మోర్తాడ్, ఆగస్టు 3: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానకు ఎంఆర్ఐ మిషన్‌తోపాటు అత్యవసరాల కోసం నిధులు మంజూరు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర నరసింహకు ప్రతిపాదనలను అందజేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా ఆరోగ్యశాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఆరోగ్య సంబంధిత సమస్యలు, ప్రభుత్వ వైద్యసంస్థల పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన, మందుల లభ్యత, వైద్యులు, సిబ్బంది అందుబాటు, ప్రజారోగ్యసేవల మెరుగుదల తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలో ఆరోగ్యశాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రికి అందించి మంజూరు చేయాలని వేముల విజ్ఞప్తి చేశారు.
భీమ్‌గల్‌లో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఏరియా దవాఖాన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వెంటనే తేవాలి.అలాగే పెండింగ్‌లో ఉన్న దవాఖాన బిల్లులను విడుదల చేయాలి. భీమ్‌గల్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాహత్‌నగర్ గ్రామానికి తరలించేందుకు అనుమతి మం జూరు చేయాలి. రాహత్నగర్లో నూతన పీహెచ్సీ భవనం నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేయాలి. భీమ్‌గల్‌లో కొత్త పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు పరిపాలనా అనుమతి మంజూరు చేయాలి. మోర్తాడ్ మండలం పాలెం లేదా తిమ్మాపూర్ గ్రామంలో కొత్త ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఏర్పాటు కోసం పరిపాలనా అనుమతి మంజూరు చేయాలి.
బాల్కొండలో ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు కొత్త భవన నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేయాలి. బాల్కొండ, మోర్తాడ్‌లో పోస్టుమార్టం భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేయాలి. నియోజకవర్గంలోని ప్రాథమిక అరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని నియమించాలి. ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. నియోజకవర్గంలోని 9 ఉపకేంద్ర భవనాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జాతీయ ఆరోగ్యమిషన్ నిధులను విడుదల చేయాలి. 18 ఆరోగ్య ఉపకేంద్రాలు నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేసి నిధులు విడుదల చేయాలని కోరారు.