న్యూఢిల్లీ : అధునాతన కృత్రిమ మేధస్సును సైనిక కార్యక్రమాల్లో దుర్వినియోగం చేసే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆంత్రోపిక్ తెలిపింది. ఉత్తర యెమెన్‌లోని గుర్తుతెలియని గ్రూప్ తన క్లాడ్ ఏఐ మాడల్‌ను రాకెట్లు, క్షిపణి వ్యవస్థల అభివృద్ధికి ఉపయోగించినట్టు వెల్లడించింది. ఆ గ్రూప్ మూడు ఆయుధ ప్రాజెక్టులపై పనిచేసినట్టు పేర్కొన్నది. వాటిలో గైడెడ్ రాకెట్, 2,000 కిలోమీటర్లకు పైగా పరిధి ఉన్న బాలిస్టిక్ క్షిపణి, ఆర్2000గా పిలిచే క్షిపణి వ్యవస్థ ఉన్నాయి. యెమెన్ గ్రూప్ రాకెట్లు, క్షిపణుల గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి క్లాడ్ ఏఐ సాయం తీసుకున్నది. వారి కార్యకలాపాలు గుర్తించకుండా ఉండేందుకు పలు ఏఐ సెషన్లలో పనిని విభజించారు.
ప్రాజెక్టుల సైనిక స్వభావాన్ని దాచేందుకు ప్రయత్నించారు. ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హౌతీ తిరుగుబాటు దళాలు కీలకమైన ప్రపంచ వాణిజ్య మార్గమైన ఎర్రసముద్రంలో నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆంత్రోపిక్ ప్రకటన వెలువడింది. ఈ గ్రూప్ ఒక రాకెట్‌ను ప్రత్యక్షంగా పరీక్షించిందని, ఆ ప్రయోగం విఫలం కావడంతో దాని కారణాలను అర్థం చేసుకునేందుకు క్లాడ్‌ను మళ్లీ ఉపయోగించినట్టు ఆంత్రోపిక్ తెలిపింది. అయితే ఈ ప్రయత్నం ఫలితంగా పనిచేసే ఆయుధం తయారైనట్టు తమవద్ద ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అనంతరం సంబంధిత క్లాడ్ ఖాతాలను ఆంత్రోపిక్ నిషేధించింది. అలాగే ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని భాగస్వామ్య సంస్థలతో పంచుకుని, భద్రతా నియంత్రణలను మరింత బలోపేతం చేసినట్టు తెలిపింది.