దుబాయ్, మార్చి 8: ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దుబాయ్‌లో గోల్డ్ ట్రేడర్స్ భారీ డిస్కౌంట్‌తో బంగారాన్ని అమ్మేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ ధరలతో పోల్చితే ఔన్స్(28గ్రాములు) బంగారంపై 30 డాలర్ల (సుమారుగా రూ.2,800) వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిసింది. అయినప్పటికీ దీనిపట్ల భారతీయ కొనుగోలుదార్లు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చునని నిపుణలు చెబుతున్నారు. గల్ఫ్ దేశాల్లో విమాన రాకపోకలు, నౌకా రవాణా పూర్తిగా స్తంభించటంపై దుబాయ్‌లోని గోల్డ్ ట్రేడర్స్ ఆందోళన చెందుతున్నారు. అక్కడి మార్కెట్లో బంగారం అమ్మకాలు, తరలింపు ఓ పెద్ద సమస్యగా మారుతున్నది. బయ్యర్లు అనేకమంది కొత్త ఆర్డర్లను తీసుకోవటం లేదు. ఆర్డర్ డెలివరీపై అనిశ్చితి నెలకొన్నది. పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలించేందుకు భారీ షిప్పింగ్ చార్జీలు, ఇన్సూరెన్స్ ఖర్చులు ఉండటంతో కస్టమర్లు వెనుకాడుతున్నారు. దీనిని అధిగమించేందుకు ట్రేడర్స్ డిస్కౌంట్ ప్రకటించినట్టు తెలుస్తున్నది.