జగిత్యాల, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) / పెద్దపల్లి (నమస్తే తెలంగాణ)/ రామడుగు/ ధర్మారం/ వెల్గటూర్ : కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక గుడి కాదని, మేడిగడ్డ బ్యారేజీ రెండు పిల్లర్లు కాదని.. కాళేశ్వరం అంటే ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు అని, తెలంగాణను సస్యశ్యామలం చేసే జీవధార అని బీఆర్ఎస్ ప్రతినిధులు బృందం అభిర్ణించింది. గోదావరి జలాలను ఎదురెక్కించి, బీడు భూములను తడిపిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడింది. కాళేశ్వరం కూలిపోలేదని, నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల నుంచి ఎగిసిపడుతున్న గోదావరి జలాలే అందుకు సాక్ష్యమని, ఆ జలాలను ఎత్తిపోస్తున్నది కాళేశ్వరం పంపులేనని స్పష్టం చేసింది.
కాళేశ్వరం కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి, ఆయన భజన బృందం చేసే విష ప్రచారంలో అర్థం లేదని తేటతెల్లం చేసింది. నిన్నామొన్నటి వరకు కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు కాళేశ్వరంలో భాగమైన నంది, గాయత్రీ పంప్‌హౌస్‌లను ప్రారంభించి నీటిని మిడ్‌మానేరులోకి, అలాగే ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరదకాలువలోకి తరలిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు మరోసారి తెలియజేయడంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన భజన బృందానికి కనువిప్పు కలిగించేందుకు బీఆర్ఎస్ బృందం ఆదివారం నిజనిర్ధారణ యాత్ర చేపట్టింది.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెలేలు దాసరి మనోహర్‌రెడ్డి, సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, దావ వసంత పాల్గొన్నారు. వీరు ముందుగా కోటిలింగాలో ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌ను, ఆ తర్వాత ధర్మారం మండలంలోని నందిమేడారం వద్ద నంది పంప్‌హౌస్ మోటర్లను పరిశీలించారు. అనంతరం రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌ను సందర్శించారు. ఎల్లంపల్లి నుంచి నీటిని నందిమేడారానికి ఎలా ఎత్తిపోస్తారు? అక్కడి నుంచి గాయత్రీ పంప్‌హౌస్‌కు ఎలా తరలిస్తారు? అక్కడి నుంచి మిడ్ మానేరుకు ఎలా తీసుకెళ్తారు? అన్నది క్షేత్రస్థాయిలో చూపించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కండ్లముందుంచడంతోపాటు కాంగ్రెస్ నాయకుల కుట్రలను ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా, ఎత్తిపోతల పద్ధతిలోనే మిడ్‌మానేరుకు నీళ్లు పోతున్నాయన్న విషయాన్ని సీఎం, మంత్రులు యాదికి పెట్టుకోవాలి సూచించారు. ముందుగా గోదావరి నదిపై అవగాహన పెంచుకోవాలని, ఆ తర్వాతే మాట్లాడాలని హితవు పలికారు. రాజకీయాలు పక్కన పెట్టి కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని సూచించారు.
ఈ యాత్రలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణ రావు, రాంకిషన్‌రావు, డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఉప్పుగండ్ల నరేందర్ రెడ్డి, కొత్త జయపాల్‌రెడ్డి, మాజీ మేయర్ సర్దార రవీందర్‌సింగ్, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు మంథని ఇన్చార్జి వీర్ల వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీలు పునుగోటి ప్రశాంతి, కొంకటి లచ్చిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్‌కుమార్, పార్టీ రామడుగు మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మోసం చేయాలనే కుట్ర
కాళేశ్వరం విషయంలో సీఎం, మంత్రులకు ప్రజలను మోసం చేయాలనే కుట్రే తప్ప మరో ఉద్దేశమే లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరు వస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చెప్పడం సిగ్గుచేటు. ప్రజలు నవ్వుతున్నరు. ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేక చేతులెత్తేసింది. రాయపట్నం వద్ద కొత్త వంతెనను నిర్మించాల్సి వస్తుందని, ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందని కనీసం ఆ ప్రాజెక్టుకు గేట్లు సైతం బిగించలేదు.
కానీ, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినం. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేసినం. కాంగ్రెస్ సర్కారు కట్టిన ఎల్లంపల్లి నుంచే నీళ్లు పారితే.. ఎల్లంపల్లి నుంచే రాష్ట్రమంతా 240 టీఎంసీల నీళ్లు వచ్చేలా ఉంటే.. సమైఖ్య రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్సార్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎందుకు ప్రతిపాదన చేసిండు? ఎల్లంపల్లి ప్రాజెక్టే సరిపోయేది కదా..? మరి సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ కట్టి తీరుతం అని ఎందుకు అంటున్నారో ప్రజలకు వివరించాలి.
