Dogs | మనుషులు మాట్లాడే నిరంతర సంభాషణలోని పదాలను కుక్కల మెదడు కూడా ఒక స్థాయిలో గుర్తించి వేరు చేస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. బుడాపెస్ట్‌లోని ఎట్వోష్ లోరాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. మనుషుల మాదిరిగానే కుక్కల మెదడు కూడా పదాల లయను గుర్తించి దానికి అనుగుణంగా స్పందిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా పదాల్లోని హల్లులు వాటి నిర్మాణానికి ఆధారంగా ఉన్నప్పుడు కుక్కల మెదడులో ఈ సమన్వయం మరింత స్పష్టంగా కనిపించింది. మనుషుల్లో గతంలో గుర్తించిన ఈ తరహా హల్లుల ఆధారిత ప్రాధాన్యత ఇతర జంతు జాతిలోనూ కనిపించడం ఇదే తొలిసారని పరిశోధకులు తెలిపారు.
ఈ పరిశోధనలో 20 మంది మనుషులు, 20 పెంపుడు కుక్కలను భాగస్వామ్యం చేశారు. వీరికి నిరంతరంగా, పదాలుగా విడదీయకుండా రూపొందించిన మాటల ధ్వని ప్రవాహాలను వినిపించారు. కొన్ని ధ్వని ప్రవాహాల్లో హల్లులు, మరికొన్నింటిలో అచ్చులు మూడు అక్షరాల నమూనాలుగా పదేపదే వచ్చేలా రూపొందించారు. మరో ధ్వని ప్రవాహంలో ఎలాంటి పునరావృత నమూనాలు లేకుండా ఉంచారు. ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేని ఈఈజీ పరీక్ష ద్వారా మెదడు కార్యకలాపాలను నమోదు చేశారు. హల్లులు పదాల నిర్మాణానికి ఆధారంగా ఉన్నప్పుడు కుక్కల మెదడు ఇతర ధ్వని ప్రవాహాలతో పోలిస్తే పదాల లయతో మరింత బలంగా సమకాలీకరించినట్లు పరిశోధకులు గుర్తించారు. మనుషుల్లోనూ ఇదే విధమైన స్పందన కనిపించింది.
ప్రతి పదం ప్రారంభమైన సుమారు 400 మిల్లీసెకన్ల తర్వాత కుక్కల మెదడు కార్యకలాపాల్లో మార్పు కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ మార్పు హల్లుల ఆధారంగా పదాలు నిర్మితమైనప్పుడు మాత్రమే స్పష్టంగా కనిపించింది. నిరంతరంగా వినిపించే మాటల ప్రవాహాన్ని విడివిడిగా పదాలుగా గుర్తించే ప్రక్రియకు ఈ సమయం సంబంధం కలిగి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఆసక్తికరంగా, చిన్న వయసులో మాటలు ఎక్కువగా వినని కుక్కల్లోనూ ఇదే హల్లుల ప్రాధాన్యత కనిపించింది. జీవితంలోని తొలి మూడు నెలలు వీధిలో లేదా ఆశ్రయ కేంద్రాల్లో గడిపిన కుక్కల్లో కూడా ఇలాంటి స్పందన కనిపించడం వల్ల ఇది ప్రత్యేకమైన ప్రారంభ భాషా శిక్షణ వల్ల మాత్రమే ఏర్పడాల్సిన అవసరం లేదని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణ నమూనాలను నేర్చుకోవడం ద్వారా కూడా ఈ నాడీ సంబంధిత ప్రాధాన్యత అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు.
అయితే మనుషులు, కుక్కల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలను కూడా అధ్యయనం వెల్లడించింది. అచ్చుల ఆధారంగా రూపొందించిన పదాలను మనుషులు గుర్తించగలిగినప్పటికీ, హల్లుల ఆధారంగా రూపొందించిన పదాలతో పోలిస్తే ఈ సామర్థ్యం తక్కువగా ఉంది. కుక్కలు మాత్రం అచ్చుల ఆధారంగా రూపొందించిన పదాలను గుర్తించలేకపోయాయి. రెండు జాతుల మెదళ్లూ అక్షరాల లయను ప్రాసెస్ చేసినప్పటికీ, వ్యక్తిగత మాట ధ్వనుల లయతో సమకాలీకరణ మాత్రం మనుషుల మెదడులోనే కనిపించింది. దీంతో మనుషులు మాటలను మరింత సూక్ష్మ స్థాయిలో, వ్యక్తిగత ధ్వనులను ప్రత్యేక ప్రక్రియలుగా పరిగణిస్తూ ప్రాసెస్ చేస్తుండగా, కుక్కలు అక్షరాలను తమ కనిష్ఠ ధ్వని యూనిట్లుగా ప్రాసెస్ చేస్తున్నట్లు పరిశోధకులు సూచించారు. మాటలను ప్రాసెస్ చేసే ఈ విధానానికి మనుషుల మాదిరిగా ముందుగానే ప్రత్యేకంగా ఏర్పడిన మెదడు నిర్మాణం లేదా భాషా సామర్థ్యాలు తప్పనిసరి కావని, క్రమం తప్పకుండా మాటలు వినడం వంటి సాధారణ అనుభవాలు కూడా మెదడు పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయని ఈ అధ్యయనం సూచిస్తోంది.