ఒక యోధుని వ్యూహాల విజయమిది
తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ దీక్ష కీలక మలుపు తిప్పింది. తెలంగాణ చరిత్రలో దీక్షాదివస్‌గా నిలిచిపోయింది. కేసీఆర్ నిరాహార దీక్ష, కేంద్రం దిగివచ్చి 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఆ తర్వాత సీమాంధ్ర పెట్టుబడిదారుల ఒత్తిళ్లకు తలొగ్గి 23న ప్రకటనను వెనక్కు తీసుకున్నది. కానీ కేంద్రం మెడలు వంచడానికి, స్వరాష్ట్రం సాధించడానికి, ప్రగతి బాటలో పయనింపజేయడానికి యోధుడు కేసీఆర్ వ్యూహాలదే విజయం.
సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, వంటావార్పు వంటి కార్యక్రమాలు తెలంగాణ సమాజాన్ని ఏకం చేశాయి. స్వరాష్ట్ర సాధన పోరాటంలో వందల మంది యువత, విద్యార్థులు, తెలంగాణ వాదులు ఆత్మార్పణ చేసుకొన్నారు. వారి త్యాగాలు తెలంగాణ సమాజాన్ని కదిలించాయి. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. అణచివేత, కేసులు, అరెస్టులు, లాఠీఛార్జీలు, భాష్పవాయు గోళా లు తెలంగాణ ఆకాంక్షను దూరం చేయలేకపోయాయి.
తెలంగాణ సకల జనుల పోరాటాలకు తలొగ్గిన కేంద్రం 2014 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. 2014 జూన్ 2న భారతదేశపు 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ సారథి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
14 ఏండ్ల సుధీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తొలినాళ్లలో సవాళ్లు ఉన్నాయి. ‘విడిపోతే గోస పడతారు, మీకు పాలన రాదు, ఇక మీవి చీకటి బతుకులే’ అంటూ సమైక్య పాలకులు చేసిన హేళనలు ఉన్నాయి. అయితే తెలంగాణ వస్తే ఏమొస్తుంది ? ఏం చేయాలి ? అని ఉద్యమ ప్రస్థానంలోనే కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టారు. కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే కరెంట్ కొరత సమస్యను పరిష్కరించారు. మొదట గృహావసరాలకు, ఆ తర్వాత పరిశ్రమలకు 24 గంటల విద్యుత్తు సరఫరా అందించారు. రెండేండ్లలోనే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించారు.
కొత్తగా గోదావరిపై కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అనేక కేసులు, సవాళ్లు అధిగమించి 90 శాతం పనులు పూర్తి చేశారు. మిషన్ కాకతీయ ద్వారా 40 వేల పైచిలుకు చెరువులు, కుంటలు పునరుద్ధరించారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ సాగునీరు అందించారు.
రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, వందశాతం పంటల కొనుగోళ్లకు శ్రీకారం చుట్టి దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే రాష్ర్టాల్లో తెలంగాణను ముందు వరుసలో నిలిపారు. కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్ల పెంపు, దళితబంధు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. రైతుబంధు స్ఫూర్తితోనే కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనను తెచ్చింది.
మిషన్ భగీరథ ఆదర్శంగా జల్ జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తున్నది. రైతుబంధు, రైతుబీమా పథకాలు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి. సాధించిన స్వరాష్ర్టాన్ని కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనతో దేశానికి ఆదర్శంగా నిలబెట్టారు. ఆరు దశాబ్దాల ఆకలి కేకలు, అణచివేతలకు ఎదురునిలిచిన ఒక ఒంటరి గళం కేసీఆర్. ‘తెలంగాణ’ అనే పదమే నిషిద్ధమైన చోట, ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసిన పట్టుదల కేసీఆర్.
చరిత్ర పుటల్లో చెరగని సంతకం, తరతరాలకు స్ఫూర్తినిచ్చే పోరు కెరటం కేసీఆర్. కన్నీళ్లు, రక్త తర్పణాలతో సాధించుకున్న స్వరాష్ర్టానికి ఎప్పుడు అన్యాయం జరిగినా ప్రశ్నించే ప్రతి వ్యక్తి వెనుకా, నిలదీసే ప్రతి గొంతు వెనుకా కేసీఆర్ ఉంటారు. ‘దీక్షా దివస్’ సందర్భంగా ప్రజలందరికీ ఉద్యమాభివందనాలు. యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణలో మళ్లీ అభివృద్ధి జెండా ఎగరేద్దాం. జై తెలంగాణ.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ)
శేరి సుభాష్‌రెడ్డి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

