కారేపల్లి,సెప్టెంబర్ 30: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు పథకాలతో లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ తెలిపారు. బుధవారం సింగరేణి మండలంలోని పలు ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో ఏడీఏ తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిష్టర్లు, విక్రయ వివరాలను ఆమె పరిశీలించారు.
ఎరువుల గోదాములను తనిఖీ చేసిన ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ పీవోఎస్ మిషన్‌లో స్టాక్, రికార్డుల్లో చూపుతున్న నిల్వలకు పోల్చిచూశారు. పురుగుమందుల గడువు తేదీలు, వాటి నిల్వ, విక్రయాలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ కరుణశ్రీ మాట్లాడుతూ.. రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు.
పంటల డిజిటల్ నమోదు ప్రక్రియ నడుస్తుందని, పంట నమోదు చేసుకోవటం ద్వారా.. పంట ఫలసాయాన్ని పొందడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు అమ్మడం వంటివి సులభమవుతాయని ఏడీఏ పేర్కొన్నారు. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, పారదర్శకత కోసమే యాప్ ద్వారా యూరియా అమ్మకాలు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందేలా డీలర్లు కృషి చేయాలని సూచించిన ఆమె ఎప్పటికప్పుడు అధికారులతో విజిలెన్స్ తనిఖీలు కొనసాగిస్తామని చెప్పారు. తనిఖీల్లో ఏడీఏ వెంట మండల వ్యవసాయ అధికారి బట్టు అశోక్‌కుమార్, ఏఈఓ నరేష్, తదితరులు పాల్గొన్నారు.