న్యూఢిల్లీ : వచ్చే ఏడాది(2027) మార్చి నాటికి దేశంలో బ్యారియర్ ఫ్రీ, సంపూర్ణ డిజిటల్ వసూలు వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర రహదారి రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రకటించారు. ఈ విధానం అమల్లోకి వస్తే వాహనదారులు టోల్ చెల్లించేందుకు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2026లో మాట్లాడిన గడ్కరీ.. ‘ఏఐ, ఫ్రీ ఫ్లో టోలింగ్తో భారత్ టోల్ ప్లాజాల వద్ద ఆగే విధానం నుంచి వాటిని దాటే విధానంవైపు అడుగులు వేస్తోంది.
రేపటి హైవే అంతరాయం లేదని, నగదు రహితమైనది’ అని గడ్కరీ పేర్కొన్నారు. కొత్త టోల్ విధానంలో వాహనాల నంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికతతో పాటు ఫాస్ట్‌ట్యాగ్‌ను ఉపయోగించి టోల్ వసూలు చేయనున్నారు. ఫాస్ట్ ట్యాగ్ ఇప్పటికే టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 90 శాతం వరకు తగ్గించింది. కొత్త వ్యవస్థ ద్వారా టోల్ ఆదాయం మరో 10,000 కోట్లు పెరిగే అవకాశం ఉందని గడ్కరీ చెప్పారు.