హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అంటే రాష్ట్రంలోని యువ క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ప్రాంగణం. కానీ వారి ఆశలను సమాధి చేస్తూ.. అంతా కూడబలుక్కొని 22 ఏండ్ల కిందటి ఫైల్‌కు రెక్కలు తొడిగి, పిల్లల భవిష్యత్తు కోసం దాచిన డబ్బు రూ.69 కోట్లను 6 డీడీలుగా తీసి విశాఖ ఇండస్ట్రీస్‌కు కుప్పగా ముట్టజెప్పిన మాట వాస్తవం.
ఇంకా సంపూర్ణమైన చట్టబద్ధత లేని హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే హెచ్‌సీఏకు, కెనరా బ్యాంకుకు మధ్య వేగవంతమైన ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచిన మాట నిజం. ఈ లూటీనే ‘నమస్తే తెలంగాణ’ పట్టుకున్నది. పక్కా ఆధారాలతో ఉత్తర తెలంగాణ మంత్రి నిర్వాకాన్ని, దాన్ని నిలువరించలేదని హెచ్‌సీఏ పాలకవర్గ అసమర్థతను ప్రజల ముందు పెట్టింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
రూ.69 కోట్లు అప్పనంగా విశాఖ ఇండస్ట్రీస్‌కు అప్పగించడాన్ని క్రికెట్ క్లబ్బులు గర్హించాయి. నిధులు వెంటనే వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. మంత్రి నిర్వాకాన్ని సొంత పార్టీ నాయకులే తప్పుబడుతున్నారు. యువ క్రీడాకారుల డబ్బులను దారి మళ్లించడం అన్యాయమని విమర్శిస్తున్నారు. దీంతో సదరు మంత్రి ఉలిక్కిపడ్డారు. మీడియా సమావేశం పెట్టించి, ఆకాశరామన్న లేఖలు రాయించి దబాయింపులకు దిగారు.
హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడు అమర్నాథ్ ఆగమేఘాల మీద మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన తప్పిదాన్ని గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపడుతారేమోనని, రూ.69 కోట్ల మీద కనీసం విచారణ జరిపి, నిధులు వెనక్కి తెప్పిస్తారేమోనని ‘నమస్తే తెలంగాణ’ ఆశించింది. తీరా చూస్తే పత్రిక మీద అడ్డగోలు విమర్శలు చేశారు.
మరోవైపు కథనాన్ని ఖండిస్తున్నామంటూ ఊరూ పేరు లేని ఆకాశ రామన్న కర పత్రాలేవో పంపించారు. అయితే అందులో ఎవరు ఖండిస్తున్నారో? ఎందుకు ఖండిస్తున్నారో? వివరాలు ఏమీ లేవు. అయినా బాధ్యత కలిగిన ప్రతికగా ‘నమస్తే తెలంగాణ’ వారి ఖండన పత్రాన్ని స్వీకరిస్తున్నది. ఆ ప్రకటనలోని డొల్లతనాన్ని కూడా ఎత్తి చూపుతున్నది. ఈ ఖండన పత్రం రాయించిన పెద్ద మనుషులే వీటికి సమాధానం చెప్పాలి.
హెచ్‌సీఏ వాదన: ‘విశాఖ’తో కుదిరిన ఒప్పందం నుంచి అర్షద్ అయూబ్ తప్పుకోవడంలోనే హెచ్‌సీఏ మీద భారీ ఆర్థిక భారం పడింది.
నమస్తే: 2011లో ఆర్షద్ అయూబ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెచ్‌సీఏ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ మరుసటి ఏడాది ముగ్గురు సభ్యులతో ఆర్బిట్రేషన్ వేశారు. 2012లో కన్సార్టియం వచ్చింది. ఈ కన్సార్టియం ఏర్పాటయ్యేనాటికి హెచ్‌సీఏ అధ్యక్షుడు ఎవరు? ఉత్తరాంధ్ర మంత్రి సోదరుడే కదా? 2012 నుంచి 2014 వరకు హెచ్‌సీఏను ఏలింది ఆయనే కదా? అప్పుడెందుకు ఈ విషయా న్ని పరిష్కరించుకోలేదు? ముగ్గురు సభ్యుల కన్సార్టియంలో విశాఖ ఇండస్ట్రీస్ మాజీ డైరెక్టర్‌కు భాగస్వామ్యం కల్పించింది ఎవరు? ఇది చట్టబద్ధమా?
హెచ్‌సీఏ: 15-03-2016న ముగ్గురు సభ్యులతో కూడిన ఆర్బిట్రల్ ట్రిబ్యునల్, ఒప్పంద రద్దు చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చింది. 18% వడ్డీతో రూ.25.92 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు బదులుగా, కోర్టు వెలుపల రూ.17.50 కోట్లకు పరిషరించుకోవడానికి విశాఖ అంగీకరించింది.
