మెదక్, మార్చి 3(నమస్తే తెలంగాణ): వరద గాయాలు మెదక్ జిల్లాలో ఇంకా కండ్ల ముందు కనిపిస్తున్నాయి. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మెదక్ మున్సిపాలిటీ, మెదక్, హవేళీఘనపూర్ మండలాల్లో 44 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైన సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. రోడ్లు,కల్వర్టులు దెబ్బతిన్నాయి. చెరువులు, చెక్‌డ్యామ్‌లు తెగిపోయి తీవ్ర నష్టం జరిగింది. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు నేలకూలాయి. వరద ఉధృతికి లోతట్టు ప్రాంతా లు నీటిమునిగి జన జీవనం స్తంభించింది.
నాలుగైదు రోజుల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హవేళీఘనపూర్ మండలంలోని పలు తండాలకు వారం పాటు రాకపోకలు నిలిచిపోవడంతో పాటు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో రూ. 150 కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. దూప్‌సింగ్ తండాతో పాటు పలు గ్రామాల్లో వరద తీవ్రతకు రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు, కాలువలు దెబ్బతిన్నాయి. హవేళీఘణపూర్, మెదక్ మండలంలో తీవ్ర నష్టం జరగగా, ప్రభుత్వం రోడ్లు, విద్యుత్ పునరుద్ధ్దరణ పనులు, నీటిపారుదల శాఖకు చెందిన చెరువులు, చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ప్రకటించింది.
కానీ, ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. బీటీ రోడ్లు వరద ఉధృతికి దెబ్బతిని కంకర తేలి ప్రయాణానికి ఇబ్బందిగా మారాయి. వాగులపైన ఉన్న బ్రిడ్జిలు, కల్వర్టులు కూలిపోవడంతో ఇంజినీరింగ్ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. హవేళీఘణపూర్ మండలంలోని దూప్‌సింగ్ తండాకు వెళ్లే రోడ్డుపైన బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. వరద విపత్తు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టక పోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ముందుకు సాగని పనులు..
గతేడాది భారీ వర్షాలకు హవేళీఘపూర్ మండలంలో భారీ పంట నష్టం జరిగింది. కామారెడ్డి జిల్లాకు సరిహద్దులో ఉన్న దూప్‌సింగ్ తండాకు భారీ వరద రావడంతో తండా నీటి మునిగి వారం రోజుల పాటు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద ఉధృతి రోడ్డుపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా బ్రిడ్జి పనులు వేగంగా సాగడం లేదు. దీంతో రాకపోకలకు గిరిజనులు, ఇతర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో కంకర తేలి అవస్థలు తప్పడం లేదు. హవేళీఘనపూర్, బూరుగుపల్లి, మద్దికుంట, బోగుడుపల్లి, రాజ్పేటతో పాటు పలు గ్రామాల్లో వరద తీవ్రతకు భారీగా నష్టం జరిగింది. మెదక్ మండంలో మెదక్, ఔరంగాబాద్, బూరుగుపల్లి, చిట్కుల్, కూచారం, రాయన్‌పల్లి, వెంకటపూర్ గ్రామాల్లో రోడ్లు దెబ్బతినగా, మరమ్మతులకు నోచుకోవడంలేదు. కూలిపోయిన కల్వర్టు నిర్మాణం చేపట్టడం లేదు. చెరువులు, చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేయకపోవడంతో వర్షం నీరు నిల్వని ఉండని పరిస్థితి ఉంది. గండ్లు పడిన చెరువులకు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు.
రోడ్లపై కల్వర్టులకు, బ్రిడ్జిలకు తాత్కాలిక మరమ్మతులు చేసి సరిపెట్టారు. రూ.150 కోట్ల నష్టం అంచనాలు ప్రభుత్వానికి పంపినా నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పనులు చేపట్టలేక పోతున్నారు. పేదల ఇండ్లు కూలిపోయినా ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేయలేదు. సీఎం రేవంత్‌రెడ్డి మెదక్‌లో ఏరియల్ సర్వే నిర్వహించి, వరద నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. వరద నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వనికి నివేదిక ఇస్తే నిధులు విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. అధికారులు నివేదికలు పంపినా నిధులు విడుదల కాలేదు. దీంతో అధికారులు తాత్కాతిక మరమ్మతులు చేసి వదిలేశారు. మళ్లీ వర్ష్షాకాలంలో ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం పట్టించుకోవాలి
గతేడాది మా హవేళీఘనపూర్ మండలం భారీ వానలకు ఆగమైంది. చెరువులు, చెక్‌డ్యామ్‌లు, సాగునీటి కాల్వలకు బాగా నష్టం జరిగింది. నీటిపారుదల శాఖ అధికారులు తాత్కాలిక పనులు చేశారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకపోతే మళ్లీ ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం పట్టించుకోవాలి.
-సాప సాయిల్, గాజిరెడ్డిపల్లి, హవేళీ ఘణపూర్ (మెదక్ జిల్లా)
రోడ్లు, కల్వర్టులను బాగుచేయాలి
గతేడాది మెదక్‌లో భారీ వర్షాలకు బాగా నష్టం జరిగింది. అధికారులు తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకొన్నారు. దీంతో మళ్లీ వానకాలం వస్తే మాకు ఇబ్బందులు తప్పవు. మెదక్‌లో గింత వాన ఎప్పుడూ పడలేదు. ఉన్నతాధికారులు మరోసారి వరదతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి శాశ్వత పనులు చేసేందుకు నిధులు మంజూరు చేయాలి. మెదక్ పట్టణంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తగినన్ని నిధులు ఇవ్వాలి.
– వంజరి రాజు, మాజీ కౌన్సిలర్ మెదక్
రోడ్లకు మరమ్మతులు చేయాలి
భారీ వర్షాలకు కూలిపోయిన కల్వర్టులు, బ్రిడ్జిలు, రోడ్ల్లకు వెంటనే ప్రభుత్వం మరమ్మతులు చేయాలి. తాత్కాలిక మరమ్మతులు చేయడంతో వర్షాకాలంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రోడ్లపై గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వచ్చే వర్షాకాలం నాటికి పనులు చేయకపోతే మాకు ఇబ్బందులు తప్పవు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి నిధులు ఇచ్చి పనులు చేయించాలి.
– స్వామి నాయక్, మెదక్