న్యూఢిల్లీ : పాఠశాలల్లో పారిశుధ్య సేవలు అందుబాటులో లేని పిల్లల్లో ప్రపంచంలో ఐదో వంతు భారత్లోనే ఉన్నారు. ఈ విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఇండియా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ -యునిసెఫ్ జాయింట్ మానిటరింగ్ ప్రోగ్రామ్ (జేఎమ్పీ) నివేదిక వెల్లడించింది. ‘ప్రోగ్రెస్ ఆన్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అండ్ హైజిన్ ఇన్ స్కూల్స్ 2015-2025’ పేరుతో విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. పాఠశాలల్లో ఎలాంటి పారిశుధ్యం లేని పిల్లల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 24.4 కోట్లు ఉంటే.. ఇందులో 5 కోట్ల మంది పిల్లలు భారత్లోనే ఉన్నారు.
జేఎంపీ ప్రధానంగా స్కూళ్లలోని పారిశుధ్యం, తాగునీరు, విద్యకు సంబంధించిన గణాంకాలను నమోదు చేస్తున్నది. ఈ నివేదిక ప్రకారం.. మనదేశంలోని పాఠశాలల్లో సుమారు 2.2 కోట్ల మంది పిల్లలకు ఎలాంటి శానిటేషన్ సేవలు అందట్లేదు. 2025 వరకు 1.2 కోట్ల మంది పిల్లలకు ఇండియాలో సరైన తాగునీటి వసతి లేదు. ఇది ప్రపంచంలోని ప్రతి 20 మందిలో ఒకరికి సమానం.