Jurala project | జూరాల ఆయకట్టుకు సాగునీటి కోసం రైతులు చేసిన పోరాటం ఫలించిందని మాజీ మంత్రి డా.సి. లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎనిమిది రోజుల రైతుల ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గిందని ఇది ముమ్మాటికి రైతుల విజయమన్నారు. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికి రైతులను కాంగ్రెస్ సర్కార్ అనవసరంగా గందరగోళానికి గురిచేసిందన్నారు. సడన్గా నీటి విడుదల బంద్ చేయడంతో పంటలు ఎండిపోతాయనే భయం రైతులను వెంటాడిందన్నారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల జూరాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీళ్లు విడుదల చేసిందని వానాకాలం సాగు పూర్తి అయ్యే వరకు నీళ్లు విడుదల చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలతీతంగా రైతులకు మద్దతుగా నిలుస్తుందని అందుకే నిన్న ధర్నాకు పిలుపునిచ్చిందన్నారు. కృష్ణా నదిలో వరద ప్రారంభమైనపుడు కూడా బీఆర్ఎస్ ధర్నా పిలుపుతోనే రైతులకు సాగునీరు వచ్చిందని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు.