Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
Nanna Kutti | ఈ వారం తెలుగు సినిమాలే కాకుండా తమిళ డబ్బింగ్ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిధ్యమైన కథలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు విజయ్ ఆంటోనీ, తాజాగా నటించిన చిత్రం ‘నాన్న కుట్టి’.
సినిమా పేరు: నాన్న కుట్టి
తారాగణం: విజయ్ ఆంటోనీ, ప్రీతి అస్రానీ, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, బేబీ లితన్య తదితరులు
సినిమాటోగ్రఫీ: రాజీవ్ రాజేంద్రన్
సంగీతం: విజయ్ ఆంటోనీ
నిర్మాతలు: విజయ్ ఆంటోనీ, మీరా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజీ
రచన – దర్శకత్వం: ము. మారన్
విడుదల తేదీ: నవంబర్ 27, 2026
ఈ వారం తెలుగు సినిమాలే కాకుండా తమిళ డబ్బింగ్ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిధ్యమైన కథలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు విజయ్ ఆంటోనీ, తాజాగా నటించిన చిత్రం ‘నాన్న కుట్టి’. ఈ చిత్రం తమిళంలో గతవారమే విడుదల కాగా నేడు తెలుగు ప్రేక్షకుల అలరించడానికి వచ్చింది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ:
వైజాగ్‌కు చెందిన సూర్య (విజయ్ ఆంటోనీ) తన పసిపాప దియా (బేబీ లితన్య)ను తీసుకుని ఊరు వదిలి ఊటీకి వెళ్లి స్థిరపడతాడు. కూతురంటే ప్రాణంగా చూసుకునే సూర్య, తల్లి రేవతి చనిపోయిందని చెప్పి దియాను అల్లారుముద్దుగా పెంచుతుంటాడు. మరోవైపు దియా చదివే పాఠశాలలో టీచర్‌గా పనిచేసే అనిత (ప్రీతి అస్రానీ), సూర్య మంచితనాన్ని చూసి అతడిని ఇష్టపడుతుంది. దియాకు దగ్గరైన అనిత తన ప్రేమ విషయాన్ని సూర్యకు చెప్పగా, అతడు సున్నితంగా తిరస్కరిస్తాడు. అయితే, చనిపోయిందని సూర్య చెప్పిన రేవతి ఒకరోజు ఊటీలో అనిత కంటపడుతుంది. దీంతో అనుమానం వచ్చిన అనిత ఈ విషయంపై సూర్యను నిలదీస్తుంది. సరిగ్గా అదే సమయంలో దియా కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తరలిస్తారు. పరీక్షించిన వైద్యులు దియా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోందని, ఆమె ప్రాణాలు దక్కాలంటే కన్న తల్లిదండ్రుల ద్వారా పుట్టిన మరో బిడ్డ స్టెమ్ సెల్స్ (మూలకణాలు) అత్యవసరమని చెబుతారు. దీంతో రేవతి దగ్గరకు వెళ్దామని అనిత సూచించగా, అసలు దియా తన కన్నకూతురే కాదనే సంచలన నిజాన్ని సూర్య బయటపెడతాడు. ఇంతకీ దియా ఎవరి బిడ్డ? ఆమెను సూర్య ఎందుకు పెంచుతున్నాడు? దియా ప్రాణాలను కాపాడుకోవడానికి సూర్య ఏం చేశాడు? అసలు తల్లిదండ్రులను కలిశాడా లేదా? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ
ఎప్పుడూ సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్లతో అలరించే విజయ్ ఆంటోనీ ఈసారి పూర్తిస్థాయి భావోద్వేగభరితమైన కథను ఎంచుకున్నారు. దర్శకుడు ము. మారన్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా, హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ప్రథమార్థం తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అందమైన అనుబంధం, ఊటీ నేపథ్యంలో ఆహ్లాదకరంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ సమయానికి వచ్చే ట్విస్ట్ ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. అయితే, సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. వైద్యపరమైన అంశాలు, పాపను కాపాడుకునే క్రమంలో వచ్చే సన్నివేశాలు కాస్త సాగదీతగా ఉండటం మైనస్. అయినప్పటికీ, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా దర్శకుడు నిజాయతీగా కథను చెప్పే ప్రయత్నం చేశారు.
నటీనటుల ప్రతిభ
సూర్య పాత్రలో విజయ్ ఆంటోనీ ఒదిగిపోయారు. తనదైన శైలిలో సెటిల్డ్ నటనతో, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించారు. బేబీ లితన్య తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, అమాయకమైన నటనతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టీచర్ అనిత పాత్రలో ప్రీతి అస్రానీ పరిధి మేరకు చక్కగా నటించారు. భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా
విజయ్ ఆంటోనీ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. పాటలు కథలో భాగంగా సాగుతాయి. రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఊటీ అందాలను, భావోద్వేగభరిత సన్నివేశాలను కెమెరాలో చక్కగా బంధించారు. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌లో మరికొంత కత్తెర వేసి ఉంటే సినిమా ఇంకా క్రిస్పీగా ఉండేది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు:
విజయ్ ఆంటోనీ, బేబీ లితన్య నటన
కథాంశం, క్లైమాక్స్ ఎమోషన్స్
నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ
బలహీనతలు:
ద్వితీయార్థంలో నెమ్మదించిన కథనం
అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

