గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రభుత్వం వేలాదిగా నిర్మాణాలు, ఇండ్ల స్థలాలను నిషేధిత జాబితాలోకి చేర్చినట్లుగా బయటపడుతున్నది. తమ ఇండ్లు, స్థలాలు తమ పేరిటనే ఉన్నాయా? తమకు తెలియకుండానే నిషేధిత జాబితాలో చేర్చారా? అనే ఆందోళనలో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకవేళ తమ ఇండ్లు సీలింగ్, జీ సర్కారీ భూముల్లోనే ఉంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా 22ఏలో ఎలా చేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాల కిందట అన్ని పక్కా ఆధారాలతో కొనుక్కున్న స్థలాలు ఇప్పటికిప్పుడు ప్రభుత్వానివి ఎలా అవుతున్నాయని నిలదీస్తున్నారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే కావాలనే తమ ఇండ్లను నిషేధిత జాబితాలోకి మార్చి అక్రమంగా భూములను లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ఇప్పటికే హైడ్రా పేరిట నిరుపేదల ఇండ్లు, స్థలాలను అక్రమంగా లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిషేధిత జాబితాను సాకుగా చూపుతూ ప్రజల ఇండ్లు, భూములను లాక్కొనేందుకు పెద్ద కుట్ర జరుగుతున్నదని మండిపడుతున్నారు. దశాబ్దాల ఏండ్ల నాటి పాత రికార్డులను సాకుగా చూపుతూ సీలింగ్, వివాదాల్లో ఉన్నట్లు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతుండగా జిల్లా కలెక్టర్ మాత్రం తమకేమీ సంబంధం లేదని చెప్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. అన్ని అధారాలున్నా తమ ఇండ్లను 22ఏలోకి ఎందుకు చేర్చారని ప్రశ్నిస్తే.. అదంతా తనకు తెలియదని సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు. జిల్లా కలెక్టరే స్వయంగా తమ పరిధిలో లేదని చెప్తుండగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
గ్రామాలకు గ్రామాలే 22ఏ లోకి..
తహసీల్దార్లు ఆయా గ్రామాల్లోని స్థలాలను 22ఏలోకి చేర్చినట్లు గతేడాదిలోనే కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు. 1908 రిజిస్ట్రేషన్ యాక్టు ప్రకారం ఇప్పుడున్న ఇండ్లు, అపార్ట్మెంట్లు, ఖాళీ స్థలాలను నిషేధిత జాబితాలో ఉన్నట్లు కలెక్టర్‌కు వెల్లడించారు. అమీర్‌పేట, షేక్ పేట, ఖైరతాబాద్ మండలాల్లోని పలు రెవెన్యూ గ్రామాల్లో సగానికి పైగా నిర్మాణాలు 22ఏలోకి చేర్చేశారు. ఫతేనగర్, బేగంపేట, ఓల్డ్‌బోయిన్‌పల్లి, ఫిరోజ్‌గూడ, హస్మత్‌పేట, జింకలవాడ రెవెన్యూ గ్రామాల్లోని సగానికి పైగా ప్రాంతాలను నిషేధిత జాబితాలోకి చేర్చారు. బాధితులు తహసీల్దార్లను సంప్రదిస్తే.. కలెక్టర్‌ను కలవాలని సూచిస్తున్నట్లు వాపోతున్నారు. కలెక్టర్ మాత్రం తనను అడగవద్దని స్పష్టం చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.
ఇప్పటికిప్పుడు నిషేధిత భూములు ఎలా అయ్యాయి?
ఏండ్ల తరబడిగా కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులతో అన్ని అనుమతులు తీసుకుని ఇండ్లు కట్టుకున్నాం. బ్యాంకు లోన్లు తీసుకుని, ఈఏంఐలు కడుతూ జీవిస్తున్నాం. జన ప్రియ, వాసవి కల్పతరు, బ్రిగేడ్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని అపార్ట్మెంట్ భవనాలు ప్రభుత్వ అనుమతులతో పట్టా భూముల్లోనే 15 ఏండ్లకిందటే నిర్మించారు. ఈ ప్రాంతంలో మొత్తం 4500 ఫ్లాట్ల వాసులు నివసిస్తున్నారు. దశాబ్దాల కిందటి నుంచి ఉన్న పట్టా భూములను ఇప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఎలా జమ కడతారు? జీహెచ్ఎంసీ, రెవెన్యూ, హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చేటప్పుడు ఈ భూములు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఉన్నాయని తెలియదా? అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పటికిప్పుడు ఎలా పుట్టుకొచ్చాయి.
ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో భూములు, ఇండ్లు కొనాలన్నా భయాందోళనలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు, కొనుగోళ్లు జరగక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కలెక్టర్ స్పందించి నిజమైన ప్రజల భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలి.
-హనుమంతు నాయుడు, అశోక్ మార్గ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు
గుట్టు చప్పుడు కాకుండా 22 ఏ లో చేరుస్తారా?
కల్యాణ్‌నగర్ వెంచర్-3లోని భూములను 2004లోనే అప్పటి ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసింది. ఆ ప్రాంతంలో నిర్మాణాలకు జీహెచ్ఎంసీ సహా అన్ని అనుమతులు లభిస్తున్నాయి. మూడు నెలల కిందటి దాకా కూడా అక్కడ భవన నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం ఇప్పుడు ఆ భూములను ప్రొబేటెడ్ జాబితాలో చేర్చిన సంగతి చాలామందికి తెలియదు. ఎవరైనా అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో అప్పుడు తెలుస్తున్నది. ఒకవేళ ఆ భూములు ప్రభుత్వ భూములే అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా 22ఏలో చేర్చాల్సిన అత్యవసర పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రజలకు ముందుగా సమాచారం ఇవ్వాలి కదా? రెవెన్యూ అధికారులు అభ్యంతరాలు స్వీకరించి అలా చేయాల్సింది. ఇదంతా చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
-సత్యనారాయణ, కాలనీస్ ఫెడరేషన్ చైర్మన్