UPSC CSE Results | న్యూఢిల్లీ: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 తుది ఫలితాలు చాలా మంది యువతలో సంతోషం నింపగా, ఒక ర్యాంక్ విషయంలో గందరగోళాన్ని సృష్టించాయి.
ఆకాంక్ష సింగ్ అనే పేరు గల ఇద్దరు మహిళలు తమకు 301 ర్యాంక్ వచ్చిందని ప్రకటించుకోవడమే దీనికి కారణం. వీరి ఇద్దరి రోల్ నంబర్ కూడా ఒకటే కావడం చర్చనీయాంశమైంది. వీరిలో ఒకరు వారణాసి(యూపీ),మరొకరు అర్రాహ్(బీహార్)కు చెందినవారు. వారణాసి అభ్యర్థిని తన యూపీఎస్సీ అడ్మిట్ కార్డ్, ఇంటర్యూ కాల్ లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫలితాల్లో పేర్కొన్న రోల్ నంబర్, ర్యాంక్ తనదేనని చెప్పారు. మరోవైపు జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక పరీక్షలో ఒకే రోల్ నంబర్‌తో ఇద్దరికి ఒకే ర్యాంక్ ఎలా వస్తుందని సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది.