2B Bars Notification | తెలంగాణలో 41 కొత్త 2బీ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. క్యూర్ పరిధిలో 14, మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 27 బార్లకు దరఖాస్తుల స్వీకరణకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష రుసుము చెల్లించాలి.
క్యూర్ ఏర్పాటు, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం తదితర కారణాలతో పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త 2బీ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల్లోని 14 బార్లకు సంబంధించి అబ్కారీ భవన్‌లోని కమిషనర్ కార్యాలయంతో పాటు సంబంధిత డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
మిగిలిన జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని బార్లకు సంబంధించిన దరఖాస్తులను ఆయా ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలు, కమిషనర్ కార్యాలయం, డీపీఈఓ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే స్వీకరిస్తారు.
సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ పరిధిలోని అలియాబాద్‌లో ఒకటి, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో రెండేసి 2బీ బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంతో పాటు కుత్బుల్లాపూర్ డీపీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఫ్యూచర్ సిటీ, చేవెళ్ల మున్సిపాలిటీలో ఒకటి, మొయినాబాద్ మున్సిపాలిటీలో రెండు 2బీ బార్లకు దరఖాస్తులను ఆహ్వానించారు. వికారాబాద్ జిల్లాలో కొడంగల్, పరిగి మున్సిపాలిటీల్లో, సంగారెడ్డి జిల్లాలో గడ్డిపోతారం, కోహిర్ మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి, గుమ్మడాల మున్సిపాలిటీలో రెండు 2బీ బార్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
అదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట, కల్లూరు, మహబూబ్‌నగర్ జిల్లాలో మక్తల్, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నిజామాబాద్ జిల్లాలో బోధన్, కామారెడ్డి జిల్లాలో బీబీపేట, వరంగల్ జిల్లాలో నర్సంపేట, జనగామ జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్ జిల్లాలో కే సముద్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు మున్సిపాలిటీల్లో కొత్త 2బీ బార్లకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు.
క్యూర్ పరిధిలోని 2బీ బార్లకు సంవత్సరానికి రూ.44 లక్షలు ఎక్సైజ్ ఫీజుగా చెల్లించాలి. నిజామాబాద్ జిల్లా బోధన్ బార్‌కు రూ.42 లక్షలు, మిగిలిన 2బీ బార్లకు సంవత్సరానికి రూ.30 లక్షల ఎక్సైజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. మరిన్ని వివరాల కోసం తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు సూచించారు.