సిద్దిపేట, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కేసీఆర్ 300 ఎకరాల దళితుల భూమిని కబ్జా చేశారని అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేసిండు. కేసీఆర్ వద్ద ఎలాంటి దళితుల భూమి లేదని తేలితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నరా? ఒకవేళ ఉంటే మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధం’ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సవాల్ చేశారు. ధరణి, భూ వ్యవహారాలపై విచారణల పేరుతో హడావుడి చేసి చివరికి తోకముడిచారని విమర్శించారు.
భూముల వ్యవహారంపై తాను గతంలోనే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ధరణి, భూభారతి, సంబంధిత ఆస్తుల వ్యవహారాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించాలని కోరానని తెలిపారు. ఆ ప్రతిపాదనపై ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. రాష్ట్రంలో అనేక ప్రజాసమస్యలు ఉన్నాయని, వాటిపై అసెంబ్లీలో చర్చ జరుగాల్సిన సమయంలో భూముల పేరుతో రాజకీయ దుమారం రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ 420 హామీలు, గ్యారెంటీలపై చర్చ జరుగకుండా.. కాంగ్రెస్ బురద రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు.
ఎదురుదాడి చేసి తప్పించుకుందాం అనుకుంటే కుదరదని, తమ పోరాటం ఎప్పటికీ ప్రజల పక్షానే ఉంటుందని హెచ్చరించారు. ‘నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటం.. నిలదీస్తూనే ఉంటం’ అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి తేల్చిచెప్పారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్‌లా రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. నెట్టెంపాడు, కల్వకుర్తి మోటర్లు బంద్ చేసి ఆంధ్రాకు నీళ్లు తరలించి తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారని, కొండపోచమ్మ, రంగనాయక, మల్లన్నసాగర్ ప్రాజెక్టులకు నీళ్లు ఎత్తిపోయకుండా రైతుల పొట్టగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
22ఏ జాబితాలో లక్షలాది ఎకరాలు పెట్టి ప్రజలకు నరకం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తాము ప్రశ్నిస్తే.. సమస్యను పరిషరించకుండా తమపైనే ఎదురుదాడికి దిగుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాన్ని ఒప్పుకొన్నారని తెలిపారు. సమయం తకువ ఉండటంతో కలెక్టర్లు ఆగమాగం భూములను నిషేధిత జాబితాలో పెట్టారని ముఖ్యమంత్రి చెప్పారని గుర్తుచేశారు.
ఏకంగా 30 లక్షల ఎకరాలను 22ఏలో పెడితే ఆ రైతులు, ప్రజలు ఎంత ఇబ్బంది పడి ఉంటారో ఆలోచించాలని చెప్పారు. రైతుబంధు రాక, యూరియా అందక, పిల్లల పెండ్లిళ్లు, చదువుల కోసం భూములు అమ్ముకోలేక లక్షలాది మంది నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా ఎందుకు విచారణ చేపట్టలేదని, పర్యటనల పేరిట ఇప్పుడే ఎందుకు హంగామా చేస్తున్నారని నిలదీశారు. 22ఏతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను బీఆర్ఎస్ లేవనెత్తినప్పటి నుంచీ, ముఖ్యమంత్రి తమ్ముళ్ల భూ కుంభకోణాలను బయటపెట్టినప్పటి నుంచి, మంత్రి పొంగులేటి, ఆయన కొడుకు భూ దందాలను ఎండగట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కుళ్లు బుద్ధితో కక్షగట్టి తమపై ఎదురుదాడి చేస్తోన్నదని మండిపడ్డారు.
తన ఆస్తుల గురించి ప్రజలకు తెలియందేమీ లేదని హరీశ్ వివరించారు. ప్రతి ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించానని, అన్నీ చూసిన తర్వాతే ప్రజలు తనకు ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. అయినా కాంగ్రెస్ నేతలు అక్రమాలు జరిగినట్టు అభూత కల్పనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని, తాము సభకు వస్తామని కోరినా ప్రభుత్వం వినలేదని చెప్పారు. సభలో ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వ బండారం బయటపడుతుందనే తమను సస్పెండ్ చేసి ఏకపక్షంగా సభ నడిపించారని విమర్శించారు.
