హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అయినట్టు రాష్ట్ర శాసనసభ సచివాలయం సోమవారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఈ స్థానం ఖాళీ అయినట్టు అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి వెల్లడించారు. నాగేందర్ అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచే అమల్లోకి వస్తుందని
గెజిట్‌లో స్పష్టంచేశారు. ఆ తేదీ నుంచే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు.
దానం నాగేందర్‌పై వేటును ఖరారు చేస్తూ గెజిట్ విడుదల కావడంతో ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఖాళీ అయిన స్థానాన్ని ఆరు నెలల వ్యవధిలో భర్తీ చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పలు రాష్ర్టాల ఎన్నికలతోపాటే ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో గెలిచి, మంత్రి పదవి పొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ చేరి 2018, 2023 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అయితే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే దానం.. 2023 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోపే కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.
ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన దానం అనర్హత వేటు తప్పించుకునేందుకు మొన్నటిదాకా చేయ ని ప్రయత్నమంటూ లేదు. చివరకు హైకోర్టు వేటు వేయడం, సుప్రీంలోనూ నిరాశే ఎదురుకావడంతో మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. 2009 కంటే ముందు దేశంలోనే అతి పెద్ద విస్తీర్ణమున్న అసెంబ్లీ స్థానంగా నిలిచిన చారిత్రక ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒకప్పుడు ఏడున్నర లక్షల ఓటర్లుండేవారు. తాజాగా ‘సర్’ తర్వాత కేవలం 1.70 లక్షలకు పరిమితం కావడం గమనార్హం. అనేక ప్రత్యేకతలు, సంచలనాలకు కేంద్రమైన ఖైరతాబాద్ నియోజకవర్గం ఇప్పుడు ‘సర్’ ప్రక్రియ తర్వాత రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నియోజకవర్గంగా రికార్డు నమోదు చేయనున్నది.