Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పాన్-వరల్డ్ చిత్రం వారణాసిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోగా, షూటింగ్ గ్యాప్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కలిసి కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్ది రోజులుగా ప్రియాంక చోప్రా తన భర్త, హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మహేష్ బాబు సొంత మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్‌కి వెళ్లారు. ప్రత్యేక అతిథులుగా వచ్చిన వారికి మహేష్ బాబు స్వయంగా ఆతిథ్యం ఇవ్వగా, ముగ్గురూ కలిసి ఏఎంబీ లాంజ్‌లో దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సమాచారం ప్రకారం, ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా చిత్రం ది ఒడిస్సీ ను వీరంతా కలిసి వీక్షించినట్లు తెలుస్తోంది. వరుస షూటింగ్ షెడ్యూళ్లతో బిజీగా ఉన్న ఈ స్టార్స్ కాస్త రిలాక్స్ అవ్వాలనే ఉద్దేశంతో మూవీ నైట్ ప్లాన్ చేసుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా చూసే సమయంలో ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ, హాయిగా సమయం గడిపినట్లు సమాచారం. ఈ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఫోటోలో మహేష్ బాబు బ్లాక్ టీ-షర్ట్, ట్రాక్ ప్యాంట్, క్యాప్‌తో చాలా స్టైలిష్‌గా కనిపించారు. ‘వారణాసి’ సినిమా కోసం పెంచిన లాంగ్ హెయిర్, గుబురు గడ్డం ఆయన లుక్కు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి.
మరోవైపు ప్రియాంక చోప్రా సింపుల్ క్యాజువల్ అవుట్‌ఫిట్‌లో నేచురల్ లుక్‌తో కనిపించగా, నిక్ జోనాస్ కూడా వైట్ షర్ట్, బ్లాక్ షార్ట్స్‌లో స్టైలిష్‌గా మెరిశారు. ఈ ముగ్గురి క్యాజువల్ ఫోటో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. భారీ ప్రాజెక్ట్‌లలో నటించే కళాకారుల మధ్య మంచి అనుబంధం ఉండటం సినిమాకు కూడా ప్రయోజనకరంగా మారుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘వారణాసి’ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మహేష్ బాబు, ప్రియాంక చోప్రాల మధ్య మంచి అవగాహన ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. తెరపై వారి కెమిస్ట్రీ కూడా అదే స్థాయిలో ఉండబోతుందనే అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. రూ.1,000 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో డబుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను పోషించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.