తిమ్మాపూర్, సెప్టెంబర్30: కరీంనగర్- హైదరాబాద్ రాజీవ్ రహదారిపై తప్పిపోయిన ఓ బాలుడిని గుర్తించిన స్థానికులు ఎల్ఎండీ పోలీసులకు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా సమీపంలో రాజీవ్ రహదారిపై ఓ చిన్న పిల్లాడు ఒంటరిగా నడుస్తూ వెళ్తూ కనిపించాడు.
బుధవారం సాయంత్రం సదరు బాలుడిని స్థానికులు, టోల్ సిబ్బంది గమనించి.. ఊరు, పేరు వంటి వివరాలు అడగగా అతడు చెప్పలేదు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ వివరాలు అడిగినా.. అతడు ఏమీ బదులివ్వలేదు. దాంతో వారు ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. ఆ బాలుడు ఎంతకీ వివరాలు తెలపకపోవడంతో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగిస్తామని ఎస్సై అన్వర్ తెలిపారు. ఈ బాలుడి ఆచూకీ, వివరాలు తెలిసినవారు 8712670770 నంబర్లో సంప్రదించాలని ఎస్సై కోరారు.