-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

రేవంత్.. తెలుసుకొని మాట్లాడు
సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖమంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి, మంత్రులందరికీ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏమాత్రం అవగాహన లేదు. తెలియకపోతే తెలుసుకోవాలి. అందులో తప్పేమీ లేదు. కానీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దయచేసి రేవంత్‌రెడ్డి మాటలు వినద్దు. ఇక్కడి ప్రజల కష్టాలను తెలంగాణ మనసుతో ఆలోచించే నాయకుడు రేవంత్ కాదు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని అంటున్నడు. ఇంత బ్రహ్మాండంగా ఎత్తిపోస్తున్నా కూలేశ్వరం ఎట్లయితది? కాళేశ్వరం అంటే కేవలం ఒక్క మేడిగడ్డ కాదన్న విషయాన్ని ఆయన గ్రహించాలి. ఇక్కడ జలాలు ఎత్తిపోస్తున్న దృశ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపించాలి. ఇక్కడి నీళ్లను చూసి మనమంతా సంబురపడుతున్నా, నిజానికి కావలసినంత జలాలు రాలేదు.
ఈరోజు ఉదయం ఎల్లంపల్లి జలాశయంవద్ద గేట్లను బంద్ చేసిన్రు. సీడబ్ల్యూసీ లెక్కలు చూస్తే ఎల్లంపల్లికి పైనుంచి వరదనీరు ఆగిపోయింది. మేడిగడ్డ వద్ద సుమారు 5లక్షల 20వేల క్యూలెక్కుల వరదనీరు పోతున్నది. కన్నెపెల్లితో పాటు అన్నారం, సుందిళ్లలో మోటర్లను ప్రారంభిస్తేనే ఎల్లంపల్లి జలాశయానికి చేరుకుంటయి. ఒకవేళ ఆ మోటర్లను ప్రారంభించకపోతే ఈ పంపులు ఆగిపోతయి. ఇప్పటి వరకు కడెం, ఎల్లంపల్లి జలాశయాల్లో తప్ప తెలంగాణలో ఏ జలాశయంలో కూడా నీళ్లు లేవు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో మంచినీళ్లకు కూడా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తది. అన్నారం, సుందిళ్ల వద్ద వరద వెళ్తున్నది. అక్కడి గేట్లను మూసి రేవంత్ ప్రభుత్వం ఒకసారి పరీక్షించాలి.
ఎన్డీఎస్ఏ కుంటి సాకు చూపుతూ వచ్చిన వరదనీటిని కిందికి వదిలేయడం సరికాదు. ఎన్డీఎస్ఏ అదో పనికిరాని సంస్థ. అలాంటి సంస్థను అడ్డు పెట్టుకొని నీరందకుండా చేయడం భావ్యం కాదు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎల్లంపల్లి నుంచి రాజరాజేశ్వర జలాశయానికి గ్రావిటీ ద్వారా నీరు వెళ్తుందని అనడం హస్పాస్పదం. గ్రావిటీ ద్వారా నీరు వచ్చేది ఉంటే ఎందుకు మోటర్లను ఆన్ చేసి పంపింగ్ చేస్తరు? కాంగ్రెస్ పార్టీ ముందుగా తెలంగాణలోని నదులపై అవగాహన పెంచుకోవాలి. ఎమ్మెల్యేలు, మంత్రులకు అవగాహన సదస్సులను పెట్టాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు సూచించినం. కేసీఆర్‌పైన, బీఆర్ఎస్పైన కక్షతో కాకుండా ప్రజల కోసం ఆలోచించాలి. రాజ్యాధికారం ఎల్లకాలం ఎవరి చేతులో ఉండదు. ఇలాంటి ప్రాజెక్టులు ఎల్లకాలం ఉంటయి.
– మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
అవగాహన లేకుండా మాట్లాడవద్దు
ప్రపంచం గర్వించదగిన రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, బాహుబలి మోటర్లను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌లోని బాహుబలి మోటర్లు సుమారు 115 మీటర్ల భూగర్భంలోంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నయి. ప్రాజెక్టుపై అవగాహన లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు. ఎల్లంపల్లి నుంచి రాజరాజేశ్వర జలాశయానికి గ్రావిటీ ద్వారా జలాలను తరలించవచ్చని కాంగ్రెస్ మంత్రులు చెప్పడం వారికి అవగాహన లేదని చెప్పడానికి నిదర్శనం. మేడిగడ్డ నుంచి గాయత్రీ పంపుహౌస్ వరకు ఎక్కడా గ్రావిటీ లేదు. అంతా పంపుల ద్వారానే ఎత్తిపోస్తరు. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి మంత్రి వర్గం గ్రహించాలి. మిడ్‌మానేరు వరకు గ్రావిటీ ఉంటే ఇన్ని పంపుహౌస్‌లు, మోటర్లు ఎందుకు? ఈ రోజు కరువు పరిస్థితులకు కారణం కేవలం మంత్రివర్గమే. ముందుచూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఎత్తిపోతలు చేపట్టాలి. అన్ని జలాశయాలు, చెరువులు, కుంటలు నింపాలి.
– లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్ వద్ద కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
ఇది అసమర్థ ప్రభుత్వం
నదీ జలాలను ఎలా వాడుకోవాలో తెలిసిన గొప్ప నాయకుడు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన అపర భగీరథుడు కేసీఆర్. దిగువకు వెళ్లే గోదావరి, ప్రాణహిత జలాలను ఎగువకు ఎదురెక్కించి, బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. నాడు ఎస్సారెస్పీ నుంచి వచ్చే వరద కోసం నిర్మించిన వరదకాలువ గుండా నేడు కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా ఎదురెక్కిస్తున్న ఘనత కేసీఆర్‌దే కదా! నేడు వరద కాలువ జీవ నదిగా మారిందంటే అది కేసీఆర్ చలువే కదా! తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టి 60 టీఎంసీల నీటిని తరలిస్తామన్న రేవంత్ అధికారంలోకి వచ్చి ముప్పై నెలలు గడిచినా తట్టెడు మట్టి తీయలేదు.
మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు దెబ్బతింటే వాటికి ఇంత వరకు కనీసం మరమ్మతులు చేయించలేని అసమర్థ ప్రభుత్వం ఇది. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి యాక్షన్ వెరిసి రాష్ట్ర పాలన ఫ్లాప్ షోగా మారింది. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇంత వరకు కన్నెపెల్లి పంప్‌హౌస్‌ను సందర్శించలేదు. కానీ, అంత అయిపోయాక ఎస్సారెస్పీని సందర్శించడం ఆశ్చర్యంగా ఉన్నది. నీళ్లపైన, ప్రాజెక్టులపైనా సీఎంకు అవగాహన లేదు. మంత్రులకు కూడా లేదు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయనే తెల్వదు. ముందుగా ప్రాజెక్టులపై ఇంత అవగాహన పెంచుకోవాలి. రేవంత్ మూర్ఖపు ఆలోచనలు మానుకోవాలి. ఇప్పటికైనా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలి.
– మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
ప్రజలు నమ్మరు
కాళేశ్వరంతో కరువును దూరం చేసింది కేసీఆర్. ఆయన పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఇది అందరికీ తెలుసు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరు. నంది పంప్‌హౌస్ కాళేశ్వరంలో భాగం కాదా.. ఈ ఎత్తిపోతలు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోవి కాదా..? కాంగ్రెస్ పాలకులు కళ్లున్న కబోధుల్లా ప్రవర్తిస్తున్నరు. పంప్‌హౌస్‌ల నుంచి వస్తున్న జలదృశ్యాలను చూసైనా అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకుంటం. సుస్థిరమైన ఆయకట్టు, తాగునీటి కోసం కృషి చేస్తం. గోదావరి, ప్రాణహిత జలాలను ఒడిసి పట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటం.
-ఎమ్మెల్సీ ఎల్ రమణ
ప్రజలను వంచించడం మానుకోవాలి
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏమాత్రం అవగాహన లేదు. కన్నెపల్లి నుంచి లక్ష్మీపూర్ వరకు ఉన్న పంపులను సందర్శించాలని కేటీఆర్, హరీశ్‌రావు కాంగ్రెస్ మంత్రివర్గానికి సూచిస్తే, ఎస్పారెస్పీని సందర్శించిన్రు. ఎస్సారెస్పీని ఎప్పుడు నిర్మించిన్రు? ఇప్పుడు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజలు చూసి నవ్వుకుంటున్నరు. మేడిగడ్డకు, మేడారంకు తేడా తెలియని సన్నాసి ఈ చొప్పదండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నడు. సైక్లోన్ ద్వారా వర్షాలు పడితే గిరిప్రదక్షిణ చేస్తే వర్షాలు పడ్డాయని చెప్పడం సిగ్గుచేటు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా ప్రజలను వచించడం మానుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని జలాశయాలకు నీటిని ఎత్తిపోయాలి.
-చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్