హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 ( నమస్తే తెలంగాణ ): ప్రభుత్వం వెంటనే 19 వేల పోలీస్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. సోమవారం ఇందిరాపార్క్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించారు. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకుడు కొడంగల్ రవి మాట్లాడుతూ ప్రభుత్వం 7, 437 పోస్టులతో కాకుండా 19వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి తెలంగాణ నిరుద్యోగుల బాధలు కనిపించకపోవడం దారుణమని పేర్కొన్నారు. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.