కరీంనగర్ విద్యానగర్, మార్చి 13 : ఆ ఐదుగురు జల్సాలకు అలవాటు పడ్డారు. గతంలో అద్దెకు తీసుకున్న కారు డ్యామేజీ కావడంతో యజమానికి రూ.40వేలు చెల్లించేందుకు దొంగతనం చేయాలని ప్లాన్ వేశారు. ఓ ఆర్ఎంపీని టార్గెట్ చేసి, మెడలోని చైన్‌ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత పోలీసులు తనిఖీ చేస్తుండగా, గురువారం అడ్డంగా దొరికిపోయారు. ఆ మేరకు శుక్రవారం అరెస్ట్ చూపారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం శుక్రవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన పెనుగొండ అబినైజర్, పంబాల నాగరాజు, పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తికి చెందిన గుజ్జేటి మధుసూధన్, నుస్తులాపూర్‌కు చెందిన మాచర్ల రాంచరణ్గౌడ్తో పాటు మరో మైనర్ జల్సాలకు అలవాటు పడ్డారు.
వీరంతా కలిసి గతంలో కరీంనగర్‌లోని భగత్‌నగర్‌కు చెందిన ఒక కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసమని అద్దెకు తీసుకున్నారు. కారులో తిరుగుతున్న క్రమంలో డ్యామేజీ అయింది. దాంతో ఆ యజమాని కారు రిపేరు కోసం 40వేలు చెల్లించాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఆ ఐదుగురు కారు రిపేర్ డబ్బుల కోసం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతిరోజూ ఒంటరిగా మోటర్ సైకిల్‌పై గ్రామాల్లో తిరుగుతూ ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేసే గుండ్లపల్లి ఎక్స్‌రోడ్‌కు చెందిన తుమ్మనవేని కొమురయ్యను టార్గెట్ చేశారు. అతనిపై దాడి చేసి మెడలో ఉనన చైన్ స్నాచింగ్ చేయాలని పథకం వేసుకున్నారు. ఆ మేరకు ఈ నెల 11న ఉదయం కరీంనగర్‌లోని భగత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఒక రోజు కోసం కారును 1200కు సెల్ఫ్ డ్రైవింగ్ పేరిట అద్దెకు తీసుకున్నారు. అదే రోజు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో నేదునూరు నుంచి మోటర్ సైకిల్‌పై వస్తున్న కొమురయ్యను గమనించిన మైనర్ తన సహచరులకు సమాచారం ఇచ్చాడు.
మిగతా నలుగురు గుండ్లపల్లి నుంచి అద్దె కారులో బయలుదేరి నేదునూరు శివారులోని మామిడితోట సమీపంలో కొమురయ్యను అడ్డుకున్నారు. గుర్తు పట్టకుండా అతని కండ్లలో కారం చల్లి, మెడలో ఉన్న తులం బంగారం గొలుసుతోపాటు రూ.వెయ్యి నగదును దోచుకొని పారిపోయారు. ఈ సంఘటనను రూరల్ ఎసీపీ విజయ్‌కుమార్, తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, సిబ్బంది సీరియస్‌గా తీసుకొని, కేసును లోతుగా విచారణ జరిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఇందిరానగర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మన్నెంపల్లి నుంచి వస్తున్న కారును గుర్తించారు. తనిఖీలో ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేదునూర్ శివారులో దోపిడీ చేసింది తామేనని ఒప్పుకున్నారు. ఈ నిందితులు కోహెడ మండలంలో చేసిన ఓ కరెంటు మోటర్ దొంగతనం కూడా చేసినట్లు అంగీకరించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసును చాకచక్యంగా చేధించిన రూరల్ ఎసీపీ విజయ్‌కుమార్, సీఐ సదన్‌కుమార్, ఎల్ఎండీ, చిగురుమామిడి ఎస్ఐలతో పాటు ఆకాశ్, అనిల్ కుమార్, రాఘవను సీపీ అభినందించారు.