మారేడ్‌పల్లి, మే 10: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై ఎగిరేది బీఆర్ఎస్ జెండాయేనని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మోండా డివిజన్లోని పాట్ మార్కెట్ లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు మంగళ హారతులు, పూల మాలలతో ఘన స్వాగతం పలికారు. ‘నిత్యం మా వెంటే ఉండే పద్మారావు గౌడ్ కే ఓటు వేస్తాం’ అని ప్రజలు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా..కారు గుర్తుకు ఓటు వేసి పద్మారావుగౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు చేసిందీమే లేదని, మళ్లీ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రూప, డివిజన్ అధ్యక్షుడు హరికృష్ణ, నాయకులు నాగులు, రాములు, జయరాజ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మోండా డివిజన్లోని పాట్ మార్కెట్ జ్యూవెల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఘనంగా సన్మానించి మద్దతు తెలిపారు. పద్మారావు గౌడ్ గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.