సాగునీటి గండం ముంచుకొస్తున్నది. మెట్టప్రాంతాల్లో గోస తీవ్రమవుతున్నది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బావులు, బోర్లలో నీటిమట్టం వేగంగా పడిపోతున్నది. మరోవైపు కాలువల నిర్మాణం పూర్తికాక.. పూర్తయినా సిల్ట్ తీయక, గండ్లు పూడ్చక.. పూడ్చినా నీళ్లు రాక పంటలు ఎండిపోయే దుస్థితి వచ్చింది. ఇప్పటికే పలుచోట్ల కండ్ల ముందే వరి, మక్క ఎండిపోతుండగా, అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కొందరు నిస్సహాయ స్థితిలో పంటలను వదిలేస్తుండగా, మరికొందరు రక్షించుకునేందుకు తంటాలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీళ్లు పడుతూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మున్ముందు వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోగా ప్రమాదం కనిపిస్తుండగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల నుంచి కాలువలు తవ్వకపోవడం, తవ్విన కాలువలకు నీళ్లు వదలక పోవడమే అందుకు కారణమని వాపోతున్నారు.
కరీంనగర్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : అప్పుడే సాగునీటి గోస మొదలైంది. ఇప్పటికే మెట్టప్రాంతాల్లో తీవ్రమైంది. చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి రైతులను ప్రతి యాసంగిలో సాగునీటి కొరత వెంటాడుతున్నది. మెట్టప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి కాలువ తవ్వేందుకు అలైన్మెంట్ జరిగింది. కానీ, పూర్తి స్థాయిలో భూసేకరణ జరగక ఇప్పటి వరకు కాలువల తవ్వకం పూర్తి కాలేదు. దీంతో ఈ గ్రామమే కాకుండా ఇందుర్తిలోని కొంత భాగం, బరిగెలపల్లి, బొల్లోనిపల్లి గ్రామాలు ఏటా వేసవిలో తాగునీటి ఎద్దడికి గురవుతున్నాయి. ఈ గ్రామానికి చెందిన రైతు కూన సదానందం పరిస్థితి అందుకు అద్దం పడుతున్నది. సదానందం నాలుగు ఎకరాల్లో మక్క, రెండెకరాల్లో వరి సాగు చేశాడు.
ఆయనకు 30 గజాల లోతైన బావి, మరో బోరు కూడా ఉన్నది. ఈ రెండు 24 రోజుల కిందనే ఎండి పోయాయి. వేసిన పంట కండ్ల ముందే ఎండి పోతుంటే సదానందం గుండె తరుక్కు పోయింది. సొంతంగా ట్రాక్టర్ ఉన్న సదానందం నెలకు 10 వేలకు మాట్లాడుకొని, ఒక నీటి ట్యాంక్‌ను అద్దెకు తీసుకున్నాడు. తన వ్యవసాయ భూమికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుడి కాలువ నుంచి ప్రతిరోజూ నీటిని నింపుకుని తెస్తూ.. తన గాజు బావిలో పోయించి అక్కడి నుంచి పంటలకు పారిస్తున్నాడు. ఇలా 24 రోజుల నుంచి ప్రతి రోజూ 10 నుంచి 12 ట్రిప్పుల నీటిని తెచ్చి వరి, మక్క పంటలకు పారిస్తున్నా రెండెకరాల మక్క ఎండిపోయింది. దీనిని వదిలేసి ఉన్న మక్కతోపాటు వరిని రక్షించుకునేందుకు సదానందం తంటాలు పడుతున్నాడు. పూర్తిగా చేతికి వస్తుందన్న నమ్మకం లేకున్నా..రోజూ రూ.వెయ్యి డీజిల్ ఖర్చు అవుతున్నా మిగిలిన పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

