వలస పాలనలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరిగిన పద్నాలుగేండ్ల సమరమే తెలంగాణ పోరాటం. నెగడు మండినట్లు వీధులన్నీ ఉద్యమ క్షేత్రాలు చేసి, సబ్బండ జనులను ఒక్క పాటగా, మాటగా చేసి కదిలించిన కార్యక్షేత్రుడు, దశాబ్దాల ఆకాంక్షను అక్షరసాక్షాత్కారం చేసిన పోరాటయోధుడు కేసీఆర్.
కేసీఆర్ త్యాగం ఎందరినో చైతన్యపరిచింది. ఆసరై నవ్వింది. మనసై ఉప్పొంగింది. రాష్ర్టాన్ని సాధించాలనే తపన కేసీఆర్‌ది. అంతకుముందు ఎవరూ ఉద్యమం చేయలేదని కాదు. చాలామంది చేశారు. అమరులయ్యారు. నది పోతూపోతూ మధ్యలో ఆగిపోతుంది. నీళ్లింకిపోతాయి, ఎండిపోతుంది. చివరి మడులకు నీళ్లు అందాలంటే ఒక వర్షమో, ఒక తుఫానో రావాలి. ఆ తుఫాన్, ఆ వర్షమే కేసీఆర్ రూపంలో వచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఎన్నికల ముందు ‘జై తెలంగాణ’, ఎన్నికల తర్వాత ‘నై తెలంగాణ’ అన్నవారు ఎందరో. అఖిలపక్షం ఏకాభిప్రాయం, ప్రజాభిప్రాయం, అనేక కమిటీల పేరిట తెలంగాణ ఉద్యమాన్ని నాటి కేంద్రప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేసింది. కానీ, కేసీఆర్ ఆ కుట్రలన్నింటినీ పటాపంచలు చేశారు.
2009, నవంబరు 29న కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట దగ్గర ఉన్న రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలానికి కేసీఆర్ బయల్దేరారు. ఆయన వాహనాన్ని కరీంనగర్ మానేరు బ్రిడ్జి సమీపంలోని అల్గునూరు చౌరస్తాలో పోలీసులు చుట్టుముట్టారు. వాహనం నుంచి కేసీఆర్‌ను బలవంతంగా దించేశారు. కేసీఆర్ రోడ్డు మీదే దీక్షకు కూర్చున్నారు. దీంతో ఆయనను బలవంతంగా ఖమ్మం జైలుకు తరలించారు. ఆ జైలులోనే కేసీఆర్ దీక్షను ప్రారంభించారు. డిసెంబరు 1న ‘నేను లేకున్నా ఉద్యమం నడవాలి’ అని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబరు 2న కేసీఆర్ దీక్ష గురించి పార్లమెంట్లో లాల్‌కృష్ణ అద్వానీ ప్రస్తావించారు. ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబరు 3న కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ‘తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర’ అని నిమ్స్ దవాఖాన నుంచే కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్రం ఇస్తున్నట్టు ప్రకటన చేసేవరకు తన దీక్ష కొనసాగుతుందని కేసీఆర్ చెప్పారు. ఎందరో నాయకులు, మేధావులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్ష విరమించాలని కేసీఆర్‌ను కోరారు. కానీ, ఆయన ససేమిరా అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడితేనే దీక్ష విరమిస్తానని తెగేసి చెప్పేశారు. దాంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని అసెంబ్లీలో తీర్మానం పెడతామని, కేసీఆర్‌పై కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 6న అసెంబ్లీలో 14 ఎఫ్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న సమాచారం తెలంగాణ అంతటా దావానంలా వ్యాపించింది. నిరసనలు నింగినంటాయి. బంద్‌లు రాస్తారోకోలు జరిగాయి. ఎటు చూసినా ఆకాశంపై నీలిరంగు పులుముకున్నట్లు ‘జై తెలంగాణ’ నినాదమే వినిపించింది. లాయర్లు, ఇంజినీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు.. ఇలా మూడున్నర కోట్ల మంది ఒక్క గీతమయ్యారు. ఆ గీతమే జై తెలంగాణ.
