటమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఆమె తెలిపారు. కేవలం టీ లేదా కాఫీ తాగేందుకు మాత్రమే కొద్దిసేపు విరామం తీసుకునేదాన్నని, ఆ తర్వాత వెంటనే మళ్లీ ఫోన్కు అతుక్కుపోయేదానినని చెప్పారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ చూస్తూ రోజులో ఎక్కువ సమయం వృధా చేసేదాన్నని, ఈ చెడు అలవాటు వల్ల తన మెడలోని ప్రధాన నరాలపై తీవ్రమైన ఒత్తిడి పడిందని పేర్కొన్నారు.
ఈ చిన్న అలవాటు చివరికి తనను ఆపరేటింగ్ టేబుల్ ఎక్కేలా చేసిందని ఆమె వాపోయారు. ఈ మేజర్ సర్జరీ కోసం ఏకంగా రూ. 3 లక్షల వరకు ఖర్చు కావడమే కాకుండా, తాను భరించలేని శారీరక నరకాన్ని అనుభవించానని షకీలా కంటతడి పెట్టారు. ప్రస్తుతం కనీసం మంచం దిగాలన్నా, స్వయంగా తినాలన్నా ఇతరుల సహాయం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మొబైల్ వినియోగదారులందరికీ ఆమె ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. దయచేసి ప్రతి ఒక్కరూ స్క్రీన్ టైమ్ను వీలైనంతగా తగ్గించుకోవాలని, ఫోన్ను విపరీతంగా వాడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్న పిల్లలను స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లకు దూరంగా ఉంచాలని, లేదంటే భవిష్యత్తులో వారు కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని షకీలా హెచ్చరించారు.