రేవా: ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను వ్యతిరేకించిన వారిని ఉద్దేశించి రేవా నియోజకవర్గ బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవా నుంచి భోపాల్, కోల్‌కతాకు కొత్త విమాన సర్వీసుల ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ…‘స్వచ్ఛమైన పెట్రోల్ మీ అయ్య
(నాన్న) ఇంటి నుంచి వస్తుందా’ అని ప్రశ్నించారు. ఇండియా 20 శాతం చమురును దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నదని, 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదని తెలిపారు. ప్రస్తుతం హొర్ముజ్‌ను మూసేయడం వల్ల అదనంగా 18 వేల కిలోమీటర్లు ప్రయాణించి చమురును తెచ్చుకోవడం కష్టంగా మారిందన్నారు. ‘ప్రధాని 20 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం గురించి మాట్లాడితే కొందరు ధర్నా చేస్తారు. కేవలం స్వచ్ఛమైన పెట్రోల్‌నే వాడాలంటారు. పెట్రోల్ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా? దేశంలో స్వచ్ఛమైన పెట్రోలే లేనప్పుడు అది ఎక్కడ నుంచి వస్తుంది’ అని మిశ్రా ప్రశ్నించారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో భారత్‌లో వాహనాలు నడుస్తాయన్నారు.