కాంగ్రెస్ ఎంపీల బృందం సిద్దిపేటకు వచ్చి పెద్ద హంగామా చేశారని హరీశ్ తెలిపారు. ఎవరు వచ్చినా అతిథి మర్యాదలు చేయడం సిద్దిపేట సంసృతి అని, అందుకే స్థానిక ఎమ్మెల్యేగా వారిని స్వాగతించి భోజనానికి ఆహ్వానించానని తెలిపారు. కావాలంటే దగ్గరుండి తానే తన వ్యవసాయ భూమిని చూపిస్తానని, వారి అనుమానాలను నివృత్తి చేస్తానని చెప్పారు. తన వ్యవసాయ భూమిలో విలాసవంతమైన ఫామ్ హౌస్ ఉన్నదని ముఖ్యమంత్రి, ఎంపీలు అంటున్నారని, తన భూమిలో విలాసవంతమైన భవనాలు కాదుకదా కనీసం బాత్రూం కూడా లేదని స్పష్టంచేశారు.
సిద్దిపేట పరిధిలోని రంగధాంపల్లి, ఎన్సాన్ పల్లి, మిట్టపల్లి, పొన్నాల ప్రాంతాల్లో సుమారు 3,000 ప్లాట్లను 22ఏలో పెట్టారని హరీశ్ తెలిపారు. ఇందులో పోలీస్ కానిస్టేబుళ్లు, రెవెన్యూ ఉద్యోగులు, ఇతరులు ఉన్నారని చెప్పారు. ‘మా పక్షాన మీరు మాట్లాడండి’ అని వారు తనను వేడుకుంటున్నారని తెలిపారు. ఎంపీల బృందానికి తన వ్యవసాయ భూమితో పాటు ఆ 22ఏ బాధితులను కూడా చూపిద్దామనుకున్నానని చెప్పారు. పనులు ఆగిపోయిన సిద్దిపేట వెయ్యి పడకల దవాఖాన, నర్సింగ్ కాలేజీ, రంగనాయక సాగర్ వద్ద రూ.100 కోట్లతో చేపట్టి నిలిచిపోయిన టూరిజం ప్రాజెక్టును ఎంపీలకు చూపిద్దామనుకున్నానని తెలిపారు.
ఎంపీల పర్యటన పేరుతో ఐజీ, డీఐజీ, కమిషనర్, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, డీఎస్పీలు, సీఐలతో కలిపి 3,000 మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలు, బుల్లెట్ ప్రూఫ్ బస్సులతో ఏదో యుద్ధానికి వస్తున్నట్టు సిద్దిపేట మీదికి వచ్చారని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజాధనాన్ని, ప్రభుత్వ సమయాన్ని ఎంత వృథా చేశారో ప్రజలే ఆలోచించాలని చెప్పారు. ప్రభుత్వాలు వాస్తవాలను దాచిపెట్టినప్పుడు ప్రతిపక్షాలు నిజనిర్ధారణకు వెళ్తాయని, కానీ అధికారంలో ఉండి ప్రభుత్వమే యాత్రలకు రావడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ‘మీ చేతిలోనే అధికారం ఉన్నది కదా.. మీరే నివేదిక సమర్పించుకోవచ్చు కదా?’ అని ప్రశ్నించారు.
ఎంపీలు యాత్రలు, దండయాత్రలు చేయడానికి చాలా అంశాలున్నాయని హరీశ్ సూచించారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరంతో పాటు ఏడు ప్రాజెక్టులకు అనుమతులు సాధిస్తే, ఇప్పుడు ఆ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని కేంద్రం జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టిందని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంపై దండయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ గోదావరి నీళ్లను ఎత్తుకుపోవాలని చూస్తుంటే సీడబ్ల్యూసీపై కాంగ్రెస్ ఎంపీలు దండయాత్ర చేయాలని సూచించారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి జిల్లాల మీదుగా పోవాల్సిన రీజినల్ రింగ్ రోడ్డు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పకన పెట్టిందని, ఒక అంగుళం కూడా పనులు ముందుకుపోలేదని విమర్శించారు. మెట్రో ఫేజ్-2, పాలమూరు ఎత్తిపోతల, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదని, వీటి సాధన కోసం, రాష్ట్ర హకుల కోసం కలిసికట్టుగా కేంద్రంపై పోరాడాలని సూచించారు.
