రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్ని విచారణలు.. ఎన్ని దర్యాప్తులు.. ఎన్ని కమిషన్లు.. ఎన్ని నివేదికలు. అరరే..! ఒక్కటా.. రెండా..! ప్రతి కల్పిత ఆరోపణకూ ఓ విచారణ.. ప్రతి రాజకీయానికీ ప్రత్యర్థిపై ఓ దర్యాప్తు. కాళేశ్వరం నుంచి కరెంట్ వెలుగుల దాకా.. ఫార్ములా ఈ-కార్ రేస్ నుంచి వ్యవసాయ క్షేత్రం దాకా కమిషన్లు, సిట్లు అంటూ ఫీట్లు చేస్తున్నరు. ప్రజాధనంతో సాగుతున్న ఈ ప్రహసనాల పరంపరకు ఇప్పటివరకు చేసిన ఖర్చెంత? తేల్చిన నిజమెంత? ప్రజలకు ఒరిగిందెంత? అధికారం అప్పగిస్తే..! పరిపాలన చేతగాక, ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేక దొంగాటకు దిగుతున్నరు.
కేసీఆర్ మీద భౌతిక ఒత్తిడి పెంచి ఏకంగా అంతమొందించాలనే కుట్రతో పాలక పార్టీ నేతలు వికృత క్రీడకు ఒడిగడుతున్నరు. కానీ అల్పమైన విచారణలు, అర్భకమైన దర్యాప్తులతో కేసీఆర్‌ను ఆపటం ఎవరి తరమైనా అవుతుందా? ఢిల్లీ పీఠాలనే గడగడలాడించి, చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన గండరగండని ఆత్మస్థైర్యాన్ని ఎత్తులు, జిత్తులు ఇసుమంతైనా కదిలించగలవా? కక్షసాధింపు రాజకీయాలు ఆయన దృఢచిత్తాన్ని దెబ్బతీయగలవా? విచారణ అనేది రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించే ఆయుధంగా మారిపోతే? అదే పాలనగా రూపాంతరం చెందితే.. తెలంగాణ గడ్డపై ప్రజా ఉద్యమాలు రగిలి రచ్చకెక్కవా?
కోటి ఎకరాల తెలంగాణ మాగాణానికి ప్రాణం పోసిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విషం కక్కడమే లక్ష్యంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌ను రంగంలోకి దించారు. 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ 2025 జూలైలో నివేదికను సమర్పించింది. ఆ 665 పేజీల నివేదిక తీసుకొచ్చి కేసీఆర్, హరీశ్‌రావుపై అసత్య ఆరోపణలు గుప్పిస్తే, హైకోర్టు డివిజన్ బెంచ్ రేవంత్ సర్కార్ చెంప చెళ్లుమనిపించేలా తీర్పునిచ్చింది. కనీస సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, ఏకపక్షంగా రూపొందించిన ఈ నివేదిక నిరర్థకమని తేల్చి చెప్పింది. నివేదికలో ఏమున్నదో అసెంబ్లీలో చర్చించకుండానే, ఆ పరాభవం నుంచి తప్పించుకునేందుకు సీబీఐ దర్యాప్తు అంటూ సరికొత్త రాగం అందుకోవడం ఆరోపణల డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణలో పంటలు ఎండిపోయి, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి.
అలాంటి చీకటి రోజుల్లో మన రాష్ట్రం మనకొచ్చింది. అటువంటి దయనీయ పరిస్థితులను సమూలంగా మార్చేసి, 24 గంటల నిరంతర వెలుగుల రాష్ట్రంగా నిలబెట్టిన దార్శనికుడు కేసీఆర్. పరిశ్రమలు, వ్యవసాయానికి కరెంట్ కొరత లేకుండా ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు ఒప్పందాలు చేసుకొని, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నిర్మిస్తే.. అందులోనూ అవినీతిని వెతికేందుకు రేవంత్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేసింది.
మొదట జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అధ్యక్షతన కమిషన్‌ను రంగంలోకి దింపింది. ఆయన విచారణ మొదలుకాకముందే మీడియా సమావేశాలు పెట్టి ఏకపక్ష వ్యాఖ్యలు చేయడాన్ని కేసీఆర్ సుప్రీంకోర్టు వేదికగా సవాల్ చేశారు. అత్యున్నత న్యాయస్థానమే అసహనం వ్యక్తం చేయడంతో ఆ కమిషన్ తలదించుకొని వైదొలగాల్సి వచ్చింది. ఆ పరాభవాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్‌ను తెరపైకి తెచ్చింది. రెండు విచారణ కమిషన్లు తలకిందులుగా తపస్సు చేసినా ఒక్క చిన్న తప్పును కూడా వేలెత్తి చూపలేకపోయాయి. ఫలితంగా ఆ నివేదికను కూడా సీబీఐకి నెట్టేశారు. నిరంతర విద్యుత్తు ఇచ్చిన పాలకుడిపై బురదజల్లబోయి, రెండు కమిషన్ల తర్వాత కూడా ఏమీ నిరూపించలేక కేంద్ర దర్యాప్తు సంస్థల పంచన చేరడం కాంగ్రెస్ పాలకుల రాజకీయ దివాళాకోరుతనానికి నిలువెత్తు నిదర్శనం.
