గ్రేటర్లో జనాభాకు పోటీగా వాహనాల సంఖ్య పెరుగుతున్నది. ప్రతి నెల సుమారు 25వేల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక వాహనాలతో గ్రేటర్ హైదరాబాద్ దూసుకుపోతున్నది. విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపార రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్న ఈ మహానగరంలో గడప దాటితే వాహన వినియోగం అనివార్యంగా మారింది. అందుకే ఒక్కో ఇంట్లో రెండు, మూడు వాహనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ రికార్డుల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో వాహనాల సంఖ్యను పరిశీలిస్తే.. జనాభాను మించి ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ప్రధానంగా ఇందులో 70 శాతానికి పైగా ద్విచక్రవాహనాలు ఉండగా, 18-19 శాతం వరకు కార్లు ఉండటం విశేషం. ఓ వైపు ఆర్టీసీలో 25 లక్షల మంది, ఎంఎంటీఎస్‌లో 3.50లక్షలు, మెట్రోలో సుమారు 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నప్పటికీ వ్యక్తిగత వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ స్థాయిలో వాహనాలు తిరిగేందుకుగాను రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులు, ట్రాఫిక్ నిర్వహణ చేయాల్సి ఉంటుంది. కానీ గ్రేటర్లో అడుగడుగునా ట్రాఫిక్ సమస్యే కనిపిస్తున్నది. ఫలితంగా రానున్న రోజుల్లో పటిష్ట చర్యలు తీసుకోకపోతే ట్రాఫిక్ వలయంలో నగరం చిక్కుకోవాల్సిన ప్రమాదకర పరిస్థితి ఉటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ టాప్…
వాహనాల రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ ముందు వరుసలో నిలుస్తున్నది. హైదరాబాద్ పరిధిలో ఖైరతాబాద్, మెహిదీపట్నం, బండ్లగూడ, మూసారంబాగ్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా… గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డిలో కొండాపూర్, మణికొండ, ఇబ్రహీంపట్నం కార్యాలయాలు ఉన్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో ఉప్పల్, కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 43 లక్షల అన్ని రకాల వాహనాలు ఉండగా, రంగారెడ్డి పరిధిలో 24 లక్షలు, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో సుమారు 20 లక్షల వరకు ఉన్నట్లుగా రవాణా శాఖ రికార్డులు చెబుతున్నాయి. దీంతో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 88 లక్షల వాహనాలు ఉండగా… ఇందులో 70 శాతానికి పైగా ద్విచక్రవాహనాలే ఉన్నాయి. మూడు జిల్లాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయ రికార్డులను పరిశీలిస్తే… అత్యధికంగా హైదరాబాద్ పరిధిలోనే 50 శాతం కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా మారాయి.
సిగ్నళ్ల వద్ద బెంబేలే..!
నగరంలోని సిగ్నళ్ల వద్ద వాహనాలు ఒక్క 5 నిమిషాలు ఆగితే చాలు ఆ మార్గం నిండా వాహనాలు నిండిపోతాయి. సుమారు 3 నుంచి 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోతాయి. కనీసం సిగ్నల్ ఫాయింట్ వచ్చే వరకు కాలు కింద పెట్టాలన్నా పక్క వాహనానికి తాకేల వాహనదాల రద్దీ ఉండటం గమనార్హం. నగరంలో ప్రస్తుతం అన్ని దారులు బిజీగా మారిపోయాయి. ఏ ఒక్కదారిలో ట్రాఫిక్ సమస్య తలెత్తినా అది నిమిషాల్లోనే ట్రాఫిక్జాంకు కారణమవుతుంది.
గ్రేటర్లో వాహనాల సంఖ్య ఇలా..
హైదరాబాద్ జిల్లా -43,12500
రంగారెడ్డి జిల్లా -24,12648
మేడ్చల్ జిల్లా – 20,87031
మొత్తం గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య – 88,12,179
ద్విచక్ర వాహనాలు – 70 శాతానికి పైగా…
రెండో స్థానంలో – కార్లు 18-19 శాతం