– బీసీల అలాయ్ బలాయ్
నల్లగొండ, సెప్టెంబర్ 16 : ప్రముఖ కవి, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ సంపాదకత్వంలో 2001లో ప్రచురించబడిన “వెంటాడే కలాలు వెనుకబడిన కులాలు” కవితా సంకలనం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 20న రజితోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కవుల సమ్మేళనం బీసీల అలాయ్ బలాయ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను నల్లగొండలోని మహాత్మా జ్యోతిరావు పూలే సెంటర్లో బుధవారం ఆవిష్కరించారు. ప్రముఖ తెలంగాణ జీవకవి మునాస్ వెంకట్, కవి, గాయకుడు అంబటి వెంకన్న ఇతర కవులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునాస్ వెంకట్ మాట్లాడుతూ.. 25 సంవత్సరాల కింద వెలువడినటువంటి ఈ బీసీ సంకలనం ఆనాడు ఒక ప్రభంజనాన్ని సృష్టించిందన్నారు. ఈ గడిచిన కాలంలో బీసీల స్థితిగతులను ఏమైనా మార్పు వచ్చిందా ? బీసీల ఉన్నతిని కాంక్షించినటువంటి ప్రజా సంఘాలు, నాయకులు ఏ స్థితిలో ఉన్నారు. బీసీ సమాజం రోజురోజుకు వెనకడుగు వేయడానికి గల కారణాలను, బీసీ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకు రాకపోవడానికి గల కారణాలను, బీసీ కవులను, బీసీ నాయకులను, బీసీ సమాజాన్ని విస్మరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను మనం ఏనాడైనా నిలదీస్తున్నామా ? చట్టసభలలో రిజర్వేషన్లు లేనంత కాలం బీసీల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాదని, అద్భుతమైనటువంటి బీసీ సాహిత్యాన్ని సృష్టించిన నల్లగొండ కవులు ఆ కవిత్వం వృథా కాకుండా ఉండాలంటే బీసీలలో తగిన చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు.
బీసీ సాహిత్యాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉందన్నారు. ఏదేమైనా జూలూరి గౌరీ శంకర్ సంపాదకత్వంలో 23 మంది కవులు రాసినటువంటి ఈ వెంటాడే కళాలు వెనుకబడిన కులాలు అనేటువంటి కవితా సంకలనం ఎప్పటికీ ఒక చరిత్రగానే మిగిలిపోకుండా ఉండాలంటే అక్కడి నుండి సాహిత్యం గాని నాయకులు గాని ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉందన్నారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నటువంటి ఈ తరుణంలో బీసీ కవులు, కళాకారులు, వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున సెప్టెంబర్ 20న సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తరలి రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమ గాయకుడు అంబటి వెంకన్న బీసీలకు సంబంధించిన “గర్జించరా నువ్వు గర్జించరా బీసీ సోదర నువ్వు దండెత్తర” అనే పాటను పాడి కార్యక్రమాన్ని ఉత్తేజ పరిచారు. సమైక్య పాలనలో వృత్తులు విధ్వంసమై కరువు పీడిత ప్రాంతంగా గుర్తించబడిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆ వృత్తిదారులకు పేదలకు జవసత్వాలను అందించాల్సింది. కానీ ఎక్కడ ఏసిన గొంగడి అక్కడే అన్నట్టుగా బీసీల స్థితిగతులలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీల ప్రాతినిధ్యం లేకుండానే ఈ పాలన కొనసాగడం ఎంతటి సిగ్గుచేటు, ఎంత అప్రజాస్వామికము ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఢిల్లీ మీద దండెత్తి మన హక్కుల్ని సాధించుకునే దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం అన్ని బీసీ సంఘాల నాయకులు ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సంకలనంలో తనవి 5 కవితలు ఉన్నట్టు అందులో “వల ఏరియకముందే” అనే తన కవితను
“మా పుట్టుకలు మేఘాలై
బతుకు శోక సముద్రం అవుతుంటే
మా వెన్ను కట్టమీద లారీలు పెట్టి
మాకు కడుపులో లేనట్టు
మా పొట్ట పేగుల్ని కూడా దేవక పోతుండ్రు
దొరలు దళారులు” అంటూ చదివి వినిపించాడు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సెప్టెంబర్ 20న హైదరాబాదులో నిర్వహిస్తున్న బీసీల అలా బలాయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అన్ని బీసీ సంఘాల నాయకులకు బీసీలు కవులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుండు వెంకటేశ్వర్లు, మిరియాల యాదగిరి, ప్రజా హక్కుల నాయకుడు పర్వతాలు, రావుల లింగస్వామి పాల్గొన్నారు.