Varun Tej | వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరుణ్ తేజ్‌కు ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయాన్ని అందించింది. విభిన్నమైన కథాంశం, హారర్ కామెడీ ఎలిమెంట్స్, వరుణ్ తేజ్ నటన, సత్య కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని ప్రేక్షకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
విడుదలైన కొద్దిరోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. అంతేకాకుండా సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను కూడా దాటేసిందని సమాచారం. దీంతో వరుణ్ తేజ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. చాలా కాలం తర్వాత వరుణ్ తేజ్‌కు మంచి విజయాన్ని అందించడంతో చిత్ర బృందం ఈ సక్సెస్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమైంది.‘కొరియన్ కనకరాజు’ మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఆగస్టు 11న హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ సక్సెస్ ఈవెంట్ జరగనుంది. వరుణ్ తేజ్‌కు చాలా కాలం తర్వాత మంచి విజయం దక్కడంతో ఈ వేడుకకు మెగా అభిమానులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. ‘కొరియన్ కనకరాజు’ విజయంపై చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారనే ఆసక్తి ఇప్పుడు మెగా అభిమానుల్లో నెలకొంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ఎదుర్కొన్న వరుస పరాజయాల తర్వాత ఈ విజయం రావడంతో.. పెదనాన్న చిరంజీవి తన అబ్బాయి విజయంపై ఎలాంటి కామెంట్స్ చేస్తారని ఆసక్తికరంగా మారింది. కాగా, సినిమా విడుదలకు ముందు నుంచే వరుణ్ తేజ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా, ఇప్పుడు బాక్సాఫీస్ విజయంతో ఆ ఉత్సాహం మరింత పెరిగింది. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ వేడుకలో మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సందడి కనిపించనుందో చూడాలి.