Flight Mode | ప్రస్తుత స్మార్ట్ యుగంలో మొబైల్ ఫోన్ నిత్యావసరవస్తువుగా మారిపోయింది. అందరికీ ఆత్మీయనేస్తంగా చేరువైంది. ఫోన్లో చార్జింగ్, నెట్వర్క్ ఉంటే చాలు ఎక్కడైనా కావాల్సిన సమాచారం అందిస్తుంది. అయితే.. విమాన ప్రయాణంలో మాత్రం మొబైల్ ఫోన్ వాడకం నిషేధం. ఫోన్ వాడినా దాంట్లో నెట్వర్క్ మాత్రం కచ్చితంగా ఆపేయాల్సిందే. ఇందుకోసం ఏకంగా ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంతకీ ఫ్లైట్‌లో ఫోన్ ఎందుకు వాడకూడదో తెలుసా?
మనం విమానం ఎక్కగానే ఫోన్లో నెట్వర్క్ ఆపకపోతే అది విమానం నావిగేషన్ సిస్టమ్‌తో జోక్యం చేసుకోవచ్చు. దీని కారణంగా విమానం ఎగరడంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. ప్రమాదాలకు దారితీయవచ్చు. మొబైల్ ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్ విమానం కమ్యూనికేషన్ వ్యవస్థను గందరగోళానికి గురిచేస్తుంది. దీని కారణంగా పైలట్‌తో కమ్యూనికేట్ చేయడంలో సమస్య ఉత్పన్నం కావొచ్చు. అలాగే కమ్యూనికేషన్ నియంత్రణలోనూ వైఫల్యాలు ఏర్పడుతాయి. దీనివల్ల విమానం రేడియో స్టేషన్‌తో సంబంధాన్ని కోల్పోవచ్చు కూడా! ఫలితంగా భారీ ప్రమాదాలు జరగొచ్చు. అందుకే, విమానంలో మొబైల్స్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచడం తప్పనిసరి!