రుద్రంపూర్, అక్టోబర్ 01 : వృద్ధాప్యంలో ఆదరణ కోల్పోయిన వారికి అండగా నిలవడం, వారి ముఖాల్లో చిరునవ్వులు చూడడమే నిజమైన మానవత్వమని చాటుతూ రుద్రంపూర్లో మదర్ థెరిసా సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథలు, ఆదరణకు నోచుకోని వృద్ధులను చేరదీసి వారికి ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. మదర్ థెరిసా సేవా సంస్థ అధ్యక్షుల ఆధ్వర్యంలో వృద్ధులకు క్షవరం, కటింగ్ చేయించి, శుభ్రంగా స్నానం చేయించారు. అనంతరం వారికి నూతన వస్త్రాలను అందించి, స్వయంగా ధరింపజేశారు. వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
వృద్ధాప్యంలో శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చిన్నపాటి సహాయం కూడా ఎంతో విలువైనదని నిర్వాహకులు పేర్కొన్నారు. కుటుంబాలకు దూరమై ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు ఆప్యాయత, ప్రేమ, ఆదరణ కల్పించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వృద్ధుల అనుభవాలు, జీవిత పాఠాలు నేటి తరానికి ఎంతో విలువైనవని తెలిపారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వారికి అవసరమైన సమయంలో సహాయం అందించాలని, వృద్ధులను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం ద్వారా మానవత్వం, సేవాభావం చాటుకున్నామని నిర్వాహకులు తెలిపారు.

అనాథ వృద్ధులకు అమ్మలా మదర్ థెరిసా సేవా సంస్థ