హైదరాబాద్/చిక్కడపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పామాయిల్ రైతుల ఆస్తిని కాంగ్రెస్ ప్రభు త్వం అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ దందాల కు తాకట్టు పెడుతున్నదని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం విమర్శించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆధ్వర్యం లో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఆయిల్‌ఫెడ్ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఆయిల్‌ఫెడ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి పుల్లయ్య, ముషీరాబాద్ నియోజకవర్గ నాయకుడు జయసింహ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ తదితరులతో కూడిన ఈ బృందం పామాయిల్ రైతులతో కలిసి సోమవారం ఆర్టీసీక్రాస్ రోడ్ సమీపంలోని ఆజామాబాద్ ఆయిల్‌ఫెడ్ భూములను, పామాయిల్ స్టాక్ పాయింట్‌ను పరిశీలించింది.
అనంతరం ఎమ్మెల్సీ శ్రవణ్ మాట్లాడుతూ.. 2002లో చంద్రబాబు సర్కార్ జీవో 366 ద్వారా ఆయిల్‌ఫెడ్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నించిందని, 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వం జీవో 366ను ఎందుకు రద్దు చేయకూడదో తెలుపాలంటూ నోటీసులు జారీచేసి, ఆ భూములను కాపాడిందని తెలిపారు. నాడు చంద్రబాబు ప్రారంభించిన కుట్రను ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిచేస్తున్నారని, అందులో భాగంగా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను, కేసీఆర్ ప్రభుత్వ నోటీసులను తుంగలో తొకి ఈ ఏడాది మే 22న జీవో 85ను తెచ్చారని ధ్వజమెత్తారు.
మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న సుమారు 17,000 గజాల భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తున్నారని చెప్పా రు. గజం రూ.2-3 లక్షల చొప్పున విలువ చేసే ఈ భూమి పకనే ‘సత్వ’ సంస్థ 14 ఎకరాల్లో రియల్ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని, అక్కడే ఏబీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సం స్థ 50 అంతస్తులతో నిర్మించిన మూడు టవర్లలో సుమారు 1,500 ఫ్లాట్లను చదరపు అడుగు రూ.10 వేల చొప్పున విక్రయిస్తున్నదని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు ఇటీవల ఈ ప్రాంతానికి వచ్చి, రూ.వేల కోట్ల రియల్ ఎస్టేట్ అవకాశాలపై రెకీ నిర్వహించినట్టు ప్రచారం జరుగుతున్నదని శ్రవణ్ పేర్కొంటూ.. ఇందులో నిజమెంతో సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి నైతిక విలువలేమైనా ఉంటే ఆయిల్‌ఫెడ్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే జీవో 85తోపాటు దానికి పునాదైన జీవో 366ను వెంటనే రద్దు చేయాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.