నమస్తే: మరి ఇద్దరి మధ్య కోర్టు బయట ఒప్పందం జరిగిన తర్వాత ఎందుకు అమలు కాలేదు? డబ్బులు ఇవ్వటానికి హెచ్‌సీఏ ముందుకు వచ్చినా, దాన్ని తీసుకోకుండా ఆపింది ఎవరు? రాజకీయం చేసింది ఎవరు? కనీసం సుప్రీంకోర్టు తీర్పు మీద మరో అప్పీల్‌కు వెళ్లకుండా ఆపింది ఎవరు? అవకాశం ఉండి కూడా మీరెందుకు కోర్టుకు వెళ్లకుండా డబ్బు చెల్లింపులు పెట్టుకున్నారు?
హెచ్‌సీఏ: 2004లో స్టేడియం నిర్మాణ సమయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. ఆ సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందుకు వచ్చి ఐడీబీఐ బ్యాంక్ నుంచి టర్మ్ లోన్ తీసుకొని ఆర్థిక సహాయం చేసింది. కాంట్రాక్టర్ పనులు ఆపకుండా ఉండేందుకు సహకరించింది.
నమస్తే: మీ సానుభూతితో కూడిన వివరణ ప్రకారం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011లో జరిగిన ఒప్పందం. ఈ లెక్కన ఒప్పదం, వివాదం రెండూ ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాలకు ఒక్క తెలంగాణ రాష్ట్ర హెచ్‌సీఏ మాత్రమే ఎందుకు డబ్బులు కట్టాలి? ఎలా కట్టింది?
హెచ్‌సీఏ: నేను చెక్కుల మీద సంతకం పెట్టలేదు. నేను రాకముందే నిధుల చెల్లింపుల ప్రాసెస్ మొదలైంది. (మీడియాతో హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడు అమర్నాథ్)
నమస్తే: చెక్కుల మీద సంతకం చేయని మాట నిజమే అనుకుందాం. మీరు (అమర్నాథ్) చార్జి తీసుకున్న తర్వాత అంటే ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి హెచ్‌సీఏకు, కెనరా బ్యాంకుకు మధ్య వరుస ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి కదా? ‘నేను కొత్తగా వచ్చాను, ఈ చెల్లింపుల మీద సమీక్ష జరుపవలసిన అవసరం ఉన్నది. అప్పటివరకు కొంత సమయం కావాలి’ అని మీరు ఒక్క ఉత్తరంలోనైనా బ్యాంకును కోరారా? కనీసం తాను తీసుకున్న పదవికే ఇంకా పూర్తి స్థాయి చట్టబద్దత రాలేదు. వచ్చీ రావడంతోనే రూ.69 కోట్ల చెల్లింపుల మీద ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకోగలను? అని బ్యాంకుకు గానీ, విశాఖ ఇండస్ట్రీస్ యాజమాన్యానికి గానీ చెప్పారా? (చార్జ్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగలేదని మీరు బుకాయిస్తే ‘నమస్తే తెలంగాణ’ మరో ఎడిషన్‌లో వాటిని కూడా ప్రచురించడానికి సిద్ధమే).
ప్రజలు ఒక విశ్వాసంతో ఇచ్చిన అధికారాన్ని ప్రజా ఖజానాల లూటీ కోసం ప్రయోగిస్తుంటే, కండ్లు మూసుకోవడానికి నమస్తే తెలంగాణ పత్రిక ప్రభుత్వానికి అమ్ముడుపోయేది కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలో పుట్టి తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న నికార్సైన పత్రిక. రాష్ట్ర ప్రగతిని ఈనగాచి నకలపాలు చేస్తుంటే ఏం చేయకుండా, ఏ కథనాలూ రాయకుండా ఎలా ఉండగలం? ఇప్పటికైనా లూటీపై ఝూటా మాటలు కట్టిపెట్టి, నిధుల తరలింపు వ్యవహారంలో తప్పు ఒప్పుకుంటే మంచిది.
హెచ్‌సీఏ: హెచ్సీఎ మాజీ అధ్యక్షుడి తొలగింపును, విశాఖతో అనుసంధానిస్తూ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఆర్బిట్రేషన్ ప్రక్రియకు సంబంధం లేనివి.హెచ్‌సీఏలో నిధుల లూటీ అనే శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక తప్పుదారి పట్టించే కథనాన్ని ప్రచురించింది.
నమస్తే: హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడి తొలగింపుతో ఆర్బిట్రేషన్‌కు సంబంధం ఉన్నదని రెండు వరుస కథనాల్లో ‘నమస్తే తెలంగాణ’ ఎక్కడైనా చెప్పిందా? మాజీ అధ్యక్షుడి తొలగింపును విశాఖతో అనుసంధానిస్తూ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అని ఏ కారణాలతో మీరు ఖండిస్తున్నారు? మీరేమైనా విచారణ గానీ, పరిశోధన గానీ చేశారా? కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్యవర్గ సమావేశం పెట్టారా? పాత అధ్యక్షుడికి, విశాఖ ఇండస్ట్రీకి మధ్య ఉన్న సంబంధాలు లేదా విరుద్ద అభిప్రాయాల మీద సమావేశం ఏమైనా రివ్యూ చేసిందా? ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ ఇండస్ట్రీస్ మీకు (హెచ్‌సీఏకు) వైరి వర్గం. ఆ కంపెనీ తరఫున మీరెలా వకాల్తా పుచ్చుకుంటారు?