లక్నో: ఒక ఆలయంపై ఆధిపత్యం కోసం ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆ గుడికి చెందిన ఇద్దరు సాధువులు నిద్రిస్తుండగా ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత వారి మృతదేహాలకు నిప్పుపెట్టి పారిపోయాడు. (man kills 2 seers) దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సుథా గ్రామంలోని ఒక ఆలయంలో బాబా గోపాల్ దాస్, బాబా బిహారీ దాస్ అనే ఇద్దరు సాధువులు నివసిస్తున్నారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను వారు చూస్తున్నారు.
కాగా, అక్టోబర్ 1న ఉదయం స్థానికులు ఆలయానికి చేరుకున్నారు. అయితే ఆలయానికి చెందిన ఇద్దరు వృద్ధ సాధువుల మృతదేహాలు గుడి ఆవరణలో పాక్షికంగా కాలిన స్థితిలో ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు సాధువుల హత్యపై దర్యాప్తు చేపట్టారు. చివరకు 35 ఏళ్ల సుమిత్ సింగ్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
మరోవైపు నిందితుడు సుమిత్ సింగ్‌ను ప్రశ్నించగా ఆలయంపై ఆధిపత్యం కోసం, అక్కడ నివసించడం కోసమే ఇద్దరు సాధువులను హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీస్ అధికారి తెలిపారు. నిద్రిస్తున్న ఆ సాధువులపై ఇనుప రాడ్‌తో దాడి చేసి అతడు చంపాడని అన్నారు. ఆ తర్వాత ఆలయం ఆవరణలోని కట్టెలు, నెయ్యి వినియోగించి వారి మృతదేహాలకు నిప్పు పెట్టాడని పోలీస్ అధికారి వివరించారు. ఆలయం సమీపంలోని పొదల్లో దాచిన ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.