హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : పే సేల్స్, ప్రమోషన్లు, సమయానికి జీతాల చెల్లింపులతోపాటు పలు సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం వీబీజీ రామ్‌జీ ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వందలాది మంది ఎఫ్‌టీఈ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సాంకేతిక సిబ్బంది కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆఫీస్ ఎదుట బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, హెల్త్‌కార్డులు, ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ రూ.6వేలకు పెంచాలి అని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. 12 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కమిషనర్‌కు అందజేశారు. అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిషారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే పరిషరించకపోతే ధర్నాలు చేపడుతామని జేఏసీ నేతలు హెచ్చరించారు.