నీలగిరి, అక్టోబర్ 01 : పోషక విలువలు ఉన్న ఆహారం క్రమం తప్పకుండా తీసుకుంటే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పౌష్టికాహారం ఎంతో కీలకమని నల్లగొండ ఐసిడిఎస్ సూపర్వైజర్ నిహారిక అన్నారు. నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మన్యం సెక్టార్ 24వ డివిజన్లో గురువారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల్య ఆహారం అవసరమని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రతి కుటుంబం అవగాహనతో ముందుకు రావాలని నిహారిక సూచించారు. పోషణ మాసం సందర్భంగా ప్రజల్లో పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ప్రమీల, ప్రేమలత, షాహిదా, ఆశా వర్కర్ సువర్ణ, ఆర్పీ అండాలు పాల్గొన్నారు.

పోషక విలువలతోనే తల్లీబిడ్డ ఆరోగ్యం : ఐసీడీఎస్ సూపర్వైజర్ నిహారిక