ఎంపీలు వచ్చి భూములను కొలుస్తామని, రెవెన్యూ అధికారులకు డైరెక్షన్ ఇస్తామని చెప్పడం రెవెన్యూ వ్యవస్థను అవమానించడమేనని హరీశ్ వ్యాఖ్యానించారు. ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, కలెక్టర్లు, సీసీఎల్ఏ వంటి ఇంత పెద్ద వ్యవస్థ ఉంటే వారిపై ప్రభుత్వానికి నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. ‘ఎంపీల బృందానికి ఒకటే చెప్తున్నా.. సీఎం రేవంత్‌రెడ్డి పంపిస్తే మీరు వచ్చిండ్రు.. వెళ్లి వాస్తవాలు చెప్పండి.. హరీశ్ రావు బాయికాడ ఏమీ లేదని మీ కండ్లతో చూసింది చెప్పండి’ అని సూచించారు. ‘ప్రజా సమస్యల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్పై ఎదురుదాడి చేసినా మేము ప్రజల సమస్యలపై సర్కార్‌ను వదిలిపెట్టం. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తూనే ఉంటం’ అని తేల్చిచెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్ విమర్శించారు. తన వ్యవసాయ భూమికి తానే రోడ్డు వేయించుకున్నానని ముఖ్యమంత్రి అంటున్నాడని, వాస్తవానికి చంద్రాపూర్‌కు గతంలో ఉన్న నక్ష బాట రంగనాయక సాగర్ ప్రాజెక్టులో మునిగిపోయిందని చెప్పారు. సిరిసిల్ల రోడ్డుకు కనెక్ట్ అయ్యే ఆ రోడ్డు మునిగిపోవడంతో గ్రామస్తులు, సర్పంచ్, జడ్పీ చైర్మన్ తీర్మానం చేసి కోరిన మీదట ఇరిగేషన్ అధికారులే రోడ్డు వేశారని వివరించారు.
ఇరిగేషన్ నిధులతో వేసిన రోడ్డును సుడా నిధులతో వేశారని కాంగ్రెస్ నేతలు హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను వ్యవసాయ భూమిని ఒకసారి కొనుగోలు చేయలేదని, 2018 నుంచి 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి విడతల వారీగా కొనుగోలు చేస్తూ వచ్చానని తెలిపారు. తాను కొన్నట్టు అధికారిక డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పారు. తానే స్వయంగా ఆర్డీవో, కలెక్టర్, ఏడీ సర్వే అధికారులకు లేఖ రాసి, డీడీ కట్టి మరీ తన భూమికి హద్దులు చూపించాలని కోరానని తెలిపారు. రైతులు తనకు చూపించిన మ్యాప్, హద్దుల ప్రకారమే తాను భూమి కొనుగోలు చేశానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తహసీల్దార్, సర్వేయర్ వచ్చి సర్వేచేసి తన భూమికి హద్దులు చూపించారని చెప్పారు.
తాను రిజిస్ట్రేషన్ చేసుకున్నది 13 ఎకరాల 12 గుంటలు కాగా.. సర్వే తర్వాత 13 ఎకరాల 10 గుంటలు మాత్రమే తన స్వాధీనంలో ఉన్నదని, అంటే రెండు గుంటలు తకువే ఉన్నాయని తేలిందని తెలిపారు. తన భూమి కొనుగోలులో చిన్న తప్పు ఉన్నట్టు నిరూపించినా మొత్తం భూమిని ప్రభుత్వానికే వదిలేస్తానని చెప్పారు. తాము రైతు కుటుంబం నుంచి వచ్చామని, ఆ మమకారంతో వ్యవసాయం చేసుకుంటున్నామని తెలిపారు. అధికారం చేతిలో ఉన్నదని ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించినా తాము చట్టపరంగానే ఎదురొంటామని స్పష్టంచేశారు. తనపై లేదా తమ పార్టీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకున్నా చట్టపరమైన ప్రక్రియను అనుసరిస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, రాజనర్సు, భూపేష్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.