2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ‘మేము 400కు పైగా సీట్లు సాధిస్తాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ ధీమాగా చెప్పారు. ఆయనకు బీజేపీ నాయకులూ వంత పాడారు. కానీ, ఒక్కో దశ పోలింగ్ ముగుస్తున్న కొద్ది చార్సౌ పార్ నినాదం పరారైంది.
BJP | ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు విడతలుగా జరుగనున్న ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ‘స్థానికంగా ఎవరు గెలుస్తారనేది ముందుగా పోలీసులు పసిగడతారు’ అని రాజకీయాల్లో ఓ బలమైన నమ్మకం ఉన్నది. అలాగే దేశంలో రాజకీయ పరిస్థితిని, రాజకీయ పక్షాల జయాపజయాలను స్టాక్‌మార్కెట్ ముందుగానే పసిగట్టడమే కాకుండా దానికి తగ్గట్టు స్పందిస్తుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు నెలల కిందట బీజేపీ విజయం సాధించడం, బీహార్‌లో అధికారంలో ఉన్న నితీష్ కుమార్ ఎన్డీయేలో చేరడంతో బీజేపీకి ఇక ఎదురులేదని స్టాక్‌మార్కెట్ పరుగులు తీసింది.
బీజేపీ సైతం ఈ విజయం తర్వాత ఈసారి 400 సీట్లలో విజయం సాధిస్తామని బలంగా ప్రచారం చేసుకున్నది. కానీ, పోలింగ్ దగ్గరపడుతున్న కొద్ది బీజేపీ 400 సీట్ల నినాదాన్ని పక్కనపెట్టి మతపరమైన చీలిక ద్వారా ఓట్లు సాధించడంపైనే ఎక్కువగా దృష్టి సారించింది. పదేండ్ల పాలనాకాలంలో తాము సాధించిన విజయాలు, ప్రజలకు చేసిన మేలు వల్ల 400 సీట్లు సాధిస్తామని కమలం పార్టీ ఎప్పుడూ భావించలేదు. ఆ కోణంలో ప్రచారం కూడా చేసుకోలేదు. మతంపైనే ఆ పార్టీ ఎక్కువగా ఆధారపడుతున్నది. బీజేపీ కోణంలో చూస్తే అది సరైన వ్యూహమే. పదేండ్ల పాలనలో చెప్పుకొనేందుకు ఏముంది? ఏమీ లేనప్పుడు ప్రజలెందుకు ఓటు వేస్తారు? అదే మతం కోణమైతే విజయానికి దగ్గరి దారి అవుతుంది. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి విజయం సాధించవచ్చు.
తొలి విడత పోలింగ్ తర్వాత ప్రధాని కూడా తన ప్రచార తీరును మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల సంపదను లాక్కొని ముస్లింలకు ఇస్తుందనే విచిత్ర ప్రచారాన్ని ఆయన నమ్ముకున్నారు. మంగళసూత్రాన్ని హిందూ మహిళలు పవిత్రంగా భావిస్తారు. మోదీ తన ప్రచారంలో మంగళసూత్రాలను సైతం వాడుకుంటున్నారు. ‘మీ మెడలో ఉన్న మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ వదిలిపెట్టదు, ముస్లింలకు దోచిపెడుతుంది’ అని మోదీ ఎన్నికల ప్రచారంలో ఓ వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టే ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ మౌనంగా చూస్తున్నది. ఒకప్పుడు బలంగా ఉన్న వ్యవస్థలు ఇప్పుడు ఎలా పని చేస్తున్నాయో దీన్నిబట్టే అర్థమవుతున్నది.
1991లో పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు అమలులోకి వచ్చిన ఆర్థిక సంస్కరణలే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. యూపీఏ, ఎన్డీయే, బీజేపీ ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ విధానాలు అలాగే కొనసాగుతున్నాయి. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన మోదీ అవే విధానాలను కొనసాగించారు. ఎవరు వచ్చినా అవే విధానాలు కొనసాగించక తప్పదు. అయితే స్థిరమైన ప్రభుత్వం ఉండాలని స్టాక్‌మార్కెట్ కోరుకుంటుంది. బీజేపీ 400 సీట్ల ప్రచార ప్రభావంతో దూసుకెళ్లిన స్టాక్‌మార్కెట్ పోలింగ్ తర్వాత ఇప్పుడు ఊగిసలాడుతున్నది. తొలి విడత పోలింగ్ నుంచి ఇదే వైఖరి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తొలి విడత పోలింగ్‌లో దాదాపు రెండు శాతం తక్కువ ఓటింగ్ జరిగింది.
