Puvvada Ajay Kumar : సిరిసిల్ల సభలో కేసీఆర్, కేటీఆర్‌లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలోపరిపాలన గాలికి వదిలేసిన సీఎం నిత్యం అబద్ధాలు, విద్వేషాలు, దూషణలతో కాలక్షేపం చేస్తున్నారని పువ్వాడ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆవేశానికి లోనై ఆక్రోశంతో సిరిసిల్ల సభలో కేసీఆర్, కేటీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు.
ప్రజాపాలన అంటూ విపక్ష నేతలపూ బూతుపురాణం చదువుతున్న సీఎం రేవంత్ రెడ్డి తీరును మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తప్పుబట్టారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గౌరవం, సంస్కారం పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన.. అందుకు భిన్నంగా వ్యక్తిగత విమర్శలు, అసభ్య పదజాలంతో రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధ్యతారాహిత్యమని పువ్వాడ అజయ్ విమర్శించారు. సిరిసిల్ల సభలో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన సమయంలో బీఆర్ఎస్ ముఖ్యనేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, పరిపాలనలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారని మాజీ మంత్రి పేర్కొన్నారు.