తిరుమలగిరి ఆగస్టు 2 : తుంగతుర్తి నియోజక వర్గంలో రైతులు పూర్తిగా గోదావరి జలాలపైనే ఆధారపడి పంటలు సాగుచేస్తారు. ఈ క్రమంలో 2018 నుంచి క్రమం తప్పకుండా గోదావరి జలాలు అందేవి. దీంతో రైతులు బంజరు భూములను సైతం సాగు భూ ములుగా మార్చుకున్నారు. ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టుతో పాటు దీనికి అనుబంధంగా ఉన్న మిడ్‌మానేరు, లోయర్ మానేరు, డ్యామ్‌లు అడుగంటి ప్రస్తుతం తాగు నీటి అవసరాలకు మాత్రమే సరిపోను నీళ్లు ఉన్నాయి. దీంతో ఈ సీజన్లో ప్రాజెక్టు రెండో దశ కాల్వలకు నీళ్లు ఇవ్వలేమని నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటించారు. దీనితో ఈ సీజన్లో గోదావరి జలాలు వచ్చే అవకాశం లేదు. ప్రా జెక్టు చరిత్రలో పంటలకు సాగుకు నీరు ఇవ్వక పోవటం ఇదే తొలిసారి. ఇదే విషయాన్ని ఆ శాఖ అధికారులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. దీనితో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
కాల్వల పరిస్థితి దారుణం..
ఎస్సారెస్పీ కాల్వల్లో నీరు ఊరికే రాలేదు. కేసీఆర్ కఠోరమైన దీక్ష ఫలితంగానే రెండవ దశ కాల్వలో సాగునీరు అందింది. రైతుల కండ్లలో ఆనందం చూడాలనే కేసీఆర్ ఆ కాంక్షతో సూర్యాపేటకు కాల్వల ద్వారా నీరు అందింది. 1996లో ముఖ్యమంత్రి చంద్రబాబు శిలాఫలకం వేశారు. శంకుస్థాపన చేసిన రాళ్లు వెక్కిరించాయి. ఆ తర్వాత 2004లో జలయజ్ఞం పేరుతో ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ట్రయల్ రన్ చేసి సాగునీరు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 2010లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బయ్యన్న వాగు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి కాల్వలు గట్టిగా లేవని, నీరు వదలితే కాల్వలు కొట్టుకుపోతాయని నీటిని నిలిపి వేశారు. . దీంతో ఏండ్ల తరబడి నీళ్లు రాలేదు. కాల్వల పనులు ముందుకు కదలలేదు.
కాంట్రాక్టర్ల జేబులు నిండాయి. కాల్వల్లో కంపచెట్లు నిండాయి. రైతులకు మాత్రం కన్నీళ్లు మిగిలాయి. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి ప్రధాన కాల్వ 12 కిలోమీటర్లు, 30 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన డీబీఎంలు 69,70,71 అసంపూర్తి పనులు, ప్రాజెక్టు అంచనా రూ.500 కోట్లు కాగా రూ.340 కోట్లు సమైక్య పాలనలో ఖర్చు చేశారు. రూ.160 కోట్లు పనులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రైతుల కండ్లలో ఆనందం చూడాలని, వ్యవసాయం పండుగ కావాలని రూ.12 కోట్లతో 71 మైనర్ కాల్వల పనులు పునరుద్ధరణ, రూ.65 లక్షలతో కంపచెట్ల తొలగింపు, రూ.300 కోట్లతో కాల్వల పూర్తి స్థాయి మరమ్మతులు, లైనింగ్ పనులు పూర్తి చేయించారు. జిల్లాలోని చివరి ఆయకట్టు పెన్పహడ్ మండలంలోని రావిచెరువు వరకు గోదావరి జలాలు అందించిన భగీరథుడు కేసీఆర్ . 2018 నుంచి 2023 వరకు కాల్వల ద్వారా రైతులకు సాగునీరందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే.

మోటార్ల మరమ్మతులు చేయలేని ప్రభుత్వం..
రైతుల సంక్షేమం కోసం సాగు నీరందించేందుకు కేసీఆర్ వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు సాగునీరు అందిస్తే ప్రస్తుత ప్రభుత్వం రూ.10 కోట్లు పెట్టి మోటార్లు మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించలేదా ? మోటార్లు సరిచేయలేక వచ్చిన నీళ్లు సముద్రంలో పోతుంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
ప్రభుత్వ నీటి లెక్కలు..
లోయర్ మానేరులో 24 టీఎంసీలకు 5.5 టీఎంసీలు ,మిడ్‌మానేరులో 27 టీఎంసీలకు 8.1 టీఎంసీలు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 80 టీఎంసీలకు 16.9 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రిజర్వాయర్లలో ఉన్న నీటి సామర్థ్యం కేవలం తాగు నీటికే సరిపోతుందని చెబుతున్నారు. సాగు నీరందే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు నీటి విడుదల ప్రణాళికలు కూడా సిద్ధం చేయలేదు. 15 నుంచి 24 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటేనే సాగునీరు విడుదల చేయటం జరుగుతుందని ఎస్సారెస్పీ అధికారులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందేంది. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,12,950 ఎకరాలు గత ప్రభుత్వ హయాంలో సాగులోకి వచ్చింది. నియోజక వర్గాల వారీగా పరిశీలిస్తే తుంగతుర్తి నియోజక వర్గంలో 92,456 ఎకరాలు, సూర్యాపేట నియోజ వర్గంలో 80,637 ఎకరాలు, కోదాడ నియోజక వర్గంలో 39,866 ఎకరాల సాగు విస్తీర్ణం ఎస్సారెస్పీ కాల్వల కింద ఉంది. గతంలో ఈ ప్రాంతం కోనసీమను తలపించేది. ఎస్సారెస్సీ కాల్వల కింద సుమారు 800లకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. కాల్వల ద్వారా సాగునీరు అందించి ఈ చెరువులు, కుంటలు కూడా నింపడంతో భూగర్భ జలాలు పెరిగి వందల కిలోమీటర్లు దూరం వరకు భూగర్భ జలాలు ప్రవహించి రైతుల బోర్లు కూడా నిండుగా నీళ్లు అందించేవి. ప్రస్తుతం నీరు లేక సాగు భూములు బంజరు భూములుగా మారాయి.