తొలుత ఎనిమిది శాతం వరకు తక్కువ పోలింగ్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. వాస్తవ అంకెలు రావడానికి సమయం పడుతుంది. అయితే ఎనిమిది శాతం తక్కువ పోలింగ్ అనే వార్తలు వచ్చినప్పటి నుంచి స్టాక్‌మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. మూడు విడతల పోలింగ్‌లోనూ గతంలో కన్నా తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. గురువారం (మే 9) స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 1,062 పాయింట్లు పడిపోయింది. వరుసగా ఏడు సెషన్లలో సెన్సెక్స్ 1,900 పాయింట్లు పడిపోయింది. దీంతో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. మరోవైపు ఫారెన్ ఇన్వెస్టర్లు జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. మే నెలలో ఇప్పటివరకు రూ.15,863 కోట్ల వరకు స్టాక్స్ నగదు మార్కెట్లో, రూ.5,200 కోట్ల వరకు ఫ్యూచర్ మార్కెట్లో అమ్మకాలు సాగించారు.
అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ జెఫ్రీ 70 శాతం వరకు ప్రస్తుత ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, ఒకవేళ అధికార పక్షం ఓడిపోతే మార్కెట్ కుప్పకూలుతుందని జోస్యం చెప్పింది.
స్టాక్‌మార్కెట్ అనేది లక్షల కోట్ల రూపాయల వ్యాపారం. క్షణక్షణానికి కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది రాజకీయ పార్టీలకు మించి స్టాక్‌మార్కెట్‌కు ఆసక్తి ఉంటుంది. మొదటి దశ పోలింగ్ నుంచి మార్కెట్ పడిపోతుండడాన్ని గమనిస్తే బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవచ్చని మార్కెట్ భావిస్తున్నది. ఎన్నికల సర్వేను ఎన్నికల కమిషన్ నిషేధించినా సర్వేలు జరుగుతూనే ఉంటాయి. బడా ఇన్వెస్టర్లకు ఆ సర్వేలు చేరుతుంటాయి. దానికి తగ్గట్టు వాళ్లు ఇన్వెస్ట్‌మెంట్‌పై నిర్ణయాలు తీసుకుంటారు. మార్కె ట్ సెన్సెక్స్ పడిపోతుండటాన్ని గమనిస్తే సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనిపిస్తున్నది. సర్వేలు నిజం కావచ్చు, కాకపోవచ్చు కానీ 400 సీట్ల బీజేపీ దూకుడుకు స్పీడ్‌బ్రేక్ పడిందనే అభిప్రాయం మాత్రం కలుగుతున్నది.
400 సీట్లు అని పైకి ప్రచారం చేసుకున్నా మిత్రపక్షాలపైనే బీజేపీ మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నది. బీహార్‌లో నితీష్ కుమార్‌ను తిరిగి ఎన్డీయేలో చేర్చుకొనే ప్రసక్తే లేదని హోం మంత్రి అమిత్ షా అనేక సార్లు బహిరంగ సభల్లో ప్రకటించారు. కానీ, తిరిగి చేర్చుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనైతే ప్రధాన పార్టీలు రెండింటితో బీజేపీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నది. చంద్రబాబు పార్టీ బీజేపీకి మిత్రపక్షం అయితే, ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి మోదీకి మిత్రుడు. ఏ పార్టీ గెలిచినా ఏపీ సీట్లు బీజేపీకి కొండంత అండ. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సభల్లో జగన్మోహన్రెడ్డిని మోదీ పల్లెత్తు మాట అనలేదు. పైకి 400 సీట్లు అని చెప్పినా అధికారంలోకి రావడానికి కనీస మెజారిటీ రాకపోతే ఉపయోగపడతారని ప్లాన్-బీ కింద కొన్ని రాజకీయ పక్షాలతో బీజేపీ సఖ్యతతోనే ఉంటున్నది.
400 సీట్లు అనే నినాదాన్ని బీజేపీనే కాదు స్టాక్‌మార్కెట్ కూడా ఎప్పుడో వదిలేసింది. మార్కెట్ పతనం తీరుతెన్నులు గమనిస్తే.. ఎలాగైనా బీజేపీ నెగ్గుతుందని, సొంత బలంతోనో, మిత్రపక్షాల బలంతోనో తిరిగి అధికారం చేపడుతుందనే ఆశలు ఇంకా స్టాక్ మార్కెట్‌ను పూర్తిగా వదలలేదన్నట్టుగానే అనిపిస్తున్నది.
– బుద్దా మురళి