Varanasi | గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుండగా.. ప్రస్తుతం చిత్రబృందం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. రాజమౌళి సినిమాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎంతో పక్కాగా ప్లాన్ చేస్తారనే విషయం తెలిసిందే. అయితే ‘వారణాసి’ టైటిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో మాత్రం ఊహించని సాంకేతిక సమస్య చిత్రబృందానికి కాసేపు గుబులు పుట్టించింది. తాజాగా నిర్మాతల్లో ఒకరైన ఎస్.ఎస్. కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
‘వారణాసి’ గ్లింప్స్‌ను ప్రేక్షకుల సమక్షంలో ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే గ్లింప్స్ ప్లే చేయాల్సిన సమయంలో అనూహ్యంగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వేదికపై ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. భారీ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో ఇలాంటి సమస్య రావడంతో చిత్రబృందం కూడా కాసేపు ఆందోళనకు గురైంది. అప్పటి పరిస్థితిని గుర్తు చేసుకున్న కార్తికేయ.. తనకు నిజంగానే ఏడుపొచ్చేసిందని సరదాగా చెప్పారు. అయితే ఇందులో ఎవరి తప్పూ లేదని, సాంకేతిక సమస్య కారణంగానే గ్లింప్స్ సరిగ్గా ప్లే కాలేదని ఆయన వివరించారు. ఆ తర్వాత ఫార్మాట్ మార్చి గ్లింప్స్‌ను విజయవంతంగా ప్రదర్శించినట్లు తెలిపారు.
ఆ సమయంలో తన పరిస్థితిని వివరించడానికి కార్తికేయ చెప్పిన పోలిక ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాలో రైల్వే స్టేషన్లో భావోద్వేగానికి గురై గట్టిగా అరిచే సన్నివేశం ఉంటుంది. గ్లింప్స్ ప్లే కాకపోయిన సమయంలో తాను కూడా లోపల అదే స్థాయిలో అరిచేశానని కార్తికేయ సరదాగా చెప్పుకొచ్చారు. భారీ సినిమాల కార్యక్రమాలు బయటకు ఎంతో ఘనంగా కనిపించినప్పటికీ.. వాటి వెనుక నిర్మాతలు, సాంకేతిక బృందం ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటారో ఈ సంఘటన ద్వారా అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. యాంకర్ సుమతో జరిగిన ఇంటర్వ్యూలో కార్తికేయ తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు విషయాలను కూడా గుర్తుచేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల రోజుల నుంచే రాజమౌళితో తన అనుబంధం కొనసాగుతోందని ఆయన చెప్పారు. రాజమౌళి ప్రతి సినిమాకు ముందుగానే విస్తృతంగా రిహార్సల్స్, ప్రణాళికలు ఉంటాయని కార్తికేయ వివరించారు.