గంగాధర మండలం గోపాల్రావుపల్లి రైతులది మరో వేదన. నారాయణపూర్ రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోకి వచ్చే ఈ గ్రామానికి కొడిమ్యాల మండలంలోని మైసమ్మ చెరువు నుంచి రావ్వాల్సిన కాలువ అసంపూర్తిగా ఉన్నది. అక్కడక్కడా కాలువ తవ్వి వదిలేశారు. నారాయణపూర్ నుంచి వెళ్లే కుడి కాలువ కూడా నిరుపయోగంగా ఉంది. ఈ కారణంగా గోపాల్రావుపల్లితోపాటు చుట్టు పక్కల గ్రామాలకు సాగునీరు అందడం లేదు. ఫలితంగా ఐదారువందల ఎకరాల్లో పంటలు ఎండి పోయే దుస్థితి వచ్చింది. గత జనవరి, ఫిబ్రవరి వరకు ఈ గ్రామంలోని బావులు, బోర్లలో పుష్కలంగా ఉన్న నీళ్లు ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరగడంతో ఊహించని రీతిలో అడుగంటాయి. చేతికొచ్చిన పంటలకు నీరందించలేని రైతులు బావుల్లో పూడికలు తీయించడం, సైడ్ బోర్లు వేయిస్తున్నా పరిస్థితి చేయి దాటి పోయింది. వేసిన పంటలు కండ్ల ముందే ఎండి పోతుంటే రైతులు తట్టుకోలేక పోతున్నారు. మైసమ్మ చెరువు నుంచి కాలువ తవ్వితే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోతున్నారు. బీఆర్ఎస్ ప్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఇటీవల ఈ గ్రామాన్ని సందర్శించి రైతుల కష్టాలు, ఎండుతున్న పంటలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందడం లేదు. నీళ్లు వస్తాయనే నమ్మకంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఈ మండలంలోని జాగీరుపల్లి, గుజ్జులపల్లి తదితర గ్రామాలకు మిడ్‌మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ కుడికాలువ ద్వారా నీళ్లు అందాల్సి ఉన్నది. కానీ, దుద్దెనపల్లి వద్ద కొన్ని గ్రామాల రైతులు నీటి సరఫరాకు తరచూ అంతరాయం కలిగిస్తున్నారని, ఈ కారణంగా తమ గ్రామాలకు నీరు రావడం లేదని రైతులు వాపోతున్నారు. కాలువల్లో పూడిక పేరుకు పోవడం, అక్కడక్కడా గండ్లు పడడంతో కాలువల్లో నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ కారణంగా కాలువ చివరగా ఉన్న ఘనపూర్, జాగీరుపల్లి, గుజ్జులపల్లి తదితర గ్రామాలకు సాగు అందడం లేదు. వరి సంగతి దేవుడెరుగు ఆరుతడి పంటైన మక్క కూడా ఎండిపోతున్నది. గుజ్జులపల్లిలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నది. వరి, మక్క పంటలు ఎండిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే అందుకు కారణమని రైతులు స్పష్టం చేస్తున్నారు. కాలువల్లో పూడిక తీయకపోవడం, నీటి పర్యవేక్షణ సరిగ్గా చేయకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందని వాపోతున్నారు.
ఎలిగేడు మండల కేంద్రంలోని అక్క చెరువుకు నాలుగైదు రోజుల్లో ఎండిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. ఎస్సారెస్పీ డీ-86 కాలువకు సంబంధించి 10ఎల్ ద్వారా గొలుసుకట్టుగా ఎలిగేడు మండలం కొప్పెరకుంటను నింపుకొని అక్కచెరువు, ఎర్రగుంట, నర్సాపురం చెరువుల మీదుగా సుల్తానాబాద్ చెరువులోకి నీళ్లు వెళ్లాలి. అయితే, మండుతున్న ఎండలు, కాలువలో నీళ్లు రాక చెరువు ఎండిపోతున్నది. గత పదేళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని రైతులు గుర్తు చేస్తున్నారు.