హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంలో కోల్డ్‌వార్ ముదిరిందా? ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం పతాక స్థాయికి చేరిందా? రేవంత్‌రెడ్డికి మంత్రులు సహాయ నిరాకరణ చేస్తున్నారా? తమ శాఖల్లో అధికారిక కార్యక్రమాలను పూర్తిగా ముఖ్యమంత్రికే వదిలేశారా? సీఎం నిర్వహించే శాఖాపరమైన సమీక్షలకు కీలక మంత్రులు, సీనియర్లు వరుసగా గైర్హాజరు అవుతుండటానికి కారణం అదేనా? ఇటీవల వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ‘అవును’ అనే అంటున్నాయి.
సొంత శాఖల అధికారిక కార్యక్రమాలకు సైతం ఆయా మంత్రులు ముఖం చాటేయడం యాదృచ్ఛికం కాదని, అది నాయకత్వంపై సాగుతున్న సహాయ నిరాకరణేనని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సీఎం వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న మంత్రులు బహిరంగంగా ఏమీ మాట్లాడకపోయినా.. పాలనాపరంగా ఆయనకు పూర్తిగా సహకారాన్ని నిలిపివేయడం ద్వారా తమ అసహనాన్ని తెలియజేస్తున్నారని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర పర్యాటకరంగ అభివృద్ధి, కొత్త పాలసీలపై జూలై 6న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అయితే ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. పైగా సచివాలయంలో సీఎం సమీక్ష కొనసాగుతున్న సమయంలోనే, తన సొంత నియోజకవర్గమైన కొల్లాపూర్‌లోని ఒక స్విమ్మింగ్‌ఫూల్‌లో హుషారుగా ఈత కొడుతూ గడిపారు.
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, వార్తా చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సీఎంవో ఒంటెద్దు పోకడలతో విసిగిపోయి, జూపల్లి కావాలనే ముఖం చాటేశారని, అందుకే సహాయ నిరాకరణను ప్రదర్శించారని అప్పట్లో సచివాలయ వర్గాల్లో ప్రచారం జరిగింది. సమీక్ష ముగిసిన తర్వాత సీఎం ఏమేం నిర్ణయాలు తీసుకున్నారో మంత్రి ఆరా తీశారని, ‘కనీసం ఆయన తీసుకున్న నిర్ణయాలైనా అమల్లోకి తెస్తే బాగుండు’ అని వ్యాఖ్యానించారని చెప్పుకున్నారు. ఆ సమావేశం ‘వితౌట్ టూరిజం మినిస్టర్..’ అంటూ పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురించే స్థాయికి వెళ్లింది.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖన భవన నిర్మాణం, వసతుల కల్పనతోపాటు రాష్ట్రంలోని పలు ప్రధాన బోధనాసుపత్రుల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 21న సచివాలయంలో ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇంతటి కీలక సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాకపోవడం చర్చనీయాంశం అయ్యింది. సమీక్ష ముగిసిన తర్వాత ప్రభుత్వం, సీఎంవో విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటనలో సంబంధిత శాఖ మంత్రి పేరును ప్రస్తావించకపోవడం కూడా తీవ్ర వివాదానికి దారితీసింది.
దామోదర ఉద్దేశపూర్వకంగానే డుమ్మా కొట్టారని, ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రి తనను సంప్రదించకుండా తరుచూ తన శాఖపై సమీక్షలు నిర్వహిస్తున్నారని దామోదర ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారని సచివాలయ వర్గాలు తెలిపాయి. దీనికితోడు తన శాఖపై షాడో సీఎంవో పెత్తనాన్ని సహించలేక బహిరంగంగానే విమర్శలు చేశారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే తన అసహనాన్ని, అసంతృప్తిని తెలియజెప్పేందుకే తాజా సమీక్షకు డుమ్మా కొట్టారని ఆయన వర్గీయులు చెప్తున్నారు.
ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ సీమ్) సహా కీలక ప్రాజెక్టులపై జూన్ 24న సచివాలయంలో రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కొన్ని కీలక ఆదేశాలు జారీచేశారు. అయితే, కేవలం రెండు రోజుల వ్యవధిలోనే, అంటే జూన్ 26న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదే ఆర్డీఎస్ ప్రాజెక్టుపై నేరుగా అధికారులను పిలిపించుకుని సమాంతర సమీక్ష నిర్వహించారు.
ఇది పాలనా వర్గాలను విస్మయానికి గురిచేసింది. మంత్రి ఉత్తమ్ తీసుకున్న నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోకుండా సీఎం సమాంతర సమీక్ష జరపడం ఆధిపత్య పోరును బహిర్గతం చేసిందని ప్రచారం జరిగింది. ఆ సమీక్షకు మంత్రి ఉత్తమ్ గైర్హాజరు కావడం ద్వారా సీఎంవో అనవసర జోక్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారని, సహాయ నిరాకరణ చేశారని చెప్పుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు శాఖల్లోనూ ఇదే తరహా అంతర్గత సమీక్షలు నిర్వహించారనే ప్రచారం జరుగుతున్నది.
ఇటీవల కొండా సురేఖను బర్తరఫ్ చేయ డం ద్వారా మంత్రులందరినీ పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకోవాలని, ఎవరూ ఎదు రు తిరగకుండా హెచ్చరిక పంపాలని ముఖ్యమంత్రి భావించినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆ ఎత్తుగడ పూర్తిగా బెడిసికొట్టిందని విశ్లేషకులు చెప్తున్నారు. సురేఖపై వేటు తర్వాత మంత్రులం తా దారికొచ్చినట్టు బయటికి కనిపించినా, లోపల అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉన్నదని గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఎదురుదాడి చేస్తే పదవులు పోతాయన్న ఉద్దేశంతో మంత్రులు బహిరంగ విమర్శలకు దిగడం లేదని అంటున్నా రు. పాలనలో సీఎంకు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే సరైన మార్గమని వా రు నిర్ణయించినట్టు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
సీఎంవో యంత్రాంగం, అనధికార సలహాదారుల గుత్తాధిపత్యమే ఈ సహాయ నిరాకరణ వెనుక అసలు కేంద్రబిందువు అని పేర్కొన్నారు. తమను డమ్మీలు గా మారుస్తూ సచివాలయంలో షాడో సీఎంవో పెత్తనం సాగిస్తుండటంతో మంత్రు లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ‘మా శాఖల్లో మా మాటే చెల్లుబాటు కానప్పుడు, మేము సమీక్షలకు హాజరై ప్రయోజనం ఏమిటి?’ అనే ఆక్రోశంతోనే మంత్రులు వరుసగా సీఎం భేటీలను బహిషరిస్తూ, సహాయ నిరాకరణకు దిగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.