డిసెంబరు 7న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చాయి. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించిందని, ఇక తమ చేతుల్లో ఏమీ లేదని డిసెంబరు 8న వైద్యులు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు 9న కాంగ్రెస్ కోర్ కమిటీ ఐదుసార్లు సమావేశమైంది. సమావేశం నుంచి చిదంబరం బయటికి వచ్చి ఫోన్లో కేసీఆర్, జయశంకర్ సార్‌తో సంభాషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనపై సమాలోచనలు జరిగాయి. రాష్ట్ర ఏర్పాటు ప్రకటనలో స్పష్టమైన పదజాలం ఉండాల్సిందేనని చిదంబరానికి వారు తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన చేయాలన్న సోనియా సూచన మేరకు కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని, విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రకటన అనంతరం నిమ్స్ నుంచి ‘ఇది తెలంగాణ ప్రజల విజయం’ అని కేసీఆర్ ప్రకటించారు. చరిత్ర గతిని ఆ 11 రోజుల సుదీర్ఘ దీక్ష మార్చివేసింది. కానీ, రాత్రికిరాత్రే సీమాంధ్ర నాయకుల కుట్రలతో సంతోషం ఆవిరైపోయింది. చంద్రబాబు నుంచి జగన్మోహన్రెడ్డి వరకు, టీజీ వెంకటేష్ నుంచి కేవీపీ వరకు పార్టీలకతీతంగా సీమాంధ్ర నాయకులందరూ ఏకమై ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకున్నారు. అయినా ప్రత్యేక తెలంగాణను కేసీఆర్ సాధించారు.
బతుకు అభివృైద్ధె, పాటై, కవిత్వమై కేసీఆర్ పాడారు. తెలంగాణ తనమే అస్తిత్వంగా ప్రతి రంగంలో తెలంగాణ ముద్దెర ఉండేటట్టుగా కేసీఆర్ పరిపాలన సాగింది. కేసీఆర్ సర్కార్ తర్వాత ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి తెలంగాణ అస్తిత్వానికి ఎగనామం పెడుతూ తెలంగాణ తల్లి రూపాన్నే మార్చేశారు. బతుకమ్మ చీరలకు రాంరాం పెట్టి ఇందిరమ్మనే తెలంగాణ తల్లిగా ముందుకు తెస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఆగమాగం చేస్తుండటం వెనకాల అనేక కుట్రలున్నాయి. క్రమక్రమంగా తెలంగాణ అనే పదాన్ని, ఉద్యమాన్ని, పోరాట చరిత్రను తెరమరుగు చేయడం కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఏడ్చిఏడ్చి సానుభూతి పొందారు. అధికారంలోకి వచ్చారు, దోపిడీకి తలుపులు తెరిచారు. ఫ్యూచర్ సిటీ, హైడ్రా, సెంట్రల్ యూనివర్సిటీ నిర్వాకాలు అందుకు ఉదాహరణలు. ఇచ్చిన వాగ్దానాలన్నీ మాటతప్పాయి. 6 గ్యారెంటీలను 420 హామీలను గాలికొదిలేశారు. మోసాలన్నీ ఎక్కిరిస్తున్నాయి. సత్యాలన్నీ తెలిసి భ్రమలు బద్దలయ్యాయి. సాపేక్షకాలన్నీ ఆపేక్షకాలై ఆశలన్నీ రాలిపోతున్నాయి. ఆశయాలు వాడిపోతున్నాయి. పచ్చదనం ముళ్లపొదలై పదేళ్ల వెన్నెలంతా చీకటి అలుముకున్నది. మళ్లీ ప్రజలు చైతన్యవంతులై మునుపటి పరిపాలన కోసం ఎదురుచూస్తున్నారు.
-వనపట్ల సుబ్బయ్య
94927 65358