కేసీఆర్ హయాంలో బీడు భూములకు జీవకళ
కేసీఆర్ పాలనలో వెనుబడిన తుంగతుర్తి నియోజక వర్గానికి కాల్వల ద్వారా సాగునీరు అందడంతో సిరుల మాగాణిగా మారింది. బీడు, బంజరు భూములు, తోటలు సైతం సాగు భూములుగా మారాయి. దండగన్న వ్యవసాయం పండుగలా మారింది. అన్నదాతల కండ్లలో ఆనందం నిండింది. సంవత్సరానికి ఇక్కడి రైతులు మూడు పంటలు పండించారు. మండే ఎండల్లో సైతం చెరువులు కుంటలు మత్తడి దుంకాయి. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తుంగతుర్తి నియోజకవర్గం గతంలో మాదిరిగా కరువు ప్రాంతంగా మారిందని రైతులు వాపోతున్నారు. కాల్వలు ఎండిపోయాయి..చెరువు, కుంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ భూములు, బంజరు భూములుగా మారాయి. రైతులు వలస పోవాల్సిన పరిస్థితి నెలకొంది.
సోయిలేని ప్రభుత్వం ఇది..
రైతులకు నీళ్లు ఇవ్వలేమని ప్రభుత్వం చెబితే ఏమన్నా ఉందా ? రైతులేని రాజ్యం ఉంటదా ఏడారిగా ఉన్న మా ప్రాంతంలోకి కేసీఆర్ వచ్చినంక 10 సంవత్సరాలు నిండుగా జలాలు వచ్చాయి. బీడు భూములన్నీ పచ్చని పంటసొలాలుగా మారాయి. ఈ ప్రభుత్వం వచ్చినంక మళ్లీ భూములన్నీ పడావు పడ్డాయి. రైతులు పొట్టకూటి కోసం వ్యవసాయం వదిలి వలస పోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులను ఆదుకోని ప్రభుత్వం ఎక్కవ కాలం నిలబడదు.
-కాటబత్తిని లక్ష్మీనర్సు, రైతు, బొల్లంపల్లి
కేసీఆర్ ఉంటే ఈ పరిస్థితి ఉండేదా..
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే రైతులు ఇంత గోస పడేవారా.. రైతుల బాధలు చూసేటోడా.. ఎన్ని బాధలు పడి అయిన రైతులకు సాగునీరు అందించే వాడు. ఆయన కాలంలో ఎక్కడ చూసినా పంటలే పంటలు. ప్రస్తుతం వర్షాలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కాలం కానప్పుడు రైతులను ఆదుకున్నోడు గొప్పోడు. కాలమైనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏందీ ఆదుకునేది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇలాగే కాలం కాక పంటలు ఎండినయి . కాల్వల ద్వారా రైతులకు నీరందించి ఆదుకుండు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
-గోపగాని సూరయ్య, రైతు, తుంగతుర్తి
ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒక్కటే..
10 సంవత్సరాలు కాల్వల కింద పుష్కలంగా నీళ్లు అందినయి. పుట్లకొద్దీ ధాన్యం పండించినం. ఆర్థికంగా బలపడినం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినంక రైతులకు అన్నీ కష్టాలే. వ్యవసాయం చేయాలంటే యుద్ధం చేసినట్లే అనిపిస్తున్నది. కాల్వల కింద ఉన్న పొలాలన్నీ బీడు భూములుగా మారాయి. నీళ్లు ఇవ్వకుంటే రైతులు ఎట్ల బతకాలి. రైతులను ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒక్కటే.. గతంలో వచ్చి ఇప్పుడు నీళ్లు ఎందుకు రావు. రైతుల మీద ధ్యాస లేదు.
-బెల్లి ఇస్తారి, రైతు, నాగారం
వర్షాభావంతో సాగునీరందే అవకాశం లేదు..
డీఈఈ,సత్యనారాయణ,ఎస్సారెస్పీ రెండో దశ కాల్వ
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం ఉండటం, ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం తక్కువగా ఉండటంతో కేవలం తాగునీటి కి మాత్రమే నీరు ఉపయోగ పడుతుంది. సాగు నీటికి ఈ సీజన్లో నీరందటం కష్టం. ఒక వేళ ఈ నెల చివరి వరకు భారీ వర్షాలు కురిసి వరదలు వస్తే నీటి విడుదలపై స్పష్టత వస్తుంది. రైతులు వరి సాగు చేయకుండా అరుతడి పంటలు వేయడం శ్రేయస్కరం.