హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : ‘నిజమైన స్టార్టప్‌లు ఎదగాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని ఎంతో కష్టపడి బీఆర్ఎస్ సర్కార్ టీ-హబ్‌కు రూపకల్పన చేసింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి కుటుంబ ప్రయోజనాల కోసం అనుముల హబ్స్ ఏర్పాటులో బిజీగా ఉన్నారు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నదమ్ముల భూ కుంభకోణాలపై స్పందించారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో వందలకోట్ల భూములు కొట్టేసే ఐడియా తెలంగాణ బిడ్డలకు చెప్పండి’ అంటూ చురకలంటించారు.
సర్కార్ భూములు పొందాలంటే అనుముల బ్రదర్స్ అయితే చాలని కేటీఆర్ విమర్శించారు. పెట్టుబడిలేని కంపెనీలు పెట్టి ఎంతటి విలువైన భూములనైనా దక్కించుకోవచ్చని దుయ్యబట్టారు. ‘రూ. లక్ష పెయిడ్ అప్ క్యాపిటల్‌తో, కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేకుండా టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ అనే డిఫెన్స్ కంపెనీ పెట్టి.. రాత్రికి రాత్రే దాదాపు రూ. 200 కోట్ల ఆస్తి/లాభం ఆర్జించిన అనుముల కొండల్‌రెడ్డిని ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీగా ప్రకటించండి. శ్రీధర్‌బాబు గారూ.. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఈ అద్భుతమైన బిజినెస్ మాడల్ ఏంటో నేర్పించండి. వందల కోట్ల ప్రభుత్వ భూమిని ఇంత చౌకగా కొట్టేయడం ఎలాగో శిక్షణ ఇవ్వండి’ అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టెస్సెరాక్ట్ కంపెనీ ఏర్పాటు చేయడం.. 200 కోట్ల భూములు కొట్టేయడం ముమ్మాటికీ ఫ్యామిలీ రన్.. డ్రైవ్ స్కామ్ అని ఆరోపించారు. ఈ మ్యాజిక్ ట్రిక్ అనుముల బ్రదర్స్‌కే ఎందుకు పరిమితం కావాలి? అని ప్రశ్నించారు. తెలంగాణలోని నిరుద్యోగ యువతీయువకులందరికీ అనుముల హబ్‌లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.