హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక, సామాజిక నిర్మాణంలో కీలకమైన చేనేతరంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. చేనేత రంగాన్ని, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలను రక్షించేందుకు ఇతర వృత్తి, కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమాలకు సిద్ధం కా వాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.
కోటా రాజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన నేతన్న భరోసా, త్రిఫ్ట్ పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని విమర్శించారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు టీ వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ త్రిఫ్ట్ పథకంలో పెండింగ్లో ఉన్న 16 నెలల బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేత భరోసా పెండింగ్ నిధులను విడుదల చేయడంతో పాటు చేనేత బీమా ప్రీమియం చెల్లించాలని అన్నారు. చనిపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్స్ త్వరగా ఇవ్వాలని కోరారు.