ఫార్ములా-ఈ అంతర్జాతీయ రేస్‌ను కూడా రాజకీయ కక్షలకు వాడుకోవడం రేవంత్ పాలనలోని మరో దుర్మార్గం. హెచ్ఎండీఏ ఒప్పందాల ప్రకారం జరిగిన రూ.55 కోట్ల ప్రాజెక్టు లావాదేవీలపై ఏసీబీ ద్వారా తప్పుడు కేసులు బనాయించింది. గవర్నర్ అనుమతి పేరిట కొన్ని రోజులు డ్రామాలు నడిపారు. 77 పేజీల చార్జిషీటు వేసి, ఏసీబీ కోర్టులో విచారణల పేరిట వేధించాలని చూశారు. కానీ నిధుల దుర్వినియోగం జరిగినట్టు చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట రేవంత్ సర్కార్ మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నిఘా పెట్టారంటూ పోలీసు అధికారులపై కేసులు నమోదు చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేరిట నెలల తరబడి డ్రామాలు నడిపింది. ఏకంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకొన్నది. న్యాయస్థానంలో సమర్పించిన ఛార్జిషీట్లలో బీఆర్ఎస్ రాజకీయ నాయకత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయింది. ప్రత్యర్థులపై విషం చిమ్మడమే పరమావధిగా సాగిన ఈ ప్రహసనమంతా రేవంత్ ప్రభుత్వం ఆడిన దిగజారుడు రాజకీయ నాటకమని తేలిపోయింది.
తెలంగాణలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న భూమాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసి, రైతులకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ హక్కులను నేరుగా అందిస్తూ.. కేసీఆర్ తెచ్చిన చరిత్రాత్మక సంస్కరణ ధరణి పోర్టల్. అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పాలకులకు, క్షేత్రస్థాయిలో ఆ వ్యవస్థ విశిష్టత అర్థమై బిత్తరపోయారు.
ఎలాగైనా ధరణి మీద బురదజల్లాలన్న దుగ్ధతో 8 లక్షల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించారు. దాదాపు 22 వేల రిజిస్ట్రేషన్లలో తేడాలున్నాయని, మెదక్ తదితర జిల్లాల్లో వందల ఎకరాల ఇనాం భూముల పేరిట కేసులు పెడుతున్నామని ప్రభుత్వం హడావుడి చేసింది. కేసీఆర్ తీర్చిదిద్దిన పారదర్శక సాంకేతిక విప్లవాన్ని విధ్వంసం చేయాలనే తలంపే కాంగ్రెస్ సర్కార్ పాలనా లోపభూయిష్టతకు, అవగాహనా రాహిత్యానికి ప్రత్యక్ష సాక్ష్యం. మళ్లీ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా 22ఏ నిషేధిత భూముల చర్చలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంపై సరికొత్త దాడి మొదలుపెట్టింది. కేసీఆర్‌కు 1,000 ఎకరాల ఫామ్‌హౌస్ ఉన్నదంటూ ఊరూరా తిరిగి అబద్ధాలు ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి, ఫామ్‌హౌస్ విస్తీర్ణం 67 ఎకరాలు అని అసెంబ్లీ వేదికగా అంగీకరించారు. దళిత, బహుజనుల భూమిని కేసీఆర్ ఆక్రమించారంటూ పచ్చి అబద్ధాలు ఆడారు. ఆ భూములను దళితులకు పంపిణీ చేస్తానని అన్నారు. 30 రోజులు కాదు కదా.. 300 రోజులు రెవెన్యూ యంత్రాంగంతో జల్లెడ పట్టి విచారణ చేసినా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఒక్క అంగుళం కూడా ప్రభుత్వ భూమి లేదని రికార్డులే రుజువు చేస్తాయి. కానీ, రేవంత్‌రెడ్డి సర్కార్ ఉద్దేశం విచారణ కాదు. విచారణ పేరుతో రోజుకో అడ్డగోలు లీకును మీడియాకు వదిలి కేసీఆర్‌పై బురదజల్లి బదనాం చేయాలనే దురుద్దేశమే కనిపిస్తున్నది. రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూములపై ప్రజల్లో పెల్లుబుకుతున్న తీవ్ర ఆగ్రహాన్ని పక్కదారి పట్టించే పన్నాగం స్పష్టమవుతున్నది.
కేసీఆర్ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత. ఆ మహానేత వ్యక్తిత్వాన్ని, పాలనా ఘనతలకు వంకర ఎత్తులతో బురద అంటించటం ఎవరి వల్లా కాదు. నిరంతర విచారణలే పరిపాలనగా భ్రమిస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పటివరకు బూటకపు విచారణల పేరిట లూటీ చేసిన ప్రజాధనం లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయగలదా? కమిషన్ చైర్మన్లు, వారి సిబ్బంది జీతభత్యాలు, ఫోరెన్సిక్ పరీక్షలు, నిపుణుల సేవలు, న్యాయవాదులు, ప్రయాణాలు, పత్రాల సేకరణ, అట్టహాసమైన వాహనాలు, కార్యాలయాలు, విమాన ప్రయాణాలు, కోర్టుల్లో న్యాయవాదులకు చెల్లించిన ఫీజులు, వేల పేజీల నివేదికల ముద్రణలకు అంటూ ఖజానా నుంచి ఆవిరి చేసిన సొమ్ము లెక్కలు ప్రజల ముందు ఉంచగలదా ? అని ప్రజలు అడుగుతున్నరు.
కేసీఆర్‌కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నదంటూ ఊరూరా తిరిగి అబద్ధాలు ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి, ఫామ్ హౌస్ విస్తీర్ణం 67 ఎకరాలు అని అసెంబ్లీ వేదికగా అంగీకరించారు. దళిత, బహుజనుల భూమిని కేసీఆర్ ఆక్రమించారంటూ పచ్చి అబద్ధాలు ప్రకటించారు.