తెలంగాణకు 26 లోక్‌సభ సీట్లు!
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్ని స్థానాలు పెరగనున్నాయో చూపించే పటాన్ని కేంద్రం శనివారం విడుదల చేసింది. పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ పటాన్ని పంచుకున్నారు.
- పునర్విభజన తర్వాత రాష్ర్టాలకు పెరిగే లోక్‌సభ స్థానాల పటాన్ని విడుదల చేసిన కేంద్రం
- రాష్ర్టాల్లో ప్రస్తుత, పెరగనున్న సీట్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్ని స్థానాలు పెరగనున్నాయో చూపించే పటాన్ని కేంద్రం శనివారం విడుదల చేసింది. పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ పటాన్ని పంచుకున్నారు. దీని ప్రకారం తెలంగాణకు 26, ఆంధ్రప్రదేశ్‌కు 38 లోక్‌సభ సీట్లు పెరగనున్నాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పటం వెలువడింది. లోక్‌సభను సోమవారం, రాజ్యసభను బుధవారం సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలని బిల్లులు ప్రతిపాదిస్తున్నాయి.
రాష్ర్టాలన్నింటికీ ఒకే విధంగా స్థానాలు పెరుగుతాయని, 2051 వరకు అవి కొనసాగుతాయని పేర్కొన్నాయి. రాజ్యాంగం (132వ సవరణ) బిల్లు, పునర్విభజన (రెండో) బిల్లు అనే రెండు కొత్త బిల్లులను నాలుగు రోజుల ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు డిసెంబర్ 3న ముగియనున్నాయి. పునర్విభజన తర్వాత లోక్‌సభ సభ్యుల సంఖ్య ప్రస్తుత 543 నుంచి 816కు పెరుగుతుందని బిల్లులు సూచిస్తున్నాయి. కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదించిన కొన్ని గంటలకే బిల్లుల ప్రతులను హిందుస్తాన్ టైమ్స్ పరిశీలించింది. ప్రస్తుతం బేసి సంఖ్యలో లోక్‌సభ స్థానాలు ఉన్న పంజాబ్, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ర్టాల్లో అదనంగా వచ్చే అర సీట్లను ఎలా పూర్తి సంఖ్యకు మార్చుతారనే విషయం బిల్లుల్లో లేదు.
తమిళనాడుకు 58.5 స్థానాలను 59కి, ఆంధ్రప్రదేశ్‌కు 37.5ను 38కి, పంజాబ్‌కు 19.5 సీట్లను 20కి, తెలంగాణకు 25.5ను 26కి పూర్తి చేసినట్టు పటంలో కనిపిస్తున్నది. బేసి సంఖ్యలో స్థానాలున్న రాష్ర్టాల్లో ఈ పూర్తి సంఖ్యల లెక్క కారణంగా పెంపు దాదాపు ఒకే స్థాయిలో ఉండనుంది. ప్రస్తుతం ఒక్క లోక్‌సభ స్థానం ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ సంఖ్య రెండుకు పెరిగితే అది 100 శాతం పెంపు అవుతుంది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి 50 శాతం పెంపు ఉంటుందని బిల్లు చెబుతున్నది. ఈ లెక్కన కొత్త లోక్‌సభలో 816 మంది సభ్యులు ఉంటారు. ప్రభుత్వం కూడా ఇదే సంఖ్యను పేర్కొన్నది. పునర్విభజన బిల్లుల భవితవ్యంపై ఇంకా నిర్ణయం రావాల్సి ఉన్నది. ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక సమావేశాల్లో వాటిని పార్లమెంట్లో ప్రవేశపెడతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

